....

Footer Right Content

సేకరణలు

నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ 
పెదవి అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ
తీరం చేరిన ఆనందాన్ని తన తరగల
తరంగిణీ నృత్యంతో మాత్రమే చూసి
తరంగం మాయమౌతుందెందుకని?

కనురెప్ప పరదాల చాటు నుంచి వచ్చే సందేశం
మనసు చేరే లోపలే సందేహమవుతుందెందుకది?

నా కలలకి కథావస్తువా! నీ కెలా చెప్పను?
నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని
నీ కనురెప్పల చప్పుళ్ళలో నాకు వేదం వినబడుతుందని!
- యండమూరి ‘ఆనందో బ్రహ్మ’ నుంచీ
******

ఆకురాలుకాలం




అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది
వద్దు...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు
అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ...
అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు
అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు వెంటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా అతన్ని నాగుండెలో దాచుకుంటాను
అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకు రాలే కాలానికి ఎక్కడ రాలిపడ్డాడో?
(ఆంధ్రజ్యోతి దిన పత్రిక, జులై 26,1992)
- మహెజబీన్‌ "ఆకు రాలు కాలం" సంకలనం నుంచి