....

Footer Right Content

Sunday, August 15, 2010

ఇండియన్‌ ఐడల్‌-5గా తెలుగుతేజం శ్రీరామ్

రో తెలుగుతేజం మెరిసింది. పాటల పూదోటలోవిరజాజియై గుభాళించింది. గానామృతంతో భారతావని మదిని పులకింపజేసింది. తెలుగోడి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రాగమై, తానమై, పల్లవించాయి. ఎద ఎదనూ రంజింపజేశాయి. మదిమదినీ దోచేశాయి. పంద్రాగస్టు పర్వదినాన మన శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. హైదరాబాద్‌ పాటే గెలిచింది. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్‌ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు. ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో శ్రీరామ్‌ చూపిన ప్రతిభకు సలామ్‌ కొట్టనివారు లేరు. మొన్న శ్రీరామ్‌ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' అన్న పాటకు సంజయ్‌దత్‌ ఏకంగా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది. హాట్‌గర్ల్‌ బిపాసాబసు, కత్రినాకైఫ్‌ జాతీయ ఉత్తమ నటి ప్రియాంక చోప్రా ఇలా యువతరం హీరోయిన్లూ శ్రీరామ్‌ పాటను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. విలక్షణ నటుడు అమీర్‌ఖాన్‌.... 'ఆ కిశోర్‌కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో శ్రీరామ్‌ తొలినుంచీ హాట్‌ఫేవరేట్‌గా మారిపోయాడు. అనుకున్నట్లే... ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో విజేతగా నిలిచి తెలుగువారి హృదయాలను ఆనందంతో నింపేశాడు 24 ఏళ్ల మైనంపాటి శ్రీరామచంద్ర.

