....

Footer Right Content

Monday, August 30, 2010

అచ్చ తెలుగు మాట...





అచ్చ తెలుగు మాట...
పచ్చి తెలుగు మాట...
తెలుగునాట ప్రతి నోట పలకాలని;
ప్రతిన బూనరా సోదరా...
తెలుగుతల్లి రుణం తీర్చుకోరా...
నిను కన్ననేల విలువ తెలుసుకోరా...
నడవరా తెలుగుబాట...
మన జాతికదే వెలుగుబాట...
- రామ జోగయ్య శాస్త్రి

Sunday, August 29, 2010

ఢిల్లీ తెలుగు వారిని ఉర్రూతలూగించిన 'జనంపాట-జనంమాట'

తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రజా కవి సుద్దాల హనుమంతు శతజయంతి ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 'జనంపాట-జనంమాట' కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. మూడు గంటలకు పైగా ఏకబిగిన సాగిన సాంస్కృతిక సాయంత్రం ఆహూతులను కట్టిపడేసింది. ఆదివారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో సాహితి, ఆంధ్ర అసోసియేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు

ఆర్చి బిషప్ మారంపూడి జోజి మృతి

ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ మారంపూడి జోజి (68) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు  బిషప్ మారంపూడి జోజి.  ఈయన ఓ దళితవాడలో.. పూరి గుడిసెలో..పేద కుటుంబంలో జన్మించి కేథలిక్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన దైవసేవకుడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇటలీకి చెందిన చెందినవారు బిషప్‌లుగా కొనసాగిన విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడిగా ఖ్యాతి పొందారు. హైదరాబాద్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన తొలి దళిత ఆర్చిబిషప్‌గా తనదైన ముద్రవేశారు.

నేడు మాతృభాషా దినోత్సవం

'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతి

గిడుగు రామ్మూర్తి పంతులు 147వ జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు.

అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను

Friday, August 27, 2010

‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను! ’... అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత నాకు చాలా ఇష్టం. మరి మీకో...


జయభేరి
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
* * *
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగిపోలేదా!
వానకాలం ముసిరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీతకాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!
* * *
నే నొక్కణ్ణీ
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమవుతాయి!
నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు కక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్లన్నీ పగిలిపోయీ,
నిశీథాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!
* * *
నే నొకణ్ణి ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి!
* * *
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

మన తెలుగు వెలుగులు

తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. అన్ని రంగాల్లోను ప్రతిభామూర్తులై వెలిగి జాతికి స్ఫూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.

Thursday, August 26, 2010

తెలుగు భాషా సాహితీవేత్తకు 'భాషా సమ్మాన్' పురస్కారం

ప్రసిద్ధ తెలుగు సాహిత్య చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు కొర్లపాటి శ్రీరామమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనను దక్షిణాది నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉత్తరాది నుంచి పంజాబీ పండితులు గురుదేవ్‌సింగ్‌ కూడా ఈ పురస్కారం లభించింది. ప్రాచీన, మధ్య యుగాల సాహిత్య రంగంలో వారు చేసిన విశేష కృషికిగానూ వారికి భాషా సమ్మాన్‌ ప్రకటిస్తున్నట్టుగా అకాడమీ తెలిపింది. వీరిద్దరుగాక, అకాడమీ గుర్తింపు లభించని ఆరు భాషల నుంచి మరో ఎనిమిది మందికి కూడా ఈ పురస్కారం లభించింది. భాషా సమ్మేళన్‌కు ఎంపికైన ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం ఇచ్చి సత్కరిస్తారు.

తెలుగుభాషలో కొర్లపాటి శ్రీరామమూర్తి అరుదైన, లోతైన పరిశోధనలు చేశారు. నన్నయ, తిక్కన, ఎర్రన కాలం నాటి గ్రంథాల నుంచి నిన్నమొన్నటి వరకు వచ్చిన రచనలను పరిశీలించి రెండువేల

Wednesday, August 25, 2010

వేదంలా ఘోషించే గోదావరి



చిత్రం: ఆంధ్రకేసరి
రచన : ఆరుద్ర
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా
 

