....

Footer Right Content

Saturday, July 24, 2010

అంతర్జాలంలో రచ్చబండలు

సాంకేతిక విజ్ఞానంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తకొత్త ఆవిష్కరణలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహాలో ప్రజలకు చేరువైన సాంకేతిక విప్లవం అంతర్జాలం (ఇంటర్నెట్‌). ఇది ఆవిష్కృతమైన తొలినాళ్ళలో ఒక వెబ్‌సైట్‌ అంటేనో, ఇ-మెయిల్‌ చేయడమంటేనో చాలా ఘనంగా వుండేది. వెబ్‌ 2.0 ఆవిర్భవించాక సామాన్యులకు సైతం చేరువైన సాంకేతిక విప్లవం సోషల్‌ నెట్వర్కింగ్‌. దీన్నే 'సామాజిక కూడలి' అని కూడా వ్యవహరిస్తున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే అంతర్జాలంలో రచ్చబండలు. రచ్చబండలనగానే మనకు గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలపై జరిగే చర్చలు. గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక రకాల అంశాలు చర్చించడం సర్వవిదితమే. ప్రస్తుతం ఈ చర్చలు సోషల్‌ నెట్వర్క్‌ల వేదికగా అంతర్జాలాన్ని ఏలుతున్నాయి. అంతర్జాలాన్ని వాడే ప్రతి నలుగురిలో ముగ్గురు ఏదోక సోషల్‌ నెట్వర్క్‌లో సభ్యులవుతున్నారని, ఈ ఆన్‌లైన్‌ సంబంధాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా చదువులోనూ, కెరీర్‌లో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంప్యూటర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సోషల్‌నెట్వర్క్‌లలో ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మింగిల్‌బాక్స్‌, ఐబిబూ, మైస్పేస్‌, ఫ్లికర్‌ వంటివి ఎన్నో వున్నాయి. ఇంకా అనేక కొత్తకొత్త నెట్వర్క్‌లు పుట్టుకొస్తున్నాయి. గూగుల్‌ సెర్చింజన్‌ ఆర్కుట్‌ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు యాహూ కూడా సోషల్‌ నెట్వర్కింగ్‌ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. యాహూకు చెందిన అని సైట్లలో ఇప్పుడు ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ లాంటి సోషల్‌ నెట్వర్కింగ్‌లకు చెందిన ఫీచర్స్‌ లభ్యమవుతున్నాయి. అంతర్జాలంలో స్నేహితుల కోసం యువతరం ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తోంది. ఈ నెట్వర్కులు కూడా తమ తమ సభ్యులను ఆకర్షించడంలోనూ, సరళమైన భాషలోనూ, ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను అందించడంతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి ఉన్నతమైన ఫీచర్లను అందించడంలో ఆర్కుట్‌ ముందంజలో వుందని అంతర్జాల నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వీటి నిర్వహణకు ఎటువంటి ఖర్చూ లేకపోవడంతోపాటు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం వుంది. ఒకే రకమైన అభిరుచి, ఆలోచనలు, అభిప్రాయాలుున్నవారు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదో చక్కని వేదిక. ఈమధ్య కేంద్ర విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్‌ ''ఎకానమీ క్లాసులో ప్రయాణమంటే పశువుల మందలో కలిసి వెళ్ళడమే' అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ట్విట్టర్‌ గురించి ఆయన మాట్లాడుతూ- 'రోజులో వందమందిని కలవలేకపోవచ్చు.కానీ నేను పంపే ఒక ఎస్సెమ్మెస్‌ మూడు లక్షలమందిని చేరుతుంది' అని అంటారాయన. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సైతం ట్విట్టర్‌ వినియోగోదారుడేననే విషయం తెలిసిందే. దీన్నిబట్టి ఈ నెట్వర్కుల ప్రాచుర్యం ఎంతగా వుందో తెలుస్తుంది. 
మనదేశంలో ఆర్కుట్‌కు 160లక్షల మంది, ఫేస్‌బుక్‌కు 80లక్షల మంది, ట్విట్టర్‌కు 14లక్షల మంది వినియోగదారులున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు.
సోషల్‌ నెట్వర్కింగ్‌ అంటే...
ఒక్కమాటలో చెప్పాలంటే ఒకే రకమైన అభిరుచి, అభిప్రాయం, భావనలు కలిగినవారు లేదా ఒకే రంగానికి చెదినవారిని ఏకంచేసి, ఒకరి ఆలోచనలను, అభిప్రాయాలను ఇంటర్నెట్‌లో పంచుకోగలిగిన ఒక సౌలభ్యంగా దీన్ని చెప్పవచ్చు. జనాలను ఒకరితో ఒకరు అనుసంథానం చెయ్యడమే వీటి పని. ఇలాంటి స్థితిని చక్కగా ఉపయోగించుకోవడానికి పుంఖాను పుంఖాలుగా సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లు పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్ని ప్రముఖ సైట్లు, అవి అందిస్తున్న సదుపాయాలను తెలుసుకుందాం :
ఆర్కుట్‌ :
సుప్రసిద్ధ గూగుల్‌ సెర్చింజన్‌కు చెందిన ఆర్కుట్‌ గురించి తెలియనివారు వుండంటే అతిశయోక్తి కాదేమో. వయస్సుతో తారతమ్యం లేకుండా అందరికీ ఇందులో అకౌంటు వుంటోంది. జిమెయిల్‌ ఎకౌంట్‌ ప్రతి ఒక్కరూ ఆటోమ్యాటిక్‌గా అదే ఎకౌంట్‌తో దీనిలో లాగిన్‌ కావచ్చు. ఇందులో ఎంతోమంది ప్రతినిత్యం స్క్రాప్స్‌ చేస్తూనే వుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు తమతో చదువుకున్న స్నేహితులను కూడా దీని ద్వారా కలుసుకుంటూనే వున్నారు. నలుగురు స్నేహితులు ఒకేసారి కలిసి మాట్లాడుకునే సదుపాయం ఆర్కుట్‌లో వుంది. ఒక గ్రూపులా ఏదైనా చర్చించాలన్నా, సరదాగా రచ్చబండ దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవాలన్నా చాలా సులువుగా చేయవచ్చు. చాట్‌ చేయడానికి మొదట ఒక స్నేహితుని ఎంపిక చేసుకున్న తర్వాత, ఆ చాట్‌ విండోలో కింది భాగాన వున్న గ్రూప్‌చాట్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే మరింతమంది స్నేహితులను ఆ చాట్‌లోకి ఆహ్వానించవచ్చు. అయితే గ్రూప్‌ చాటింగ్‌కి ఇతర సదుపాయాలు కొన్నివున్నప్పటికీ ఎక్కువమంది వినియోగదారులున్న ఆర్కుట్‌లో ఈ సౌలభ్యం వుండడం మరింత ఉపయోగకరం. మన దేశానికి వస్తే ఆర్కుట్‌కే ఎక్కువ మంది వినియోగదారులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ దీనికి వినియోగదారులున్నారు.
ఫేస్‌బుక్‌ :
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరు నెటిజన్లు వాడే సోషల్‌ నెట్వర్కింగ్‌ సర్వీసుల్లో ఫేస్‌బుక్‌దే సింహభాగం. ప్రపంచవ్యాప్తంగా 350మిలియన్ల యూజర్లు దీనిలో సభ్యులుగా వున్నారంటే దీని విస్తృతిని అంచనా వేయవచ్చు. అంతే కాకుండా 3.5మిలియన్ల ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌చేసి తమ తమ మిత్రులతో పంచు కుంటున్నారు. ఈమధ్య మరింత ఊపందుకున్న ఈ నెట్వర్కింగ్‌ మొదటి నుంచీ తనదయిన ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పటివరకూ యాహూ లాంటి కొన్ని సంస్థలు దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా ఇది సంసిద్దతను వ్యక్తం చేయలేదు. మొదట యూనివర్శిటీలలో జనాల మధ్య నెట్వర్కులను సృష్టించుకోవడానికి ఉపయోగపడింది. మొదట్లో ఇందులోకి ప్రవేశించాలంటే యూనివర్సిటీ మెయిల్‌ ఐడీతోగానీ లేదా ఏదైనా కంపెనీ మెయిల్‌ ఐడీతో గానీ మాత్రమే ఇందులో రిజిస్టర్‌ చేసుకోవడం సాధ్యపడేది. ప్రస్తుతం దీన్ని ఓపెన్‌ చేశారు. ఎవరయినా ఇందులో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా కంపెనీల, యూనివర్శిటీల నెట్వర్కులలో భాగా కావాలంటే మాత్రం సంబంధిత మెయిల్‌ ఐడీలు వుండాల్సిందే. గత సంవత్సరం యాహూ సంస్థ దీన్ని ఒక బిలియన్‌ డాలర్లకు దీన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడినా దీన్ని అమ్యేందుకు ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ సిద్ధపడలేదు. అంతేకాకుండా భారతీయ భాషల్లో కూడా దీన్నివాడుకునేందుకు వీలు కల్పించారు. ఇప్పటివరకూ ఈ నెట్వర్కింగ్‌ సర్వీసులో ఆర్కుట్‌దే పైచేయిగా వుంది. ఫేస్‌బుక్‌ భారతీయ భాషల్లో కూడా లభ్యం కావడంతో ఆర్కుట్‌ ఎదుర్కోగలుగుతుందని విశ్లేషకుల అంచనా.
మై స్పేస్‌ :
న్యూస్‌ కార్పొరేషన్‌ సంస్థకు చెందిన ఈ సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్‌ ఇప్పుడు అతి పెద్దది. ఇందులో మిలియన్ల కొద్ది జనాలు రిజిస్టర్‌ అయివున్నారు. మ్యూజిక్‌, వీడియోలు వంటి తమ అభిరుచులను ఇతరులతో పంచుకోవచ్చు. తమ కోసం ఓ పేజీ సృష్టించుకొని వారివారి విశిష్టతను ప్రపంచానికి చోటుకోవచ్చు, విభిన్న అభిప్రాయాలను, ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రాముఖ్యత ఎంతగా వుందంటే- అమెరికాలో సెనెటర్లు, రాజకీయనాయకులు, సినీస్టార్లు, ఆటగాళ్ళు దీనిలో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని వారి వారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌ ద్వారా తమ పాపులారిటీని చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల పాపులారిటీకి ఇదికూడా ఒక కొలబద్దగా తయారయ్యింది.అంతేకాకుండా తనకే సొంతంగా ఓ వీడియో ఫీచర్‌ని క్రియేట్‌ చేసుకొని యూజర్లకు వేరే సైట్ల అవసరం లేకుండా చేసుకుంది. తద్వారా ఇతర వీడియో, ఫొటో వెబ్‌సైట్ల ట్రాఫిక్‌ని కూడా కంట్రోల్‌ చేసే స్థాయికి ఇది చేరింది.
ట్విట్టర్‌ :
కేవలం 140 పదాలతోనే సమాచార విప్లవానికి తెరతీసి దూసుకెళుతోంది. హాలీవుడ్‌ స్టార్ల నుండి రాజకీయ నాయకుల వరకూ అనేకమంది ట్విట్టర్‌ వినియోగదారులే. బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ట్విట్టర్‌ వినియోగదారులే. మొన్నమొన్నటివరకూ బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ను ట్విట్టర్‌ క్వీన్‌గా చెప్పేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్రియాంకచోప్రా 71,026 మంది ఫాలోయర్స్‌తో నెంబర్‌ వన్‌ కిరీటం దక్కించుకుంది. ఇలాంటి సంచలనాలకు వేదికైన ట్విట్టర్‌ పుట్టుక కూడా విచిత్రంగానే మొదలైంది. ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా కొత్త సోషల్‌ నెట్వర్కింగ్‌ బ్లాగ్‌ క్రియేట్‌ చేయాలని జాక్‌ డోర్సీ ఆలోచన ఫలితంగా 2006లో ఇది పుట్టింది. 'టెక్‌ క్రంచ్‌' అనే సంస్థ అంచనా ప్రకారం ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ 1.54బిలియన్‌ డాలర్లు. ''ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు మెచ్చిన ఏకైక సోషల్‌ నెట్వర్కింగ్‌ బ్లాగ్‌ ఇదే' అంటూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ట్విట్టర్‌కు కితాబిచ్చింది. సందేశాలను పంపుకోవడంతోపాటు బ్లాగులు, వెబ్‌సైట్లను కొత్త టపా వేసిన ప్రతిసారీ ట్విట్టర్‌లో ప్రకటించొచ్చు. ఈ విధంగా ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడర్లకి తరుణోపాయంలా పనిచేస్తుంది.
యాహూ :
ఇప్పుడు యాహూ కూడా సోషల్‌ నెట్వర్కింగ్‌ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. యాహూకు చెందిన అని సైట్లలో ఇప్పుడు ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ లాంటి సోషల్‌ నెట్వర్కింగ్‌లకు చెందిన ఫీచర్స్‌ లభ్యమవు తున్నాయి. యాహూ వినియోగదారులు ఫేస్‌బుక్‌ను ఉపయోగించకుండా తమ స్నేహితులతో నేరుగా మాట్లాడు కోవచ్చు. ఫేస్‌బుక్‌ త్వరలోనే యాహూ సైట్లోకి రానుంది.
వీటితోపాటు లింక్‌డిన్‌, డిగ్‌ వంటివి అనేకం వున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి, తెస్తున్నాయి. అన్నిటి పరమార్థం ఒక్కటే...ఆన్‌లైన్‌లో మిత్రులతో పిచ్చాపాటి.
ఉపయోగాలు :
ఇంటర్నెట్‌ వల్ల సమకూరే సదుపాయాలన్నింటినీ వినియోగించుకునే విధంగా ఈ సోషల్‌ నెట్వర్కింగ్‌ సర్వీసులు, బ్లాగ్‌లు పనిచేస్తున్నాయి. ఖండాంతరాలను దర్శించడంతో, రకరకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. తమ నెట్‌వర్క్‌ పరిధిని విస్తరించుకోవచ్చు. ఇతరులతో అభిప్రాయాలను, అనుభవాలనూ పంచుకోవచ్చు. తమ వ్యాపార లావాదేవీలను నడపవచ్చు. ఒకరకంగా ఇదో విజ్ఞాన భాండాగారం. ఎక్కడో గ్రామంలోనో, స్కూల్లోనో చదువుకున్న తమ చిన్ననాటి నేస్తాలను కలుసుకోవడం, ఈ బిజీ జీవితంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడి కొంతకాలం ఎక్కడున్నామో తెలియని వారిని సైతం కలిపే వారధులుగా ఇవి పనిచేస్తున్నాయి. వారు చదివిన స్కూలు పేరుతోనే ఊరు పేరుతోనో ఓ కమ్యూనిటీ క్రియేట్‌ చేసుకోని తమ అనుభవాలు, జ్ఞాపకాలు అందులో పొందుపర్చడం ద్వారా ఒకరికొకరు దగ్గరకావడం, స్నేహాన్ని పునరుద్ధరించుకోవడంతోపాటు కొత్త మిత్రులను పొందవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సంబంధాల వల్ల జీవన బాంధవ్యాలు ముడిపడుతున్నాయి. ఆన్‌లైన్‌ సంబంధాలు కేవలం సరదాకో, సమాచారానికో మాత్రమే కాదు, చదువులోనూ, కెరీర్‌లోనూ ఎదగడానికి, సామాజిక విజ్ఞానం పెంపొందింపచేసుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నెట్వర్క్‌లలోనే అనేక అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
నష్టాలు :
సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి అనేది నాణేనికి రెండువైపు కూడా వుంది. ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా దాని మనం ఉపయోగించుకునే తీరునుబట్టి ఫలితాలు ఆధారపడి వుంటాయి. ఇంటర్నెట్‌ ద్వారా ఎంత మంచి జరగడానికి అవకాశం వుందో... అంతేస్థాయిలో చెడు జరగడానికి కూడా అవకాశం వుంది. స్నేహం పేరుతో పరిచయాలు పెంచుకొని నష్టపోతున్న వారూ వున్నారు. ప్రేమపేరుతో వంచనకు గురవుతున్న సందర్భాలు అనేకం. అందుకే ఎక్కుమంది మారుపేరుతోనో, నిక్‌ నేమ్‌లతోనో ఐడీలను క్రియేట్‌ చేసుకొంటుంటారు. చెడు సంస్కృతి, ఉన్మాదాలవైపు ప్రేరేపించే విధంగాను, అవాస్తవాలకు, అభూత కల్పనలకు ఆకర్షితులై హాని కొనితెచ్చుకుంటున్న సందర్భాలూ కోకొల్లలు. ముఖ్యంగా అశ్లీల సాహిత్యానికీ, వెర్రెక్కించే ఉన్మాద, ఆథ్యాత్మిక సాహిత్యానికీ, ఇతరులకు ఇబ్బంది కలిగించే ఛాటింగ్‌లకూ దూరంగా వుండాలి. పిల్లలు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లయితే.. దేనికోసం ఉపయోగి స్తున్నారో గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై వుంది. ఎందుకంటే టీనేజర్లను మోసం చేసేవాళ్ళు కూడా వీటిని ఆసరా చేసుకుంటున్నారు. విదేశాలలో అయితే పేరెంటల్‌ కంట్రోల్‌ కోసం సాఫ్ట్‌వేర్‌లకు మంచి గిరాకీ వుండా వుంది. మరో కోణంలో చూస్తే- గంటల కొద్దీ వెబ్‌సైట్ల వీక్షణకు అలవాటుపడినవారు క్యాన్సర్‌కు దగ్గరవుతారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తరచుగా ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను సందర్శించేవారు ఒక్క క్యాన్సర్‌కే కాకుండా పలురకాల గుండె జబ్బులకు, మానసిక వ్యాధులకు గురవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రముఖ మానసిక నిపుణుడు ఎరిక్‌సిగ్మన్‌ మాట్లాడుతూ- 'స్నేహితులను, బంధువులను నేరుగా కలుసుకోకుండా ఇమెయిల్స్‌ ద్వారానో, సోషల్‌ నెట్వర్క్‌ల ద్వారానో, ఛాటింగ్‌ ద్వారానో మాత్రమే సంబంధాలు కలిగివుండడం.. వారి వారి జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపుతుంద'ంటున్నారు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా వుండడం వల్ల మానవుల్లో జన్యుమార్పులకు కారణమవుతుందని సిగ్మన్‌ చెపుతున్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం, శరీరంలో హార్మోన్ల విడుదలపై కూడా ప్రభావం చూపుతుందని, సోషల్‌ నెట్వర్కులపై ఎక్కువకాలం గడిపేవారి మెదడుపైకూడా ప్రభావం చూపుతుందని సిగ్మన్‌ చెపుతున్నారు.
ఇంటర్నెట్‌ అంటే మంచీ-చెడూ, లాభం-నష్టం కలగలిసిన విజ్ఞాన సర్వస్వం. దీన్ని ఏరకంగా ఉపయోగించుకుంటే ఆ రకమైన ఫలితాలే వస్తాయి. ప్రజా జీవితంలో సాంకేతిక విజ్ఞానం మమేకమైన ప్రస్తుత తరుణంలో ఈ విజ్ఞాన సర్వస్వం అభివృద్ధివైపే పయనించాలని కోరుకుందాం.