చివరికి ఫైనల్స్‌లో ముగ్గురు మిగిలారు. శ్రీరాంచంద్రతోపాటు.. భూమి త్రివేది, రాకేష్‌ మణి... 15వ తేదీ అర్థరాత్రి ఈ ముగ్గురూ స్టేజీపై గుండె దిటవు చేసుకుని ఒకరినొకరు చేతులు పట్టుకుని నిలబడ్డారు. వారి ముఖాల్లో టెన్షన్‌... ఇటు ప్రేక్షుకుల్లోనూ అదే ఫీలింగ్‌. చివరికి బిగ్‌బీ విజేతను ప్రకటించారు. రిమోట్‌ నొక్కడంతోనే స్క్రీన్‌పై శ్రీరామ్‌చంద్ర! అంతే చప్పట్లు ఒక్కసారిగా మిన్నంటాయి. అక్కడే ఉన్న శ్రీరామ్‌చంద్ర తల్లిదండ్రులు కొడుకును గాఢాలింగనం చేసుకుని అభినందించారు. గెలుపుపై వ్యాఖ్యానించాల్సిందిగా యాంకర్‌ సోనునిగమ్‌ కోరినపుడు... ''ఐ లవ్‌ యూ ఆల్‌'' అంటూ తన ప్రేమను వ్యక్తీకరించాడు శ్రీరామ్‌. ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ్‌కు సోనీటీవీ రూ.50 లక్షల నగదు బహుమతిని అందించింది. దీంతోపాటు ఒక బైక్‌, ఒక కారు కూడా ఇచ్చారు. విజేతతో ఒక సంవత్సరంపాటు సోనిటీవీతో ఒప్పందం కూడా ఉంటుంది. యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో పాట పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమాన్ని తాను సెలక్షన్స్‌ జరుగుతున్నప్పటి నుంచీ చూసినట్లు బిగ్‌బీ అమితాబ్‌ చెప్పారు. తన శ్రీమతి జయాబచ్చన్‌కు ఈ కార్యక్రమం బాగా నచ్చిందని వెల్లడించారు. అంత తేలికగా దేనినీ ఆమోదించే తత్వం ఆమెది కాదని అమితాబ్‌ మ్యూజిక్‌ రియాలిటీ షో కార్యక్రమాన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్స్‌కు వెళ్లినా... చివరి వరకూ గెలుపు ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం కష్టమే. కార్యక్రమాన్ని చూసి... ఎవరు బాగా ప్రతిభను చూపించారన్నది అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి మద్దతు ప్రకటించాలి. పాటలు పాడటంలో ఎంత ప్రతిభ ఉన్నా... సెల్‌ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు రావడం కూడా ముఖ్యమే. ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో కారుణ్య ఫైనల్స్‌కు చేరినా ఎస్‌ఎంఎస్‌ల్లో వెనకబడిపోవడంతో ఆయన రన్నరప్‌గా నిలిచారు. ఈసారి శ్రీరామ్‌ గెలుపును కోరుకుంటూ చాలా మంది ఎస్‌ఎంఎస్‌లు పంపడం శ్రీరామ్‌కు కలిసివచ్చింది. అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీలు ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్స్‌గా విజయం సాధించారు. ప్రస్తుత విజేత... శ్రీరామ్‌ ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీలో విజేతగా నిలిచాడు. ఈటీవీ 'సై' ఫైనలిస్ట్‌. బిగ్‌ఎఫ్‌ఎంలో 'వాయిస్‌ఆఫ్‌ ఆంధ్రా'గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ 5 తెలుగు సినిమాల్లో పాటలు పాడిన శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నాడు. సంగీతంలో ప్రవేశం ఉంది. సందీప్‌-సులేమాన్‌ కంపోజ్‌ చేసిన ఒక హిందీ సినిమాకు శ్రేయా ఘోషల్‌తో కలిసి ఒక పాట పాడారు. శ్రీరామ్‌కు సీఎం అభినందనలు
ఆదివారం రాత్రి సోనిటీవీలో ఇండియన్‌ ఐడల్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన ముఖ్యమంత్రి రోశయ్య... శ్రీరామ్‌ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. గాయకుడు శ్రీరామ్‌ను ఆయన అభినందించారు. తెలుగువారందరికీ ఇది గర్వకారణమనిఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో మిన్నంటిన సంబరాలు
ఇండియన్‌ ఐడల్‌గా గెలిచాడన్న మరుక్షణం హైదరాబాద్‌లో సంబరాలు మిన్నంటాయి. ఖైరతాబాద్‌, నెక్లెస్‌రోడ్‌, సికింద్రాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో యువకులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. బోయిన్‌పల్లిలోని శ్రీరామచంద్ర నివాసం వద్ద కుర్రకారు, శ్రీరామ్‌ స్నేహితులు కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ కొందరు యువకులు శ్రీరామ్‌ గెలవాలంటూ జాతీయ పతాకాలను ధరించి ప్రచారం నిర్వహించారు. గతంలో ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో పాల్గొన్న హేమచంద్ర, కారుణ్యలు ఫైనల్స్‌ వరకూ వెళ్లినా గెలుపునకు కొంచెం దూరంలో ఆగిపోయారు. ఈ పోటీల్లో కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ముందునుంచీ కృషి చేసిన మైనంపాటి శ్రీరామచంద్ర ప్రతి దశలోనూ అంతకంతకూ మెరుగైన ప్రతిభను ప్రదర్శించాడు. తెల్లవారు జామునుంచే లేచి రోజుకు పదహారు, పదిహేడు గంటలపాటు సాధన చేసేవాడు. రెండు సార్లు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినా... మళ్లీ బయటకు వచ్చి ఫైనల్‌కు చేరుకున్నాడు. బాలీవుడ్‌ నటులు, సంగీత దర్శకుల అభిమానం చూరగొన్న శ్రీరామ్‌కు ఆశేష తెలుగు ప్రజలు కూడా సంక్షిప్త సందేశాలతో మద్దతు పలికారు. ఎవరికి ఎక్కువ సంక్షిప్త సందేశాలు వస్తే... వాళ్లే ఇండియన్‌ ఐడల్‌-5 పోటీల్లో విజేతగా నిలుస్తారన్న సమాచారాన్ని స్నేహితులు, బంధువులే ప్రచారం చేయడమే కాకుండా కొన్ని తెలుగు టీవీఛానెళ్లు ప్రసారం చేయడంతో ఎక్కువ మంది స్పందించి సంక్షిప్త సందేశాలు పంపించారు.

1 comment: