....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 4

ఆర్థిక సమానత్వం అవసరం

అధ్యాయం-2
నిర్లక్ష్యానికి గురైంది రాయలసీమే
తెలంగాణ కంటే వెనుకబడింది
తెలంగాణలో హైదరాబాద్ నగరంపైనే దృష్టి
మిగతా ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయి
గతంలో నిర్లక్ష్యం, వివక్ష నిజమే...ఇటీవల సమాన వాటా
హైదరాబాద్ ఉన్నా లేకున్నా ఆర్థికంగా తెలంగాణకు ఢోకా లేదు
హైదరాబాద్ అందరికీ అందుబాటులో ఉండాలి
వృద్ధిరేటు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ బాగానే ఉంది
ప్రత్యేక తెలంగాణ కోసం చేస్తున్న ప్రధాన వాదనల్లో ఒకటేమిటంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని.. అంతేకాదు వివక్షకు సైతం గురయిందని. అందువల్లే తెలంగాణ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిందనీ. కోస్తాంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉందని, ఉపాధికి, వ్యాపారాలకు, విద్యకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే విమర్శలున్నాయి. అంతేకాదు విస్తృత స్థాయి ఆర్థికావకాశాలు సైతం కోస్తాంధ్రకే దక్కాయనేది మరో ఆరోపణ. మొత్తం మీద.. నిర్దిష్ట మొత్తాలు, సంఖ్యలు, శాతాలను సమీక్షించినప్పుడు ఈ విమర్శల్లో కొంతవరకు వాస్తవం ఉన్నట్లుగానే కన్పిస్తోంది. కానీ మార్పు రేటు, అభివృద్ధి రేటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వాటాలను పరిశీలించినట్లైతే అంత అసాధారణమైన పరిస్థితులేమీ ఉత్పన్నం కావడంలేదు. హైదరాబాద్‌ను మినహాయిస్తే... ప్రస్తుత రాష్ట్ర జనాభాలో 36 శాతం తెలంగాణలో ఉంది.

రాష్ట్ర భూభాగంలో 41 శాతం మేరకు ఈ ప్రాంతం విస్తరించింది. ఏ అభివృద్ధి కొలబద్దలనైనా ఈ అంశాల ప్రాతిపదికనే చూడాలి. ఈ కోణంలో.. గతాన్ని అంటే వాస్తవ సమాచారం అందుబాటులో ఉన్న.. 1961 జనాభా లెక్కలు, 1956, 1974.. కాలాన్ని పరిశీలిస్తే తెలంగాణకు లభించిన వాటాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ జనాభా, వైశాల్యానికి తగిన విధంగానే అన్నివిధాలా సమానమైన, అంతకంటే ఎక్కువ వాటానే లభించింది. (అప్పటి ఇప్పటి.. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్ల వ్యవస్థ, విద్యుత్ వినియోగం, పంట లు, సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాలలో తెలంగాణ వాటాను కమిటీ గ్రాఫ్‌ల రూపంలో చూపించింది) అయితే తెలంగాణ విషయంలో నిర్లక్ష్యానికి సంబంధించి కొన్ని క్లిష్టమైన సూచనలున్నాయి. ఆర్థికవ్యవస్థలోని నిర్మాణాత్మక కారణాలు, హైదరాబాద్ జిల్లా/ పట్టణ పరిధిలో ఆర్థిక కార్యకలాపాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం ఇందుకు కారణంగా కన్పిస్తోంది.

మొత్తం మీద 50 ఏళ్లు ఆపై చిలుకు విధానపరమైన ప్రణాళిక, అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో వైవిధ్యాలను గమనించవచ్చు. అభివృద్ధిపరంగా వృద్ధిరేటు.. హైదరాబాద్‌ను మినహాయించినప్పటికీ ఇటు తెలంగాణలో అటు కోస్తాంధ్రలో బలంగానే ఉందని చెప్పాలి. అయితే ఇటు తెలంగాణలో అటు రాయలసీమలో, బలహీనవర్గాల్లో అసమానతలు పెరిగిపోవడమే ఆలోచించవలసిన విషయం. ఇందుకు విరుద్ధంగా కోస్తాంధ్రలో ఆదాయాల్లో అసమానతలు తగ్గడం కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసమానతపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అసమానతను గమనించాల్సిన అవసరముంది. ఇంత లోతైన అసమానత వేర్పాటువాద ఉద్యమాన్ని స్థిరంగా ఉంచడంతోపాటు ఈ మేరకు ఒత్తిడిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిని ఉద్యమిస్తున్న సంఘాలు, చివరకు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను ఉపయోగించుకునే అవకాశముంది.