Tuesday, August 24, 2010

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికీ, మానవ సంబంధాల మమతానురాగాలకూ ప్రతీక. రాఖీ పౌర్ణమి... రక్షాబంధన్‌... పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే. మానస వీణా తంత్రులను స్పృశించే తీరు ఒక్కటే. సందెపొద్దు వెలుగులా సడిచేసే శ్రావణీ నీకిదే స్వాగతం... ప్రేమానుబంధాల పల్లకిలో అరుదెంచు సౌధామినీ నీకిదే సుస్వాగతం అంటూ అందరూ ఆహ్వానించే ఆరోజు ఈరోజే. 'నీకు నేను, నాకు నువ్వు' అన్న మధుర భావనతో రాఖీ కట్టుకుని మురిసిపోయే అన్నా చెల్లెళ్లకూ, అక్కా తమ్ముళ్లకూ మరింత ప్రత్యేకమైన రోజిది. 'అన్నా' అన్న పిలుపులో ఎంత ఆనందమో... 'అక్కా' అన్న పలకరింపులో ఎంత అనురాగమో... 'చెల్లీ' అన్న మాటలో ఎంత అనుంబంధమో... 'నేస్తం' అన్న శబ్దంలో ఎంత తీయదనమో... అనుభవించే కొద్దీ అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఎన్నడూ తరగనివి, ఎప్పటికీ మాయనివి, ఏనాటికీ తనివి తీరనివి, ఆత్మీయతానురాగాల

Sunday, August 22, 2010

చెల్లెలి కోసం

అన్నాచెల్లెళ్ల మధ్య, అక్కాతమ్ముళ మధ్య అనుబంధం
విడదీయలేని రక్తసంబంధం.
ఆ బంధం ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం
ఓ అన్నయ్య తన చెల్లెలి కోసం పడిన తపన..
అమ్మపై చూపిన ప్రేమ..
గుండెలను స్పృశించే కథ ‘చెల్లెలి కోసం’
.

‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమైన ఈ కథ
నన్నెంతగానో ఆకట్టుకుంది.
మనసును ద్రవింపజేసింది.
మీరూ చదవండి......

Saturday, August 21, 2010

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యొ గ్రామ స్వరజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పంటపొలాల మందుల గత్తర వాసన

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

- గోరటి వెంకన్న

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల (వీడియో)

Tuesday, August 17, 2010

తెలుగు తేజానికి అరుదైన గౌరవం!


ఆదర్శ్ జాన్సన్ పేరిట టెక్సాస్ వర్సిటీలో స్మారక స్థూపం

అమెరికాలో హత్యకు గురైన తెలుగుతేజం ఆదర్శ్ జాన్సన్‌కు టెక్సాస్ యూనివర్సిటీ అరుదైన గౌరవం కల్పించింది. ఆయన హత్యకు గురైన నీటి కొలను ముందు ఓ స్మారక స్థూపాన్ని నిర్మించడమే గాక.. ప్రతి ఏటా ఆయనకు నివాళులర్పించాలని అధికారికంగా తీర్మానించింది. విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఓ విద్యార్థి పేరిట

Monday, August 16, 2010

విలువలకు గ్రహణం


హైదరాబాద్ : బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15న, ఉదయం 10.30గంటలకు సుందరయ్య వికాస వేదిక ఆధ్వర్యంలో 'స్వాతంత్య్రం, సమాజం, సంస్కృతి' అంశంపై జరిగిన సదస్సులో చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ స్వాతంత్య్రోదమం వలసదేశాలన్నింటిలో జరిగిన ఉద్యమాల కంటే విశిష్టమైనదని ఆయన తన ప్రసంగంలో

Sunday, August 15, 2010

ఇండియన్‌ ఐడల్‌-5గా తెలుగుతేజం శ్రీరామ్

రో తెలుగుతేజం మెరిసింది. పాటల పూదోటలోవిరజాజియై గుభాళించింది. గానామృతంతో భారతావని మదిని పులకింపజేసింది. తెలుగోడి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రాగమై, తానమై, పల్లవించాయి. ఎద ఎదనూ రంజింపజేశాయి. మదిమదినీ దోచేశాయి. పంద్రాగస్టు పర్వదినాన మన శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. హైదరాబాద్‌ పాటే గెలిచింది. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్‌ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు. ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో శ్రీరామ్‌ చూపిన ప్రతిభకు సలామ్‌ కొట్టనివారు లేరు. మొన్న శ్రీరామ్‌ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' అన్న పాటకు సంజయ్‌దత్‌ ఏకంగా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది. హాట్‌గర్ల్‌ బిపాసాబసు,

Saturday, August 14, 2010

64వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ....

తెలుగు తేజస్వి,
త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య
స్వాతంత్ర్యదినోత్సవం అనగా చిన్నా పెద్దా తేడాలేకుండా జాతీయ పతాకాలను చేబూని నినదించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జాతీయ పతాకాన్ని  రూపొందించింది మన తెలుగువాడు మనకు గర్వకారణం.  ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. 
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు (ప్రస్తుతం మొవ్వ మండలములో ఉంది) గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది.
ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేసేందుకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగిన బోయర్ యుద్ధములో పాల్గొన్న దేశభక్తుడు. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన

Friday, August 13, 2010

తెలుగోడి మెరుపుల్
















ప్పుడు లక్షా ఎనభై వేలమందిలో ఒక్కడు... ఇప్పుడు కోట్లమంది మెచ్చే గాయకుడు... ప్రముఖుల ప్రశంసలు... సినిమాల్లో అవకాశాలు... సెలెబ్రెటీ హోదా... క్షణం తీరిక లేని షెడ్యూల్‌... ఆ యువకుడే ... 'ఇండియన్‌ ఐడల్‌-5' ఫైనలిస్టు... 24 ఏళ్ల తెలుగుతేజం మైనంపాటి శ్రీరామచంద్ర!

Thursday, August 12, 2010

అవరోధాలు ఎదురైనా.. ఎదురులేని తేజం

జ్రం మెరవాలంటే... కోత తప్పదు. పసిడి కాంతులీనాలంటే కొలిమిలో కాలాల్సిందే. ఇరవై తొమ్మిదేళ్ల తేజస్వినీ సావంత్‌ ఈ రోజు.. షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిందన్నా... పన్నెండేళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డుని సమం చేసిందన్నా... ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత మహిళగా కీర్తినందుకొందన్నా... దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. అవరోధాలను దాటిన.. ఆర్థిక పరీక్షలకు ఎదురునిలిచిన నేపథ్యం ఉంది.

Sunday, August 1, 2010

అంతర్జాలంలో సమాచార అన్వేషణ..!


ప్రపంచంలో అతిపెద్ద సమాచార భాండాగారం ఏదైనా వుందంటే అది ఒక్క ఇంటర్నెట్‌ (అంతర్జాలం) మాత్రమే. ఇంతటి భాండాగారం నుంచి వెతికి పట్టుకునే ఓపిక మనకుండాలిగానీ ఏ సమాచారం కావలసినా ఇక్కడ లభ్యమవుతుంది. అయితే వచ్చిన చిక్కల్లా మనకు కావాల్సిన సమాచారాన్ని తక్కువ వ్యవధిలో వెతికిపట్టుకోవడమెలా అన్నదే. అవసరమైన సమాచారం అవసరమైన సమయంలో లభ్యంకాక నెట్‌పై గంటలకొద్దీ గడిపేవారు అనేకమంది వున్నారు. ఏవో నాలుగు పదాలు టైప్‌చేసి, వచ్చిన సమాచారంతో సంతృప్తి పడిపోయే వారైతే ఫర్వాలేదు గానీ ప్రత్యేకించి ఫలానా సమాచారం కావాలి అని అన్వేషించేటప్పుడు చాలా సందర్భాల్లో కావాల్సిన సమాచారం లభించకపోవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. ఎంత ప్రయత్నించినా సమాచారం దొరకకపోయేసరికి విసుగుచెంది, 'ఇంటర్నెట్‌లో అన్నీ దొరుకుతాయనుకోవడం భ్రమ' అంటూ ఓ నిట్టూర్పు విడవడమూ పరిపాటే.
సమాచార సేకరణలో అంతర్జాలాన్వేషణ ఒక అద్భుతమైన కళ. వాస్తవానికి మన వెదుకులాటంతా ఒకటి రెండు సెర్చ్‌ఇంజన్ల చుట్టూనే తిరుగుతుంటుంది. ఏరకమైన సమాచారం కావాలన్నా వీటి చుట్టూనే తిరుగుతుంటాము తప్ప ఒక్కో సమాచారం ఒక్కో సెర్చ్‌ ఇంజన్‌లో వెదకడం సులువుగా వుంటుందనే విషయం ఎంతకీ మనకు అవగతంకాదు. వెదకడం చేతనైతే సమాచారం క్షణాల్లో లభిస్తుంది. అందుకు అవసరమైన కీవర్డ్స్‌, బులియన్‌ అపరేటర్‌ పదాలు, సింబల్స్‌నీ పద్ధతిగా ఉపయోగిస్తే తొంభైతొమ్మిది శాతం ఆశాభంగమనేది వుండదు.
ఇంతటి సమాచార భాండాగారాన్ని శోధించడం ఏ ఒకటో రెండో సెర్చ్‌ఇంజన్ల వల్ల అయ్యేపని కాదు. దీనికి వేలాది సెర్చ్‌ ఇంజన్‌ సైట్లు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వీటిని- సెర్చ్‌ ఇంజన్లు, వెబ్‌ డైరెక్టరీలు, మెటా సెర్చ్‌ ఇంజన్లు అనే మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.
