....

Footer Right Content

Thursday, August 26, 2010

తెలుగు భాషా సాహితీవేత్తకు 'భాషా సమ్మాన్' పురస్కారం

ప్రసిద్ధ తెలుగు సాహిత్య చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు కొర్లపాటి శ్రీరామమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనను దక్షిణాది నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉత్తరాది నుంచి పంజాబీ పండితులు గురుదేవ్‌సింగ్‌ కూడా ఈ పురస్కారం లభించింది. ప్రాచీన, మధ్య యుగాల సాహిత్య రంగంలో వారు చేసిన విశేష కృషికిగానూ వారికి భాషా సమ్మాన్‌ ప్రకటిస్తున్నట్టుగా అకాడమీ తెలిపింది. వీరిద్దరుగాక, అకాడమీ గుర్తింపు లభించని ఆరు భాషల నుంచి మరో ఎనిమిది మందికి కూడా ఈ పురస్కారం లభించింది. భాషా సమ్మేళన్‌కు ఎంపికైన ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం ఇచ్చి సత్కరిస్తారు.

తెలుగుభాషలో కొర్లపాటి శ్రీరామమూర్తి అరుదైన, లోతైన పరిశోధనలు చేశారు. నన్నయ, తిక్కన, ఎర్రన కాలం నాటి గ్రంథాల నుంచి నిన్నమొన్నటి వరకు వచ్చిన రచనలను పరిశీలించి రెండువేల

పేజీల పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. చరిత్రచర్చ, చిత్రశాల, గుడిగోపురం, వీణ, సువర్ణకథలు, ప్రతిజ్ఞ, పాండవుల మెట్ట, పలనాటి వీరచరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు మరియు భువన విజయము, సమత, నటన మరియు పరిస్థితి వంటి సాహిత్య గ్రంథాలు, నవలలు ఆయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి.

తూర్పు గోదావరి జిల్లా కొర్లవారిపాలెంలో 1929లో జన్మించిన శ్రీరామమూర్తి, తెలుగు సాహిత్యంలో డీలిట్‌ డాక్టరేట్‌ డిగ్రీని సాధించిన తొలి వ్యక్తిగా విశిష్టులు. 100కు పైగా చారిత్రకపత్రాలు, మరెన్నో విమర్శలు, చారిత్రక నవలలు రచించారు. మొదటిసారిగా తెలుగు సాహిత్య చరిత్రను వెలువరించిన చరిత్రకారుడు. 'చరిత్ర-చర్చ' పేరిట వెలువడిన తొమ్మిది విమర్శనాత్మక మౌలిక పరిశోధనా పత్రాలు తెలుగు సాహిత్య చరిత్రకు కొత్త దారులు తెరిచాయని ప్రసిద్ధి. ఐతరేయ బ్రాహ్మణం నుంచి విక్రమాదిత్యుని కాలం వరకు ఆంధ్ర ప్రసక్తి, ఆంధ్ర ప్రశస్తిలపై ఆయన స్వయంగా చేసిన పరిశోధనలు అపూర్వమైనవి. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పనిచేశారు. ఎనిమిది ఎంఫిల్‌, పన్నెండు పీహెచ్‌డీ డిగ్రీలు సాధించారు. రాష్ట్రంలోగాని, దేశంలోగాని ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. భాషా సమ్మాన్‌ కూడా చాలా ఆలస్యంగానే లభించిందని చెప్పాలి. ఆయన ప్రస్తుతం విశాఖలోని చినవాల్తేరులో స్థిరపడ్డారు.
 

4 comments:

  1. ఇంత గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    భాష గురించి ఏమాత్రం ఆసక్తి లేని ఈ రోజుల్లో వీరికి గుర్తింపు రాలేదని బాధ సరే, సాహిత్యం కోసం కృషి చేసే వారి రచనల గురించి సాహిత్య అకాడమీ వారైనా తగిన ప్రోత్సాహం అందిస్తే బాగుంటుంది.

    ReplyDelete
  2. రాజాబాబు గారికి
    "మొదటిసారిగా తెలుగు సాహిత్య చరిత్రను వెలువరించిన చరిత్రకారుడు." అన్నది సత్యం కాదేమో ... ఇప్పటి వరకు వెలువడిన అన్ని సాహిత్య చరిత్రలలోకెల్ల కొర్లపాటి వారి ’తెలుగు సాహిత్య చరిత్ర’ అత్యంత ప్రామాణికమైంది అన్నది మాత్రం నిజం.
    అలాగే, "ఎనిమిది ఎంఫిల్‌, పన్నెండు పీహెచ్‌డీ డిగ్రీలు సాధించారు." అని కాదేమో ... వ్రాయాల్సింది. "ఎనిమిది ఎంఫిల్‌, పన్నెండు పీహెచ్‌డీ డిగ్రీల పరిశోధకులకు మార్గ దర్శకత్వం వహించారు." అని వ్రాయాలి.
    మహా పండితులు, పరిశోధకులు, విమర్శకులు మరియు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి అగ్రేసర ప్రియ శిష్యులు అయిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా అభినందనలు!
    ఈ వార్తా విశేషాన్ని బ్లాగు లోకానికి అందించినందుకు మీకు ధన్యవాదాలు!

    ReplyDelete
  3. మంచి పని చేసారు

    ReplyDelete
  4. తెలుగుందేజములై వెలుంగు ఘనులన్ దెల్పంగ కేయెక్సుగా
    రలఘుంబ్లాగున వ్రాయుచున్ బుధజనోల్లాసంబుగా సాహితీ
    జలధుల్ యీదిన కొర్లపాటి ఘనతల్ , సాహిత్య సమ్మానముల్
    తెలియంజెప్పిరి , సాహితీజగతి ప్రీతింబొందు నాంధ్రావనిన్ .

    ReplyDelete