పేదరికం, నిర్లక్ష్యం, సాధికారత కోణంలో తెలంగాణ అంశాన్ని చూస్తే రాష్ట్ర విభజనకు అవి అంత అనుకూలంకావు. ఆర్థిక, అభివృద్ధిపరమైన కొలబద్దలు చాలావరకు.. తెలంగాణ (హైదరాబాద్ మినహా) కోస్తాంధ్రతో సమానంగా ఉన్నట్లు లేదా కొంచెం మాత్రమే తక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నాయనేది వాస్తవం. అదే హైదరాబాద్‌ను కలిపి చూస్తే తెలంగాణలో పరిస్థితి చాలా బాగా ఉంది. ఇంకా చెప్పాలంటే అన్నివిధాలైన అభివృద్ధిలోనూ వృద్ధి రేటు విశేషంగా ఉంది. కోస్తాంధ్రకు సహజంగా కలిసివచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది ఎంతోకాలంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అయితే తెలంగాణలోనూ గత మూడు నాలుగు దశాబ్దాలలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించింది.

దీనినిబట్టి చూస్తే మొత్తం మీద నిర్లక్ష్యానికి గురైంది రాయలసీమే తప్ప తెలంగాణ కాదు. వాణిజ్య బ్యాంకుల సేవలు, అనుబంధ రుణాలు తెలంగాణకు కాస్త తక్కువగానే అందాయని చెప్పాలి. పంచాయతీల స్థాయిలో ఈ ప్రాంతానికి ఆర్థికంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. విద్య, వైద్య, సేవా రంగాలు, ఉపాధి విషయంలో హైదరాబాద్ నగరంపైనే దృష్టి కేంద్రీకృతమవడంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణలో ఇలాంటి వ్యత్యాసాలను తక్షణం తొలగించాల్సిన అవసరముంది.

ఆర్థిక అసమానతలే అసంతృప్తికి కారణం

ఈ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి ఆర్థిక అసమానతలు ఓ ముఖ్య కారణంగా కన్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆదాయాల మార్పులపై గత దశాబ్దానికిపైగా చేసిన పరిశీలన.. ధనికుల ఆదాయంలోనే పెరుగుదల ఉందని, పేదలు, బాగా నిర్లక్ష్యానికి గురైన వారి ఆదాయాల్లో మరింత క్షీణత నమోదైందని స్పష్టం చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మొత్తంమీద స్థిరంగా ఉంది లేదా కొంత మార్పునకు లోనైంది. అదే సమయంలో తెలంగాణలోని వ్యవసాయ కార్మికుల వాస్తవ ఆదాయం గణనీయంగా తగ్గగా, కోస్తాలో పెరిగింది. అలాగే తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆదాయం గత దశాబ్దం ఆపై కాలంలో క్షీణించగా, ఈ వర్గాలు కోస్తాంధ్రలో లాభపడ్డాయి. అయితే తెలంగాణలోని అగ్రకులాలు గణనీయంగా లబ్ధి పొందాయి. కానీ కోస్తాంధ్ర ధనికవర్గాల ఆదాయానికి కోత పడింది.

మొత్తంమీద అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో జీవన ప్రమాణాలు క్షీణించాయి. ‘సీమ’లో నెలవారీ తలసరి వినియోగం/ఖర్చు చాలాతక్కువగా ఉందనే విషయం వాస్తవమని ఇది స్పష్టం చేస్తోంది. మానవాభివృద్ధి విషయానికొస్తే.. తెలంగాణ, రాయలసీమల కంటే కోస్తాంధ్ర కొంతవరకు విజయవంతమైందనే చెప్పాలి. దశాబ్దకాలంలో ఈ రెండు ప్రాంతాల్లోనూ కొంత క్షీణత చోటు చేసుకోగా వీటిలో ‘సీమ’ మరింత క్షీణదిశలో పయనించింది.

ఆర్థిక పరిపుష్టిపై అనుమానాలు

రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్థికంగా అవి ఎంతవరకు తట్టుకోగలుగుతాయనే విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ పెద్ద రాష్ర్టం. జనాభా ప్రకారం ఐదోది. 2007-08 స్థూల ఉత్పత్తి ప్రకారం చూస్తే మూడో స్థానంలో నిలుస్తోంది. అదే తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారతదేశ సగటుకంటే కొంత ఎక్కువగా ఉండి దేశంలో 11వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలను ఒకదానితో మరొకదానిని పోల్చిచూసినా, ఇతర రాష్ట్రాలతో పోల్చినా కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు జీడీపీలో తెలంగాణ ప్రాంతం (హైదరాబాద్ మినహా) 28 రాష్ట్రాల జాబితా (ఏపీ మినహా)లో 15వ స్థానంలో నిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కంటే పైస్థానంలోనే ఉంది.