సెర్చ్‌ ఇంజన్‌ : మనం ఇచ్చిన కీవర్డ్స్‌ ఆధారంగా ఇంటర్నెట్‌లోని వెబ్‌పేజీలను అన్వేషించి, సంబంధిత పేజీల లింక్‌లతో ఫలితాలను అందిస్తుంది. ఈ పనిని CGI (Common Gateway Interface) వంటి సర్వర్‌సైడ్‌ స్క్రిప్ట్‌లు చేస్తాయి.
వెబ్‌ డైరెక్టరీ : ఉన్నతస్థాయి వెబ్‌సైట్లు కొన్ని అంతర్జాలంలోని వివిధ వెబ్‌సైట్లనన్నిటినీ సమీక్షించి, వాటిలోని సమాచారం ఆధారంగా వాటిని డైరెక్టరీలుగా, సబ్‌డైరెక్టరీలుగా విభజించి, సిద్ధంగా వుంచుతాయి. వీటినే 'వెబ్‌ డైరెక్టరీ'లు అంటారు. ప్రత్యేక సమాచారం కావాలనుకొన్నప్పుడు తప్ప ఏదైనా సాధారణ సమాచారం కోసమైతే నేరుగా ఈ వెబ్‌ డైరెక్టరీలలోకి వెళ్ళి, ఆయా సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌ డైరెక్టరీ సైట్‌లు సెర్చ్‌ ఇంజన్‌ సదుపాయాన్ని కూడా కలిగి వుంటాయి. సమాచారాన్ని ఆ ప్రత్యేకమైన వెబ్‌ డైరెక్టరీల నుంచో, లేదా మొత్తం ఇంటర్నెట్‌ అంతటినుంచో సెర్చ్‌ ఇంజన్‌ ద్వారా వెదకవచ్చు. ఉదాహరణకి ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్‌ ఇంజన్‌ కమ్‌ వెబ్‌డైరెక్టరీ యాహూ! లో ఏదైనా విషయాన్ని వెదికితే... ఇంటర్నెట్‌ నుంచే కాక, వెబ్‌ డైరెక్టరీల నుంచి కూడా పేజీలను ఎంపిక చేసి చూపుతుంది.
మెటా సెర్చ్‌ ఇంజన్లు : మెటాక్రాలర్‌, వెబ్‌క్రాలర్‌లను మెటా సెర్చ్‌ ఇంజన్లు అంటారు. ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవి అనేక సెర్చ్‌ ఇంజన్ల సమూహాలు. ఏదైనా ఒక విషయాన్ని వీటిలో సెర్చ్‌ చేసినప్పుడు ఏకకాలంలో అనేక సెర్చ్‌ ఇంజన్ల ద్వారా ఆ సమాచారాన్ని వెదికి, వచ్చిన ఫలితాలను సమీక్షించి, మనం అడిగిన సమాచారానికి ఎక్కువ సంబంధం కలిగి వున్నవాటిని ముందుగాను, తక్కువ సంబంధం వున్నవాటిని ఆ తర్వాత వరుసలోనూ కనిపించేటట్లు చూపుతుంది. ఇందువల్ల మనకెంతో సమయం ఆదా అవుతుంది. ఏదైనా ఒక సమాచారం కోసం గూగుల్‌లో ప్రయత్నించడం... అక్కడ లభ్యంకాక మరొకటి మరొకటి అంటూ... అలసిపోయేకంటే ఒకేసారి అన్నిటినీ సెర్చ్‌ చేసే మెటాసెర్చ్‌ ఇంజన్‌ ద్వారా ప్రయత్నించడం మంచిది. అటువంటప్పుడు ఇక మామూలు సెర్చ్‌ ఇంజన్లు ఎందుకు ? అందరూ మెటాసెర్చ్‌ ఇంజన్లనే వాడవచ్చు కదా! అనే అనుమానం రావడం సహజం. అయితే మామూలు సెర్చ్‌ ఇంజన్లు, డైరెక్టరీలు లేకపోతే మెటాసెర్చ్‌ అనేదే లేదు. అంతేకాకుండా ఒక్కో సెర్చ్‌ఇంజన్‌కి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఆయా సెర్చ్‌ ఇంజన్‌ల ద్వారా సెర్చ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం వుంటుంది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొన్ని సెర్చ్‌ ఇంజన్ల స్వరూప స్వభావాలను చూద్దాం:
అల్టావిస్టా (www.altavista.com):  సెర్చ్‌ ఇంజన్‌ అనగానే ఇటీవల చాలామంది గూగుల్‌ అంటున్నారు. కానీ నిజానికి ఎప్పటినుంచో సమర్థవంతమైన సెర్చ్‌ ఇంజన్‌గా దీనికి పేరుంది, అంతర్జాలంలో ఫొటోలను, ఆడియో, వీడియోలను మొదటి పరిచయం చేసిన సెర్చ్‌ఇంజన్‌ కూడా ఇదే. ప్రపంచ ప్రసిద్ధమైనది అల్టావిస్టా. ఏ రకమైన సమాచారాన్నయినా క్షణాల్లో అందించగల అపురూపమైన ఇంజన్‌ ఇది. ముఖ్యంగా ఇమేజ్‌లను సెర్చ్‌ చేయడంలో దీనికి సాటిలేదని పేరు.
ఆస్క్‌జీవాస్‌ (www.ask.com)  : మామూలుగా మనం ఒక ప్రశ్న అడిగితే అందులో ముఖ్యమైన పదాలను మాత్రమే సెర్చ్‌ ఇంజన్లు గుర్తిస్తాయి. is, was, how, why, do  వంటి పదాలను విస్మరిస్తాయి. అందువల్ల ఇటువంటి పదాలను వదలి, నేరుగా ముఖ్యమైన రెండు మూడు కీవర్డ్స్‌ని మాత్రమే టైప్‌ చేస్తాం. కానీ ఆస్క్‌జీవాస్‌లో కీవర్డ్స్‌ కాకుండా నేరుగా ప్రశ్ననే టైప్‌ చేసే వీలుంది. అంతేకాకు దీనికి వున్న మరో ప్రత్యేకత... మన ప్రశ్నకి సంబంధించిన లింక్‌ వున్న ఇతర విషయాలను కూడా అక్కడే అందిస్తుంది.
గూగుల్‌ (www.google.com):  ప్రస్తుతం ఎవరికీ పరిచయం అవసరంలేని సెర్చి ఇంజన్‌ గూగుల్‌. ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి పొందిన సెర్చ్‌ ఇంజన్‌ కూడా ఇదే. ఉన్నత స్థాయికి చెందిన ఆధునికమైన టెక్స్‌ట్‌- మ్యాచింగ్‌ టెక్నిక్స్‌ సహాయంతో మనకి కావలసిన, సంబంధిత సమాచారాన్ని క్షణాల్లో వెదకడం దీని ప్రత్యేకత. ఇపుడు ఈ సెర్చ్‌ ఇంజన్‌ దాదాపుగా భారతీయ భాషలన్నిటిలోనూ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించుకుని ఆదరణ పొందుతోంది.
హాట్‌బాట్‌ (www.hotbot.com):  ప్రపంచ ప్రసిద్ధ 'వైర్‌డ్‌ మ్యాగజైన్‌'కి చెందిన ఈ ఇంజన్‌ ఇంక్‌టామి (Inktomi) సెర్చ్‌ పవర్‌తో పనిచేస్తుంది. సమాచారాన్ని ప్రాంతాలవారీగా సెర్చ్‌ చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.
లైకోస్‌ (www.lycos.com):  హాట్‌బాట్‌తో అనుబంధం కలిగిన లైకోస్‌ పలు వెబ్‌ సర్వీస్‌లను అందిస్తుంది. వాటిలో సెర్చ్‌ కూడా ఒకటి. కొత్తవారికి అన్ని విధాలా సహకరిస్తూ సులభంగా సమాచారాన్ని అందించే ఈ వెబ్‌సైట్‌ ఉచిత వెబ్‌స్పేస్‌ను కూడా అందిస్తుంది.
