....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 9

సాంస్కృతిక విలక్షణత విభజనకు ప్రాతిపదిక కాదు!

అధ్యాయం-7
* ఆంధ్రప్రదేశ్ విభజన.. అత్యంత సంక్లిష్ట సమస్య
* వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం.. ఆత్మహత్యలతో ఉద్యమానికి ఊపు
* సాంస్కృతిక వివక్ష ఉంటే అది ఆందోళన కలిగించే తీవ్రమైన అంశం
* తెలంగాణ ఇస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రావొచ్చు


సామాజికంగా, సాంస్కృతికంగా, సినిమాలు, రచనలు, పండుగల విషయంలో తెలంగాణ సంస్కృతి వివక్షకు గురవుతోందని తెలంగాణవాదులు వాపోతున్నారు. రాష్టమ్రంతటా అత్యధిక ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతున్నప్పటికీ తెలంగాణ యాస ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకతను కొన్ని సందర్భాల్లో గేలిచేస్తున్నారన్న అభియోగం ఉంది. తెలంగాణవారిలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రజల్లోకూ ఇటువంటి ఆవేదనే ఉంది. అయితే, బోనాలు, సమ్మక్క సారక్క జాతర వంటి తెలంగాణ పండుగలు సీమాంధ్రలో ప్రజాదరణ పొందాయని, తెలంగాణపై వివక్ష లేదని సీమాంధ్ర ప్రాంతీయులు అంటున్నారు. సాంస్కృతిక వైరుధ్యాల లోతుపాతులను చర్చించేందుకు సమయం గాని, తగిన నైపుణ్యం గాని ఈ కమిటీకి లేవు. అయితే, భారత దేశం, అన్ని రాష్ట్రాల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన సకల సంస్కృతులు పరిఢవిల్లేలా తగిన వాతావరణం కల్పించాల్సిందిగా ఎస్‌ఆర్‌సి ఇచ్చిన సలహానే మేమూ ఇస్తున్నాం.

భారతదేశంలో విస్తృతంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, సాంస్కృతిక విభేదాల ప్రాతిపదికగా ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలన్న భావన వేరూనుకునే అవకాశం తక్కువ. సాంస్కృతిక వైవిధ్యం విస్తృత స్థాయిలో ఉండడమే ఇందుకు కారణం. అయితే, ఒక ప్రాంతంపై మరో ప్రాంతం సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ.. ఉపాధి రంగంలో, సాంస్కృతిక లేదా రాజకీయ జీవితంలో బాహాటంగా, పనిగట్టుకొని వివక్షకు గురిచేస్తుంటే.. అది ఆందోళనకలిగించే తీవ్రమైన అంశంగా మారుతుంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, సాంస్కృతిక సంవేదనలను పరిష్కరించేందుకు నిరూతపితమైన పద్ధతులేమీ లేవు. ఆమాటకొస్తే, సాంస్కృతిక విలక్షణతల మూలాలను చూపడం కూడా చాలా కష్టతరమైన పని. అయితే, చారిత్రక అనుభవాలు, సాంస్కృతిక సారూప్యతలు లేదా విలక్షణతలను ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవడం తగునా అన్నది పరిశీలనార్హం.

వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం వల్ల 2004 మే - 2005 నవంబర్ మధ్య 1068 మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం వల్ల సామాజికంగా నెలకొన్న అసంతృప్తి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా ఆజ్యం పోసింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణవాసులంతా దాదాపు ఏకస్వరంతో కోరుతున్నప్పటికీ, కొండ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు మాత్రం తమకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి డిమాండ్‌ను ఆమోదించడానికి బదులు.. ఆదివాసీల అభివృద్ధికి సంబంధించిన విధానాలను మరింత సమర్థవంతంగా అమలుచే యాల్సిన అవసరం ఉంది. చిన్న రాష్ట్రంలో ఎస్సీలు, మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యం ప్రబలమవుతుందన్న భావనతో ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో దళితులు అధికంగా పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల మహిళలు మానవ అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో అత్యధిక మంది మహిళలు ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ మహిళలు, విద్యార్థులు, విద్యార్థినులు సమైక్యాంధ్రే ఉండాలన్నారు. తెలంగాణ వస్తే తమకు రిజర్వేషన్ల శాతం పెరుగుతుందని ముస్లింలు ఆశిస్తున్నారు. అయితే, చిన్న రాష్ట్రంలో మత కలహాల బెడద ఎక్కువవుతుందని భయపడుతున్నారు. హైదరాబాద్‌లో పట్టుకలిగిన ఏఐఎంఐఎం మాత్రం సమైక్యాంధ్రనే కోరుతోంది. అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నది. అదే జరిగితే కోస్తా ఆంధ్రలో ముస్లింలకు నష్టం జరుగుతుంది.

