అప్పుడు లక్షా ఎనభై వేలమందిలో ఒక్కడు... ఇప్పుడు కోట్లమంది మెచ్చే గాయకుడు... ప్రముఖుల ప్రశంసలు... సినిమాల్లో అవకాశాలు... సెలెబ్రెటీ హోదా... క్షణం తీరిక లేని షెడ్యూల్... ఆ యువకుడే ... 'ఇండియన్ ఐడల్-5' ఫైనలిస్టు... 24 ఏళ్ల తెలుగుతేజం మైనంపాటి శ్రీరామచంద్ర!మొన్న హేమచంద్ర.. నిన్న కారుణ్య... జాతీయస్థాయి పాటల పోటీల్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు. దేశ వ్యాప్తంగా ఎందరినో మెప్పించి ఫైనల్స్ వరకూ వెళ్లి తెలుగు తేజాన్ని వెదజల్లిన గాయకులు. ఈసారి హైదరాబాద్ కుర్రాడు శ్రీరామచంద్ర వంతు. 'ఇండియన్ ఐడల్-5'గా చిరపరిచితమైన టీవీ రియాలిటీ షోలో విజేతగా నిలిచే అవకాశానికి ఒకే మెట్టు దూరంలో నిలిచిన మనవాడు. 'ఈసారి గురి తప్పేలా లేదు... విజయం తెలుగువారిదే' అనిపించుకుంటూ పాటల పల్లకిలో ఆశల బాధ్యత మోస్తున్న ఇతగాడి సత్తా రేపు జరగబోయే తుది పోటీల్లో మెరుపులు మెరిపించనుంది. ఇంతకీ ఎవరీ యువకుడు? మామయ్య వేలు పట్టుకొని..
చిన్నప్పటినుంచి శ్రీరామ్‌కు సంగీతమంటే ప్రాణం. మామయ్య సి. వెంకటాచలం 'మెగాస్టార్స్' పేరుతో ఆర్కెస్ట్రా నిర్వహించేవాడు. చిన్నారి శ్రీరామ్ ఆయనతో కలిసి కచేరీలకు వెళ్లేవాడు. అలా ఎనిమిదేళ్లకే రవీంద్రభారతి వేదికపై తొలి పాట పాడాడు. రాన్రాను ఆ ఆసక్తి సాధనతో రాటు దేలింది. ఎక్కడ పాట వినిపించినా చెవులు రిక్కించేవాడు. రాత్రిళ్లు నిద్ర మానుకొని రేడియోలో హిందీ, ఇంగ్లిష్ పాటలు వింటూ ఊగిపోయేవాడు. దీన్ని గమనించిన స్నేహితుడు అనిల్ 'ఒరేయ్ నీకున్న ఇష్టానికి సంప్రదాయ సంగీతం తోడైతే మంచి సింగర్ అవుతా'వంటూ 'శ్రీ భక్త రామదాసు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ'లో చేర్పించాడు. శ్రీరామ్ అప్పుడు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. అక్కడే 'హైదరాబాద్ సిస్టర్స్'లో ఒకరైన హరిప్రియ దగ్గర ఐదేళ్లు కర్నాటక సంగీతం నేర్చుకున్నాడు. ప్రఖ్యాత పాల్ అగస్టీన్ దగ్గర రెండేళ్లు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. ముంబైలో ఉన్నపుడు కొన్నాళ్లు గౌతం ముఖర్జీ మాస్టారి దగ్గర హిందుస్థానీ సంగీత సాధన చేశాడు.
లక్షల మందిలో ఒకడు...
గుండె గొంతుకలో కొట్లాడుతున్నప్పుడు బహుమతులకేం తక్కువ? ఏ పోటీకి వెళ్లినా ఇతడిదే జయం. 'ఇండియన్ ఐడల్' గురించి ఇతడికి తొలిసారిగా తెలిసింది 2004లో. అప్పుడే పాల్గొనాలనుకున్నా ఆడిషన్స్ ముగియడంతో వీలుకాలేదు. తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సంగీతంలో ఐదేళ్ల డిప్లొమా కూడా చేతికందింది. ఇండియన్ ఐడల్-5 పోటీలకు సిద్ధమయ్యాడు. ఆడిషన్స్ జరుగుతున్న అహ్మదాబాద్‌కు బయల్దేరాడు. అక్కడ తెల్లవారుజామున మూడుగంటలకెళ్లి క్యూలో నిల్చుంటే సాయంత్రానికిగానీ పాడే అవకాశం రాలేదు. అహ్మదాబాద్‌లో ఇరవై ఒక్కవేలమంది... దేశవ్యాప్తంగా లక్షా ఎనభైవేలమంది మంది యువ గాయనీ గాయకులు పోటీ పడ్డారు. ఐదు వడపోతల్లో వరుసగా 120, 40, 25, 16, 13 మంది మిగిలారు. శ్రీరామ్ రెండుసార్లు డేంజర్ జోన్‌లో ఉంటూనే టాప్ 3లోకి చేరడం విశేషం.
మనసు దోచేశాడు!