తలసరి ఆదాయాన్ని చూస్తే ..దేశ సగటు కంటే తెలంగాణ (హైదరాబాద్‌ను మినహాయించినా)లోనే కొంత ఎక్కువ. హైదరాబాద్‌ను కలిపిచూస్తే తెలంగాణ... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం విషయాల్లోనూ 13వ స్థానంలో నిలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం రాయలసీమ. కానీ తలసరి ఆదాయం జాతీయ సగటుకంటే కొంచెం మాత్రమే తక్కువ. మొత్తంమీద ఈ ప్రాంత స్థూలఉత్పత్తి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉంది. ఇక కోస్తాంధ్ర ఏపీలోనే ఆర్థిక పరిపుష్టమైన ప్రాంతంగా నిలుస్తోంది.

జీడీపీలో ఈ ప్రాంతం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే 13వ స్థానంలో ఉంది. తలసరి స్థూల ఆదాయాన్ని చూస్తే జాతీయ సగటుకంటే ఎంతో ఎక్కువ ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పదో స్థానంలో ఉంది. ఈ వివరాలను బట్టి... హైదరాబాద్ కలిసి ఉన్నా లేకున్నా తెలంగాణ నెట్టుకురాగలదనే విషయం స్పష్టమవుతోంది. రాయలసీమ, కోస్తాంధ్ర లు రాష్ట్రంగా కలిసి ఉన్నా ఎలాంటి ఢోకా లేదు. విడివిడిగా కూడా ఈ రెండు ప్రాంతాలు నిలబడగలవు. తెలంగాణకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర జీడీపీ పరిమాణాన్ని దేనికీ చెందని అంశం (న్యూట్రల్ ఫ్యాక్టర్)గా పరిగణించాలి.

‘మార్కెట్’ అవరోధాలు

ఇవి ఆర్థిక సంస్కరణల రోజులు. ఆర్థిక అవకాశాలు, మార్కెట్లు, ఉపాధి తదితర అంశాల ప్రాతిపదికన చిన్నదేశాలతో కూడిన గ్రూపులు ఏర్పడుతున్న సమయం. అయితే చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల వివిధ రాష్ట్రాల మధ్య వాణిజ్యం, సరుకు రవాణా, సర్వీసుల విషయంలో ఇంతకుముందే ఉన్న అవరోధాలు మరింత పెరుగుతాయనే భావన ఉంది. ఉదాహరణకు వివిధ రాష్ట్రాల పన్నులు, సెస్సులు స్వేచ్ఛా వాణిజ్యానికి అవరోధంగా మారవచ్చు. సరుకుల భౌతిక కదలికకు స్థానిక చట్టాలు ఆటంకం కావొచ్చు. రాయలసీమలో ఇలాంటి భయాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ విధమైన అవకాశాల విషయంలో హైదరాబాద్ తమకు దూరమవుతుందేమోననే అనుమానం ఉంది. హైదరాబాద్‌లో వ్యాపారాన్ని, మార్కెట్‌ను కోస్తాం ధ్ర కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొత్త రాష్ట్రాల అభివృద్ధిని నిరోధించే ఈ అంశం ఆంధ్రప్రదేశ్ విభజనకు దోహదపడదనే చెప్పాలి.

పాలనాపరమైన వాదనలు

మరోపక్క చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా అనేక వాదనలున్నాయి. పాలన, సమీకృత అభివృద్ధి ఆధారంగా ఈ వాదనలున్నాయి. చిన్నరాష్ట్రాలు.. పరిపాలనలో విస్తృత ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఎస్టీలకు, ముస్లింలకు ప్రయోజనం చేకూరవచ్చు. కోస్తాంధ్రలో ఈ వర్గాలు తక్కువగా ఉన్నందున అక్కడంత ఫలితం ఉండకపోవచ్చు. అందువల్ల పాలనపరంగా, ప్రాతినిధ్యపరంగా విభజనకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో వాదించడం వల్ల కొత్తగా ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లోనూ రెండు రకాలుగా ప్రభావం చూపించవచ్చు. సాధారణంగా పెద్దరాష్ట్రాల్లో దూరం, విస్తృతి దృష్ట్యా, ముఖ్యంగా రాజధానుల్లోనే పాలన కేంద్రీకృతమైనప్పుడు పరిపాలన కష్టమవుతుం దనే భావన ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చోటుచేసుకున్న రోజులివి. ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా మండలాల ( జిల్లా కంటే చిన్నదైన వ్యవస్థ) విధా నం కొనసాగుతోంది. పరిపాలన వికేంద్రీకరణ ప్రక్రియ ఊపందుకోవడం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థ