వెబ్‌క్రాలర్‌ (www.webcrawler.com):  మెటా సెర్చ్‌ ఇంజన్‌ అయిన వెబ్‌క్రాలర్‌ అతి సాధారణమైన ఇంగ్లీష్‌ పదాల ద్వారా మంచి ఫలితాలను అందించడంలో దిట్ట. నెట్‌ సెర్చ్‌ చేయడంలో కొత్తవారికి సహకరించేలా రూపొందించినదే అయినా అనేక అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కూడా కలిగి వుంది.
యాహూ! (www.yahoo.com):  అత్యంత విస్తృతమైన వెబ్‌ ఇండెక్స్‌ని కలిగిన డైరెక్టరీ - కమ్‌ - సెర్చ్‌ ఇంజన్‌ ఇది. ఈ సర్చ్‌ఇంజన్‌ని మన స్వంత సైట్లో కూడా ఉచితంగా ఉంచవచ్చు. యాహూ సెర్చ్‌ఇంజన్‌ కూడా గూగుల్‌ పవర్‌తో నడుస్తోందిపుడు.
ఇంటర్‌నెట్‌లో డాక్కుమెంట్‌లకే కాక ఇతర విషయాలనూ సెర్చ్‌ చేయవలసి వస్తూంటుంది. నెట్‌లో ప్రత్యేక విషయాల మీద ఆసక్తి కలిగిన అనేక మంది ప్రత్యేకమైన న్యూస్‌ గ్రూపులుగా ఏర్పడి. పరస్పరం ఇ-మెయిల్స్‌ పంపుకుంటూ ఉంటారు. వీటిని 'మెయిలింగ్‌ లిస్ట్‌' లు అంటారు. ఆ న్యూస్‌ గ్రూప్స్‌ మెయిలింగ్‌ లిస్ట్‌లలో ఎంతో గొప్ప సమాచారం లభిస్తూంటుంది. మామూలు వెబ్‌ సర్చ్‌లో ఈ సమాచారం లభించకపోవచ్చు. అటువంటపుడు ప్రత్యేకంగా న్యూస్‌ గ్రాపుల్ని వెదకడం మంచిది. దీనికోసం యాహూ గ్రూప్స్‌(groups.yahoo.com),  గూగుల్‌ గ్రూప్స్‌ (groups.google.com)  డేజా (www.deja.com),  సన్‌సైట్‌ గ్రూప్‌ సెర్చ్‌ (sunsite.unc.edu/usenet-i/search.html)  వంటి సైట్లను ఉపయోగించుకోవచ్చు.
అదే విధంగా వ్యక్తుల అడ్రస్‌లు, ఇ-మెయిల్స్‌ వివరాల కోసం 'పీపుల్‌ సెర్చ్‌' చేయవలసి ఉంటుంది. ఈ విధమైన సమాచారం అందించడంలో బిగ్‌ఫుట్‌ (www.bigfoot.com)  సైట్‌ చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇ-మెయిల్‌, ఇంటి అడ్రస్‌లతో బాటు వీధి మేప్‌లను కూడా అందించే ఈ పీపుల్‌ సెర్చ్‌ సౌకర్యాలు చాలా వరకూ అమెరికాకే పరిమితమవుతున్నాయి. వ్యక్తిగత వివరాలను అందించే ఈ పీపుల్స్‌ సెర్చ్‌ సైట్లు టెలిఫోన్‌ నంబర్స్‌ని, వ్యక్తిగత వెబ్‌సైట్‌ అడ్రస్‌లనూ కూడా అందించగలవు. కానీ దీనికి కొంత సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి సైట్లలో మరోక ప్రసిద్ధ సైట్‌ (www.whowhere.com),  పీపుల్‌ సెర్చ్‌ (www.yahoo.com/search/ people/email.html) లో కూడా వ్యక్తుల ఇ-మెయిల్‌ అడ్రస్‌లను వెదకవచ్చు.
సాఫ్ట్‌వేర్స్‌ని సెర్చ్‌ చేయడంలో అత్యంత విశ్వసనీయమైన సెర్చ్‌ ఇంజన్‌లు అన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