- రాజు కె ఎక్స్

తెలుగుబాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన శ్రీకృష్ణ దేవరాయలు : పురంధరేశ్వరి

భాషాబేధాలను అధిగమించి తెలుగు భాషాభివృధ్ధికి, జాతి సమైక్యతకు కృషి చేసిన చక్రవర్తి కృష్ణదేవరాయలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ధి మహౌత్సవాలు ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను పురంధరేశ్వరి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు అవనిగడ్డ శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పురంధరేశ్వరి ప్రసంగించారు. దేవరాయులు 20 ఏళ్ళపాటు రాజ్యాన్ని పాలించినా 20 యుగాలకు సరిపడా మహౌత్తర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అందుకనే శ్రీకృష్ణదేవరాయుల పేరు చెప్పగానే ఆంధ్రులు పులకరిస్తారన్నారు. దేవరాయల స్ఫూర్తికి చిహ్నంగా ఉన్న చారిత్రక కట్టాడాలు, శిథిలావస్థలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆ కట్టడాలను పదిల పరచటానికి చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తిచేశారు. కృష్ణదేవరాయల ధైర్యాన్ని, కీర్తిని తమ తండ్రి మాజీ ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు నుంచి తెలుసుకున్నామన్నారు. ఈసందర్భంగా మంత్రి తన తండ్రి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కొసులు పార్ధసారధి మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని, ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ తెలుగు భాషను మరచిపోరాదన్నారు. శ్రీకృష్ణదేవరాయులు భాషాభివృద్ధితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. భాషా సంస్కృతి, సాహిత్యాల పట్లనే కాక సామాజిక స్పృహను కూడా ప్రదర్శించారని, ఇందుకు ఆముక్తమాల్యద రచనలోని మాలదాసు ప్రస్తావన ఉదహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.యస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ దేవరాయులు వ్యవసాయరంగ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన పాలించిన ప్రాంతాల్లో వందల చెరువులు తవ్వించి లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. ఇప్పటికీ కొన్ని చెరువులు ఉన్నాయని వాటిని ఉపాధి పధకం కింద పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళంలో దేవరాయులపై మ్యూజియంను ఏర్పాటుచేయాలని, దీనికి తన ఎమ్మెల్సీ నుంచి రూ.5లక్షలు విడుదలక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అన్ని రంగాల్లో విశేష కృషి చేసిన దేవరాయులు పరిపాలన అందరికీ ఆదర్శవంతమైందని కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయులు రూపం ఎవరికీ తెలియనప్పటికీ ఆ రూపాన్ని కీర్తిశేషులు నందమూరి తారకరామారావు ద్వారా చూడగలిగామని పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, శ్రీకృష్ణదేవరాయల ఉత్సవ రాష్ట్ర కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం తెలుగు భాష ఔన్నత్యానికి స్ఫూర్తినిచ్చిన గ్రామంగా పేరు గడించిందన్నారు. దేవరాయులు స్పష్టమైన సాంస్కృతిక విధానానికి శ్రీకాకురం చుట్టారన్నారు. దేవరాయుల పేరుమీద ఒక మండపం నిర్మించాలని పురావస్తు ప్రదర్శనశాలను, కళ్యాణ మంటపాన్ని టిటిడి వారు ఏర్పాటుచేయాలని అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య మాట్లాడుతూ సాహిత్యంలోనూ, యుద్ధవిద్యల్లోనూ నైపుణ్యం కలిగిన దేవరాయులు పట్టాభిషేక మహౌత్సవాలను శ్రీకాకుళంలో ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. తొలుత పట్టాభిషేక మహౌత్సవాల జిల్లా కన్వీనర్‌, జిల్లా కలెక్టర్‌ పియూష్‌కుమార్‌ స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు పురంధరేశ్వరి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్‌ రత్నబిందు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, దిరిశం పద్మజ్యోతి, డి.వై.దాస్‌, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ చల్లప్ప, జిల్లా ఎస్పీ హరికుమార్‌, జెసి గౌరవ్‌ఉప్పల్‌, ఎంపీపీ తుమ్మల వరలకీë, జడ్పీటీసీ సభ్యులు లోయ నాగశ్రీనివాసరావు, సర్పంచ్‌ కనగాల బాబు, ఎంపీటీసీ సభ్యులు స్టాలిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.