కార్యక్రమం మొదలైన రోజు నుంచి శ్రీరామ్ పాటకు పరవశించని జడ్జీలు, గెస్ట్‌లు లేరు. మనోడి 'క్వాజా మేరే క్వాజా...' పాటకు సంజయ్‌దత్ కళ్లనీళ్లు పెట్టుకుంటే... జాన్ అబ్రహం 'నా పాటకు నీ వాయిస్ అయితేనే కరెక్ట్' అని తేల్చేశాడు. ఇక డ్రీమ్‌గర్ల్ హేమమాలిని తెలుగులో మాట్లాడి కోరి మరీ నచ్చిన పాట పాడించుకుంది. బిపాషా బసు, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి సుందరాంగులు శ్రీరామ్ గాత్రానికి జోహార్లు పలికారు. ఇండియన్ ఐడల్ జడ్జీల్లో ఒకరైన అనూమాలిక్‌కు మొదటినుంచి ఫేవరిట్ సింగర్ మనోడే. 'బాలీవుడ్‌లో ఓ మంచి సింగర్‌గా రాణించే సత్తా నీకే ఉంది' అని వేదిక మీదే చెప్పేశాడు. మరో జడ్జి... సంగీత దర్శకుడు సలీం మర్చంట్ ఏకంగా తను చేస్తున్న సినిమాలో శ్రీరామ్‌ని మేటి గాయని శ్రేయా ఘోషల్‌తో కలిసి పాడించాడు. నార్త్, సౌత్ తేడా లేకుండా సామాన్య జనమంతా చెబుతున్న ఒకటే మాట శ్రీరామచంద్రే కాబోయే ఐడల్ అని. ఇండియన్ ఐడల్ వెబ్‌సైట్లోకెళ్లి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమవుతుంది.
ప్రతిభకు పట్టం
* ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీల విజేత.
* స్టార్‌ప్లస్ 'వాయిస్ ఆఫ్ ఇండియా' సెమీఫైనలిస్టు.
* ఈటీవీ 'సై' ఫైనలిస్టు.
* 'సంగం కళా గ్రూప్' పోటీల్లో మొదటిస్థానం.
* బిగ్ ఎఫ్.ఎం. పోటీల్లో 'వాయిస్ ఆఫ్ ఆంధ్ర'గా ఎంపిక.
* సింగపూర్, దుబాయ్, లండన్‌లతో పాటు ఇప్పటికి 80 స్టేజీ షోలు.
* నలభై ఐదు తెలుగు సినిమా పాటలు.
* హిందీలో 'హమ్' అనే ప్రైవేట్ ఆల్బం.
* శ్రీరామచంద్ర అంటే వేటూరికి ప్రత్యేక అభిమానం
* గిటార్ వాయించడమంటే ఇష్టం
శ్రీరామ్ పాటల తోటలో...
* నచ్చానో లేదో...(అష్టా చమ్మా) * అరెరె చేజారిందా...(బోణి) * చిరుగాలులతో నేనడిగా...(నోట్‌బుక్) * నందగోపాలా...(అందరిబంధువయా) * నువ్వు ఒక పూల వాసం...(కోతిమూక)
థాంక్స్... తెలుగు ప్రజల అభిమానంతో మీరంటున్నది జరగాలి. * ఇండియన్ ఐడల్ కోసం ఎలా కష్టపడ్డారు... ఏమేం వదలుకున్నారు? తెల్లవారుజామునే లేచి సాధన చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు. ఇండియన్ ఐడల్‌కోసం ఇంకొంచెం సమయం ఎక్కువ కేటాయిస్తున్నా. ఇదంతా నాకిష్టమే కాబట్టి కష్టంగా ఏమీ లేదు. ఇక చేసిన త్యాగాల్లేవు... ఏం వదులుకోనూలేదు. కొన్నాళ్లు ఇంటికి దూరమయ్యాననే చిన్న బాధ తప్ప. * అమ్మాయిలా చీర కట్టుకొని ఆడ, మగ రెండు గొంతులతో పాడారు. కష్టమనిపించలేదా? కిషోర్‌కుమార్ ఆ పాట పాడారు. అందులో ఆయన స్వయంగా ఆడవేషంతో నటించి పాడారు. ఆ స్ఫూర్తితోనే అలా చేశాను. * ఇష్టమైన గాయకులు, సంగీత దర్శకులు? గాయకుల్లో కిషోర్ కుమార్, లతాజీ, ఆశాభోంస్లే సంగీత దర్శకుల్లో ఆర్.డి.బర్మన్ తెలుగులో మణిశర్మ, కోటి ఇలా చాలామంది. * లక్ష్యం... దేశం మెచ్చే మంచి సింగర్‌గా పేరుతెచ్చుకోవాలి * కుటుంబం గురించి... నాన్న ప్రసాద్ హైకోర్టులో న్యాయవాది. అమ్మ జయలక్ష్మి గృహిణి. చెల్లెలు అశ్విని ఎంబీఏ చేస్తోంది. వాళ్ల సహకారంతోనే ఇక్కడివరకొచ్చా. | |
No comments:
Post a Comment