టుకౌస్‌: (www.tucows.com)  ఏంటివైరస్‌, గేమింగ్‌, మల్టీమీడియా, కనెక్టివిటీ - ఇలా వివిధ విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్స్‌ సమాహారం ఈ సైట్‌. రెండు ఆవుల (Two-Cows)  సింబల్‌ కలిగిన ఈ సైట్‌ సాఫ్ట్‌వేర్‌ సెర్చ్‌లో ముఖ్యమైనది.

డౌన్‌లోడ్‌: (www.download.com) : CNETకి చెందిన ఈ సెర్చ్‌సైట్‌ వెబ్‌ ప్రపంచంలోని అతి ముఖ్యమైన షేర్‌వేర్స్‌ని, ఫ్రివేర్స్‌ని ఒక క్రమపద్ధతిలో అందిస్తుంది.

షేర్‌వేర్‌: (www.shareware.com) ది కూడా షేర్‌వేర్స్‌ వర్గీకరించి, డౌన్‌లోడ్‌కి వీలుగా అందించే ప్రసిద్ధ సైట్‌. ఇంకా sharewarejunkies, totalshareware, zdnet, hotflies  మొదలైనవన్నీ ఈ కోవకి చెందినవే.

జాంబో: (www.jumbo.com): రెండున్నర లక్షలకు పైగా షేర్‌వేర్స్‌నిFTP విధానంలో డౌన్‌లోడ్‌కి అందించే ప్రసిద్ధ సైట్‌ ఇది. విండోస్‌ మాత్రమే కాక, మేక్‌, యునిక్స్‌ వంటి ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపై పనిచేసే సాఫ్ట్‌వేర్స్‌ని కూడా ఈ సైట్‌ అందిస్తుంది.
చిన్న సెర్చ్‌ఇంజన్‌ ద్వారాను, పెద్ద వెడ్‌ డైరెక్లరీ నుంచీ లభించే సమాచారం కూడా సరిపోని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి Ph.D.  చేసేటపుడు వారికి కావలసిన సమాచారం అనేక సెర్చ్‌ఇంజన్లతో ఒకేసారి వెదికే మెటాసెర్చ్‌ చేయక తప్పదు. అయిగే ఒకోసారి ఇది కూడా పూర్తి ఫలితాలను అందిచలేకపోవచ్చు. అటువంటి సందర్భాలలో ప్రత్యేకమైన 'సెర్చింగ్‌ సాఫ్ట్‌వేర్‌'ని ఆశ్రయించక తప్పదు.
సెర్చింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందినది కోపర్నిక్‌ (Copernic).  మామూలు సెర్చ్‌ఇంజన్‌ల మాదిరి కాకుండా ఇది ప్రత్యేకమైన టెక్నిక్స్‌తో పని చేస్తుంది. ఇది వెబ్‌ సమాచారాన్ని రకరకాలుగా అన్వేషించి, వేగంగా పని పూర్తయ్యేటట్లు చేస్తుంది. అంతే కాక మనం చేసిన సెర్చ్‌ని దశలవారీగా దాచి ఉంచడం, ఫలితాలను విశ్లేషించడం వంటి అదనపు సైకర్యాలను కూడా కలిగి ఉంది.
ఈ కోపర్నిక్‌ సాఫ్‌వేర్‌ - ఏజంట్‌, ఎంటర్‌ప్రైజ్‌, సమ్మరైజర్‌ అనే మూడు వర్షన్స్‌గా లభిస్తోంది. 'ఏజంట్‌' వ్యక్తిగతంగా వెబ్‌ సమాచారాన్ని అన్వేషించడానికి, ఎంటర్‌ప్రైజ్‌ ఎడిషన్‌ సంస్థలకూ ఉపయోగపడతాయి. సమ్మరైజర్‌ ఏ డాక్యుమెంట్‌/వెబ్‌ పేజిని అయినా వెంటనే విశ్లేషించి సంక్షిప్తంగా విషయాన్ని అందిస్తుంది.
అయితే సెర్చ్‌ విషయానికి వస్తే బాగా ఉపయోగపడేది కోపర్నిక్‌ ఏజంట్‌, ప్రస్తుతం దీని వర్షన్‌ 6.0 లభిస్తోంది. దీనిలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి - జేసిక్‌, పర్సనల్‌, ప్రొఫెషనల్‌. వీటిలో బేసిక్‌ వర్షన్‌ని కోపర్నిక్‌ సూట్‌ (www.copernic.com/en/products/agent/download.html)  నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
కోపర్నిక్‌ వంటి సాఫ్టవేర్లు తమ పద్ధతిలో తాము సెర్చ్‌ చేస్తాయి. అయితే ఫ్రీగా లభించే వర్షన్స్‌ పరిమితంగా పని చేస్తాయి. కాబట్టి సమాచారం కోసం సామాన్యులు సెర్చ్‌ఇంజన్‌ సైట్లపై ఆధారపడక తప్పక. సెర్చ్‌ఇంజన్‌ ద్వారా అన్వేషణ చేసేటపుడు కొద్దిపాటి మెలువల పాటస్తే ఎటువంటి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్‌ అవసరమూ ఉండదు.
ప్రాథమికంగా అన్ని సెర్చ్‌ఇంజన్లు చేసే పనీ ఒకటే అయినా అవి పనిచేసే తీరులో తేడాలు ఉంటాయి. ఆ తేడాలను గుర్తించి, ఏ సెర్చ్‌ఇంజన్‌ని ఎలా ప్రశ్నిస్తే సరైన ఫలితాలతో కావలసిన సమాచారం లభిస్తుందె గ్రహించాలి. ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్‌ఇంజన్లు చాలా వాటిలో ఉపయోగించవలసిన కొన్ని మెళకువలను, చిన్న చిన్న సూచనలనూ ఇక్కడ ఇస్తున్నాం. అయితే ఇందులో ప్రతీదీ ప్రతి సెర్చ్‌ఇంటన్‌కి సరిపోకపోవచ్చు. కానీ ఉపయోగించే సెర్చ్‌ఇంజన్‌ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండి, సరిగ్గా ఉపయోగపడతాయి, కావలసిన సమాచారాన్ని క్షణాల్లో కళ్లముందు ఉంచుతాయి.

