....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 7

ఉద్యోగాల్లో ప్రాంతీయ సమతుల్యత పాటించాలి

అధ్యాయం-5
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆందోళనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ ఏమందంటే...
‘‘ప్రభుత్వరంగ ఉద్యోగాలకు సంబంధించి.. అన్ని వాస్తవాలను, భాగస్వాములందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించి విశ్లేషించిన తర్వాత కమిటీ ఈ కింది నిర్ధారణలకు వచ్చింది.

1. మొత్తం పనిచేస్తున్న జనాభాలో ప్రభుత్వ రంగ ఉపాధి పొందుతున్నవారి శాతం చాలా తక్కువ.
2. గడచిన రెండు దశాబ్దాల్లో - 1990 నుంచి 2010 వరకు, సామాజికార్థిక ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. వేగంగా విస్తృతమవుతున్న ప్రైవేటు రంగంలో భారీ ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ఇది.. ప్రభుత్వ రంగ ఉపాధిని ప్రాధాన్యతా పరంగా, సంఖ్యా పరంగా వెనక్కు నెట్టింది.

3. పాలనాయంత్రాంగంలో గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టుల్లో ‘ప్రాంతీయ రిజర్వేషన్లు’ కల్పించాలన్న డిమాండ్ వల్ల జాతీయ స్థాయిలో తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదు.
4. ఒకవేళ ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ సహా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు సంబంధించి.. 1975 నాటి రాష్టప్రతి ఉత్తర్వులు, సంబంధిత జీవోలు, హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు వంటి ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వులపై తగిన న్యాయ సలహాను, అవసరమైన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.

5. స్టాండింగ్ కౌన్సిల్/న్యాయాధికారుల నియామకానికి సంబంధించి.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు మంత్రుల కమిటీ.. ప్రాంతీయ, సామాజిక న్యాయం, సమధర్మం అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చేసిన సిఫారసులు సంతృప్తికరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు కమిటీతో మాట్లాడిన సందర్భంలో, అందించిన వినతిపత్రాల్లో.. వ్యక్తీకరించిన వివక్షా భావనను తొలగించేందుకు ఈ సిఫారసులు ఎంతగానో ఉపకరిస్తాయి కాబట్టి.. ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం.

రాష్ట్రంలో.. అడ్వొకేట్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, సభ్యులు వంటి ఇతర కీలక నియామకాల్లోనూ నిర్దిష్ట ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తే మేలు జరుగుతుందన్నది కమిటీ అభిప్రాయం. అలాగే.. సచివాలయంలో డెరైక్టరేట్లతో సహా సీనియర్ స్థానాల్లో మూడు ప్రాంతాల వారికీ న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసే కృషిని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనసాగించటం కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి ఈ కృషిని.. రాష్ట్ర సివిల్/పోలీస్ సర్వీస్ అధికారుల స్థాయి నుంచీ ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయంలో ఇటీవల కోర్టుల్లో న్యాయాధికారులు/స్టాండింగ్ కౌన్సిళ్లకు సంబంధించి చేసిన కసరత్తు.. తెలంగాణ ప్రాంత న్యాయవాద వర్గంలో సంతృప్తికర భావనను కలిగించిందని కమిటీ గుర్తించింది. ఇది ప్రభుత్వ నియామకాలు జరిగే అన్ని కార్యనిర్వాహక, కార్మిక, ప్రొఫెషనల్ సంస్థల్లో ఉద్యోగుల మధ్య సుహృద్భావ పరిస్థితులను పెంపొందించటానికి దోహదపడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి రక్షణ కోసం అదనంగా ఎలాంటి పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని మేం సూచిస్తున్నాం. అయితే.. ఇప్పటికే ఉన్న రక్షణ చర్యలను మరింత సమర్థంగా అమలు చేయాలి. ఉద్యోగాలకు సంబంధించి తమ సాధకబాధకాలను ప్రభుత్వం గత ఐదేళ్లుగా సీరియస్‌గా పరిష్కరిస్తుండటం పట్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల సానుకూల సంకేతాలను కమిటీ గుర్తించింది. ప్రభుత్వ చర్యలు వారికి.. అంతకుముందు జాప్యం వల్ల కలిగిన అసంతృప్తిని తొలగించి ఒక సంతృప్తి భావనను అందించాయి.’’

గిర్‌గ్లానీ నివేదిక అమలులో చాలా ప్రధానమైన అంశం.. స్థానికేతరులను వెనక్కు పంపటంగా కమిటీ పేర్కొంది. అందులో భాగంగా 1975 నుంచి 2006 వరకూ మొత్తం 5,10,234 మంది ఉద్యోగుల నియామకాల వివరాలను ప్రభుత్వం సమీక్షించినట్లు తెలిపింది. అయితే.. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఐదు, ఆరు జోన్లలో స్థానికేతరుల శాతం విస్మరించదగిన స్థాయిలోనే.. 20 శాతం పరిమితికన్నా చాలా తక్కువగానే ఉందని, ఎక్కువ మంది స్థానికేతరులు టీచర్లు, పారామెడికల్ సిబ్బందే ఉన్నారని గిర్‌గ్లానీ కమిషన్ పేర్కొన్నట్లు కమిటీ తన నివేదికలో వివరించింది.

సర్కారు 18,856 మందిని వెనక్కు పంపించాలని గుర్తించగా.. వారిలో 14,784 మందిని పంపించివేసినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్ ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్న అంశంపై తలెత్తిన వాదవివాదాలు, దానిపై ట్రిబ్యునల్ ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు, అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయటం, దానిని సుప్రీంకోర్టు కొట్టివేయటం, రాష్టప్రతి ఉత్తర్వుల్లో 14(ఎఫ్) నిబంధనను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయటం తదితర అంశాలను కూడా సవివరంగా చర్చించింది.

No comments:

Post a Comment