తెలంగాణ పోరు జాతీయ ఐక్యతకు భంగకరం కానప్పటికీ, ఈ డిమాండ్ వల్ల జాతీయ స్థాయిలో కలిగే పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 1956 నుంచి మూడు ప్రాంతాల వారు కలసి నిర్మించుకున్న హైదరాబాద్‌కు సంబంధించి తమ హక్కులను ఎలా పరిరక్షించుకోగలరు? ఆ నగరాన్ని ఎలా వినియోగించుకోగలరన్న అంశం ప్రధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అనే అత్యంత సంక్లిష్ట సమస్యను ముందుకుతెస్తున్న డిమాండ్‌కు నిర్దిష్టమైన, సముచితమైన పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. రాష్ట్రాల విభజనకు ఏకరీతి విధానం తగదని, ప్రతి సందర్భాన్నీ వేర్వేరుగా చూడాలన్న రాష్ట్రాల పునర్విభజన సంఘం వాదన సమర్థనీయమైనదే.

రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా విభిన్న వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పించడం అవసరం. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి తెలంగాణకు చాలా తక్కువ కాలమే దక్కింది. ఈ అంశంపై దృష్టిపెట్టడం ద్వారా రాజకీయ పరాయీకరణను పారదోలడానికి అవకాశం ఉంది. వెనుకబాటుతనం ప్రాతికపదికగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజిస్తే... రాష్ట్రంలో అంతకన్నా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కూడా విభజనోద్యమం రాజుకునేందుకు ఆస్కారం ఉందనడానికి స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలను రాష్ట్రం కాపాడగలుగుతున్నప్పుడు మరింత ప్రజాస్వామిక వికేంద్రీకరణ, సమానత్వం సాధించేందుకు మరింతగా ప్రయత్నించాలి. అయితే, రాష్ట్రం వివిధ వర్గాలను సంతృప్తి పరచలేక సుదీర్ఘకాలంగా సతమతమయితే... అల్లర్లు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రూపంలో భారీ మూల్యం చెల్లించే కన్నా, అసంతుష్టులను ఎవరి దారి వారిని చూసుకోనివ్వడమే ఉత్తమం. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకావాలన్న డిమాండ్ చరిత్రలో చిరకాలం నుంచి కొనసాగుతున్నందున తెలంగాణ ప్రజల హృదయాలు తీవ్ర ఉద్వేగంతో ఉన్నాయి. వాస్తవంగా నెలకొన్న, ఉన్నాయని భావిస్తున్న ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి పాలకులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోకపోతే.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రస్తుతానికి చల్లారినా.. శాశ్వతంగా సమసిపోదు.

సీమ ముఖ్యమంత్రులు ఎందరు?
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న ముఖ్యమంత్రుల సంఖ్యలో తప్పు దొర్లింది. రాయలసీమకు చెందిన నేతలు 9 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారని నివేదికలో పేర్కొన్నారు. నిజానికి సీమకు చెందిన ఆరుగురు వ్యక్తులు 11 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. నీలం సంజీవరెడ్డి మూడు సార్లు (1956, 57, 62), వైఎస్ రాజశేఖరరెడ్డి(2004, 2009), కోట్ల విజయభాస్కరరెడ్డి (1982, 92), చంద్రబాబు (1995, 2000) రెండేసి సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. దామోదరం సంజీవయ్య 1960లో సీఎంగా సేవలందించగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.

No comments:

Post a Comment