....

Footer Right Content

Friday, August 27, 2010

మన తెలుగు వెలుగులు

తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. అన్ని రంగాల్లోను ప్రతిభామూర్తులై వెలిగి జాతికి స్ఫూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.
* శంకరంబాడి సుందరాచారి: రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి. తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్నమొన్నటి దాకా దక్కాల్సినంత పేరు దక్కలేదు. ఈ మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
* పొట్టి శ్రీరాములు (1901-1952): ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆత్మార్పణం చేసిన త్యాగ ధనుడు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ ప్రధానాశయాలుగా గాంధీజీ అడుగు జాడల్లో నడచిన మహనీయుడు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు. తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ.
* గిడుగు రామమూర్తి పంతులు (1863-19409): ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.
* కందుకూరి వీరేశలింగం (1948-1919): గొప్ప సంఘ సంస్కర్త, సాహితీ వేత్త. కథ, నవల, వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్య శ్రీకారం చుట్టినవాడు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. వివేకవర్థిని పత్రికను స్థాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను, దురాచారాలను తూర్పార బట్టారు. అధికార వర్గాల్లోని అవినీతి, అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు.
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (19వ శతాబ్దం పూర్వార్థం): దేశ స్వాతంత్య్రంకోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.
* గురజాడ అప్పారావు (1862-1915): 'దేశమును ప్రేమించుమన్నా' అంటూ దేశ భక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు. భాషా సాహిత్యాలు, కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి. గురజాడ సృష్టించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.
* రఘుపతి వెంకటరత్నంనాయుడు (1862-1939): సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల్లో రుజువర్తన, నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు. మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులేనంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.
* టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు. తెలుగు వారి గుండెలొల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం. బారిస్టర్‌గా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. సైమన్‌ కమిషన్‌ వచ్చినపుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్ర జాతి గుండెను గెలుచుకున్నారు.
* పింగళి వెంకయ్య (1878-1963): భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత. స్వాతంత్య్ర సమర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, గుండె నిండుగా దేశాభిమానమే కాదు, మెదడు నిండుగా విజ్ఞానాన్ని ధరించిన వాడు. కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు, వెండి పతకాలను గెలుపొంది రాయల్‌ ఎగ్రికల్చర్‌ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.
* బండారు అచ్చమాంబ (1874-1905): స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్న ఆరోజుల్లోనే చదువుకోడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను 'అబలా సచ్ఛరిత్ర రత్నమాల' పేరుతో ఒక్క చేతితో రాశారు. భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు. స్త్రీ సమాజాలను స్థాపించారు.
* డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్‌ కార్బామజీన్‌ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్‌ అనే యాంటీబయోటిక్‌ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్‌ హైడ్రోజన్‌లను కనుగొన్నారు.

No comments:

Post a Comment