సెర్చింగ్‌ మెళకువలు :
* కీవర్డ్స్‌ ఉపయోగించేటపుడు వీలైనంత ఖచ్చితమైన పదాల్ని ఉపయోగించండి. మారుతి 800 కారు గురించి సమాచారం కావాలంటే CARS అనో, ABOUT CARS  అనో టప్‌ చేయకండి. అలా చేస్తే అనవసరమైన ఫలితాలు వచ్చి, వాటి నుంచి అసలు సమాచారాన్ని పొందడం కష్టమవుతుంది.
* పదాల మధ్య ఒక స్పేస్‌ మాత్రమే ఉండేలా జాగ్రత్త వహించండి.
* కొన్ని సెర్చ్‌ ఇజన్లు కేస్‌ సెన్సిటివ్‌ ఆప్షన్‌ని కూడా అందిస్తున్నాయి. అంటే క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ భేదాన్ని సెర్చ్‌ఇంజన్‌ గురించాలా వద్దాఆ అనేది మనమే నిర్ణయించుకోవచ్చు.
* కొన్ని ఇంజన్లు పంక్చుయేషన్‌ని, కోట్స్‌నీ ఒకేలా గుర్తిస్తాయి. దానిని గమనించండి.
* స్పానిస్‌ : ఫ్రెంచ్‌ వంటి ఇతర భాసల రిజల్ట్స్‌ కూడా కలగలిసిపోయి, అవసరమైన సమాచారం మరుగునపడిపోకుండా లాంగ్యేజ్‌ సెట్టింగ్స్‌లో ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ని సెలెక్ట్‌ చేసుకోవడం మంచిది.
* కొన్ని పదాలు ప్రక్కపక్కనే టైప్‌ చేసినపుడు కొన్ని సెర్చ్‌ఇంజన్లు ఆ పదాలన్నిటినీ కలిగి ఉన్న వెబ్‌ పేజీలను అందిస్తే, మరికొన్ని సెర్చ్‌ ఇంజన్లు ఆ పదాలలో ఎ ఒక్కటి ఉన్నా ఆ వెబ్‌పేజీలను అందిస్తాయి. అంటే cat, dog  అని సెర్చ్‌ చేస్తే కొన్ని cat OR dog  గా అర్థం చేసుకుంటాయి. ఎక్కువ సైట్లు గానే అర్థం చేసుకుంటాయి.
* బులియన్‌ ఆపరేటర్లను ఉపయోగించడం వల్ల ఎంతో సమర్థవంతమైన సెర్చ్‌ చేయవచ్చు. AND, OR, NOT,  డబుల్‌ కొటేషన్స్‌ '' '', పేరెంథసిస్‌ (), NEAR, AND, NOT  - ఇవన్నీ ఆపరేటర్లే. కీవర్ట్స్‌తో వీటిని వాడినపుడు సెర్చ్‌ఇంజన్‌ Tableలో సూచించిన విధంగా అర్థం చేసుకుంటుంది.
అల్టావిస్టా, గూగుల్‌ వంటి సైట్లు సెర్చ్‌ ఇంజన్‌లోనే కొన్ని విభాగాలను ఏర్పరచాయి. ఏ రకం ఫైల్‌ కావాలంటే ఆ విభాగాన్ని వెదికితే పని సులభమవుతుంది.
అదేవిధంగా కొన్ని సెర్చ్‌ఇంజన్లు సకల సౌకర్యాలూ కలిగిన తమ టూల్బబార్స్‌ని అందిస్తున్నాయి. యాహూ, గూగుల్‌, అల్టావిస్టా మొదలైనవన్నీ ఈ కోవకు చెందినవే. ప్రతిసారీ సెర్చ్‌ఇంజన్‌ సైట్‌లోకి వెళ్లవలసిన పనిలేకుండా ఇవి పనికివస్తాయి. కాకపోతే బ్రౌజర్‌లో కొంత స్థలాన్ని ఆక్రమిస్తాయి. కొన్ని ప్రకటనలతో విసిగిస్తాయి.

- cat AND dog  అని టైప్‌ చేస్తే- cat మరియు dog అనే రెండు పదాలు వున్న వెబ్‌పేజీలను చూపించు అని అర్థం.
- cat OR dog అని టైప్‌ చేస్తే- cat, dog   అనే పదాల్లో ఏ ఒక్కటివున్నా, రెండూవున్నా ఆ పేజీలను చూపించు అని అర్థం.
- "cat or dog"  అని టైప్‌ చేస్తే- cat and dog   అనే పదప్రయోగం, పద సమూహం సరిగ్గా అదే వరుసలో చూపించు అని అర్థం.
- (tiffin OR meals) AND (tea AND coffee) అని టైప్‌ చేస్తే- టిఫిన్‌గాని, మీల్స్‌గాని వుండి, టి, కాఫీ రెండూ వున్న పేజీలను చూపించు అని అర్థం.
- cat NEAR dog  అని టైప్‌ చేస్తే- cat అనే పదం, dog అనే పదం కాస్త దగ్గర దగ్గరలో అంటే - 10నుంచి 15 పదాలలోపు వుండే పేజీలను చూపు అని అర్థం.
- cat AND NOT dog  అని టైప్‌ చేస్తే- cat అనే పదం వున్న పేజీలను వెదికి, వాటిలో వేటిలోనైనా dog అనే పదం వుంటే వాటిని తీసేసి, మిగిలిన పేజీలను అందించు అని అర్థం. ఇక్కడ AND NOT  అనే పదాలను కలిపి వుపయోగించాలి. ఇలాకాక NOT ఒక్కటే ఉపయోగిస్తే కొన్ని సెర్చ్‌ఇంజన్లు ఈ అర్థాన్ని గురించవు.
- కొన్ని ఆల్టావిస్టా వంటి కొన్ని సెర్చిఇంజన్లు * ను కూడా గుర్తిస్తాయి. ఉదాహరణకు cal*r  అని సెర్చ్‌ చేస్తే- color, colour - రెండిటినీ సెర్చ్‌ చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా పదానికి సంబంధించిన స్పెల్లింగ్‌ సరిగా తెలియనప్పుడు ఆ పదంలో సందేహం వున్నచోట * ను టైప్‌ చేయడం ద్వారా ఫలితం పొందవచ్చు.

- RajuKX