హైదరాబాద్ జిల్లా, పట్టణ పరిధిలోని ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన, మార్కెట్లపై దృష్టి అధికంగా ఉంది. ఉదాహరణకు రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తిలో జిల్లా వాటా 8%. హైదరాబాద్ పట్టణ పరిధి వాటా మరింత ఎక్కువ. తెలంగాణలో హైదరాబాద్ జిల్లా జీడీపీ ( హైదరాబాద్ కలిపి) వాటా 18 %. అందువల్ల హైదరాబాద్ నగరం, జిల్లా, పట్టణ పరిధిని... ఆంధ్రప్రదేశ్ ఆ మాట కొస్తే దేశ విదేశాల్లోని అన్ని ప్రాంతాల వ్యాపారులు, ప్రజలకు అం దుబాటులో ఉంచాల్సిన అవసరమెంతైనా ఉంది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం ద్వారా హైదరాబాద్‌పై రాజ కీయ నియంత్రణ ద్వారా కానీ మరోరకంగా కానీ సాధించవచ్చు.

2005 తర్వాత తెలంగాణ, సీమల జీడీపీలో ఊపందుకున్న వృద్ధి

జీడీపీ వాటాలో తెలంగాణ (హైదరాబాద్ మినహా), హైదరాబాద్ జిల్లాలు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. 1993-94లో 33 శాతం ఉన్న తెలంగాణ వాటా 2007-08లో 35 శాతానికి పెరిగింది. హైదరాబాద్ వాటా 5 నుంచి 8 శాతానికి పెరిగింది. అదే సమయంలో జీడీపీలో కోస్తాంధ్ర వాటా 44 నుంచి 41 శాతానికి, రాయలసీమలో 18 నుంచి 16 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 2005 నుంచి కోస్తాంధ్ర మినహా మిగతా ప్రాంతాలన్నిటిలో జీడీపీ వృద్ధి పైపైకి దూసుకుపోయింది.కోస్తాంధ్రలో మాత్రం ఆదాయంలో పెరుగుదల స్థిరంగా ఉంది. హైదరాబాద్‌పై దృష్టి కారణంగా 3 ప్రాంతాల్లోనూ పట్టణీకరణ అంతంతమాత్రమే.

తలసరి ఆదాయంలో 77% వృద్ధి నమోదు చేసిన హైదరాబాద్

ఏదైనా ఒక ప్రాంతం వృద్ధి రేటును బట్టి ఆ ప్రాంత ఆర్థిక స్థితిని అంచనా వేయవచ్చు. 2000-01, 2007-08 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం సగటు తలసరి ఆదాయం వృద్ధి 58 శాతంగా ఉంది. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ అత్యధికంగా 77 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ 60 శాతం, రాయలసీమ 58 శాతం, కోస్తాంధ్ర 54 శాతం వృద్ధి సాధించాయి. 1993-94తో పోల్చుకుంటే తెలంగాణ అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది.

అమ్మకం పన్ను వసూళ్లలో 75% హైదరాబాద్ నుంచే

2008-09లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.22 వేల కోట్లకు పైగా అమ్మకపు పన్ను వసూలైంది. ఇందులో ఏకంగా 75 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వసూలు కావడం గమనార్హం. హైదరాబాద్ నగరాన్ని మినహాయిస్తే కోస్తాంధ్రలోనే వాణిజ్య కార్యకలాపాలు అధికం. 15 శాతం వరకు అమ్మకం పన్ను ఇక్కడ వసూలవుతోంది. తెలంగాణ, రాయలసీమల్లో ఇది 8, 3 శాతాలుగా ఉంది.

2007-08లో తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల్లో)
కోస్తాంధ్ర : రూ.36,496
తెలంగాణ (హైదరాబాద్ కలిపి): రూ.36,082
తెలంగాణ (హైదరాబాద్ లేకుండా): రూ.33,771
రాయలసీమ: రూ.33,056

No comments:

Post a Comment