....

Footer Right Content

Thursday, August 12, 2010

అవరోధాలు ఎదురైనా.. ఎదురులేని తేజం

జ్రం మెరవాలంటే... కోత తప్పదు. పసిడి కాంతులీనాలంటే కొలిమిలో కాలాల్సిందే. ఇరవై తొమ్మిదేళ్ల తేజస్వినీ సావంత్‌ ఈ రోజు.. షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిందన్నా... పన్నెండేళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డుని సమం చేసిందన్నా... ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత మహిళగా కీర్తినందుకొందన్నా... దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. అవరోధాలను దాటిన.. ఆర్థిక పరీక్షలకు ఎదురునిలిచిన నేపథ్యం ఉంది.
 గురి చూడటం అంటే... ఎక్కుపెట్టిన రైఫిల్‌కి, ఎదురుగా ఉన్న లక్ష్యానికి మధ్య ఉన్న దూరమేగా... అనుకుంటే ఘన విజయాలు సొంతం కావు. మనసులో సంకల్పాన్ని, కనుచూపులో ఉన్న లక్ష్యాన్ని ఏకం చేయాలి. తేజస్విని అదే చేసింది. తన విజయం కోసం అనుక్షణం తపించిన తండ్రి దీవెనలు, తల్లి అభినందనలు.. మనసులో మెదులుతుండగా లక్ష్యాన్ని గురిచూసింది. రెప్పపాటులో గమ్యం చేరుకున్న బుల్లెట్‌ ఆరొందలకు 597 పాయింట్లు స్కోరు చేసింది. రికార్డులను తిరగరాసింది. బంగారు పతకం అందుకొన్న తొలి భారత మహిళగా ఆమె పేరు నమోదు చేసింది. అరుదైన విజయంతో మెరిసిన తేజస్విని... ఆ సమయంలో గుర్తు చేసుకుంది కోట్ల మంది ప్రశంసలను కాదు. అనుక్షణం వెన్నంటి నిలిచి... కష్టాలను తను భరించి.. ఆనందాలను వదిలి వెళ్లిన కన్నతండ్రిని.
అమ్మానాన్నల అండ..
ఎలాగైనా గెలవాలి అనుకునే వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకం... ఓ స్ఫూర్తి పాఠం అవుతుంది. విజయంలో మజా చవిచూడాలన్న తపనను రగిలిస్తుంది. 'మాది మహారాష్ట్రలోని కొల్హాపురి. నాన్న నౌకాదళంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. పదమూడేళ్ల వయసులో షూటింగ్‌ క్రీడపై నాకున్న ఆసక్తిని గమనించారు. మా వూరిలో సౌకర్యాలు అంతంతమాత్రం. అలాంటిది ఆ క్రీడలో శిక్షణకు అవకాశం లేదసలు. పైగా అది చాలా ఖరీదైన వ్యవహారం. సొంత రైఫిల్‌ కొనుగోలు చేయాలి. సాధన కోసం కూడా చాలా డబ్బు వెచ్చించాలి. ఇవన్నీ నాకప్పుడు తెలియదు. కానీ నాన్న 'తేజూ... నేనున్నాగా...' అని అనడం మాత్రం తెలుసు' అంటూ తండ్రి రవీంద్ర సావంత్‌ అందించిన ప్రోత్సాహం గురించి చెప్పుకొచ్చింది. తేజస్విని తల్లి సునీత రాష్ట్ర స్థాయి క్రికెటర్‌. వాలీబాల్‌ క్రీడాకారిణి. వివాహం అయ్యాక, గృహిణిగా బాధ్యతల్లో మునిగిపోయాక కూడా ఆమె తన క్రీడాభిమానాన్ని కొనసాగించింది. 'ఆ ఆట వద్దు... నీ వల్ల కాదు, అంటూ ఏనాడూ నిరుత్సాహపరచలేదు. నన్ను, ఇద్దరు చెల్లెళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఆశయంగా జీవించింది' అంటూ తల్లి ఔన్నత్యాన్ని తెలిపింది.
ఆటంకాలను అధిగమించి...
పరిమిత వనరులు, కనీస వసతుల్లేని పరిస్థితుల్లో సాధన చేసిన తేజస్విని' కేవలం డబ్బుతో విజేతలు తయారు కారు. కానీ ఎదిగే క్రమంలో మనీ ఆత్మవిశ్వాసాన్ని అడుగడుగునా పరీక్షిస్తుంది' అంటుంది. షూటింగ్‌లో రాణిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతున్న కొద్దీ డబ్బు అవసరం అధికమైంది. ఖరీదైన ఈ క్రీడకి ఆదరణ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. 'నాన్న నా కోసం బ్యాంకు రుణాలు తీసుకున్నారు. తెలిసిన వాళ్ల వద్ద అప్పులు చేశారు. అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. అమ్మానాన్నల బాధలు చూసి శిక్షణకు వెళ్లనని, టోర్నమెంట్లలో పాల్గొనని మొండికేసేదాన్ని. అలాంటప్పుడు నాన్న వెన్నుతట్టేవారు. బాధ పడకుండా భేష్‌ అనిపించుకున్న వారెవరూ ఉండరు అని చెప్పేవారు' అంటూ కష్టాలను తట్టుకొని ముందుకు సాగిన తీరుని వెల్లడించారు.
వాయిదాల పద్ధతిలో రైఫిల్‌...
రెండు వేల సంవత్సరం నుంచి పోటీల్లో పాల్గొంటున్న తేజస్విని జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించింది. కానీ మేలిమలుపు ఆరంభమైంది 2005 నుంచి అని చెప్పాలి. 'బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో వెండిపతకం. మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌లో ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రెండు స్వర్ణాలు. ఇవి నన్ను వ్యక్తిగతంగా ఆనందపరిచాయి. మా కష్టాలను కొంతవరకు గట్టెక్కించాయి. రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలం మంజూరు చేసింది. నాకు ఉద్యోగం వచ్చింది' అని వివరించింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాలు సాధించడానికి ఇవి గట్టి వూతంగా ఉపయోగపడలేదు. 'జర్మనీలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడాలంటే ఖరీదైన రైఫిల్‌ కావాలి. దాన్ని కొనే ఆర్థిక స్తోమత లేదు. అందుకే రైఫిల్‌ అసోసియేషన్‌ నుంచి అప్పు తీసుకుని, వాయిదాల పద్ధతిలో తీర్చేలా ఒప్పందం చేసుకొని దానిని కొనుగోలు చేశాను. అదీకాక శిక్షణ కోసం చాలా డబ్బు అవసరమైంది. నాన్న తెలిసిన వాళ్లందరి ఇంటికి వెళ్లి డబ్బు సేకరించారు' అని చెప్పిన తేజస్విని కిందటేడాది ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రాణించలేకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది అంది.
మరిన్ని పతకాలపై గురి...
తాజాగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 1998 నాటి స్కోరుని సమం చేసి... స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా నిలిచిన తేజస్వినిని కదిలిస్తే 'నా విజయాన్ని కళ్లారా చూడాలని ఎన్నో ఏళ్లుగా తపించిన నాన్న ఆరు నెలల క్రితం మరణించారు. ఆయన లేకపోవడం అన్నిటికన్నా పెద్దలోటు' అంది. తండ్రికే తన విజయం అంకితం అని ప్రకటించింది. కామన్వెల్త్‌లో, ఒలింపిక్స్‌లో మనదేశం తురుపుముక్కగా మారిన తేజస్విని ఆటుపోట్లను దాటుతూ ఆటే జీవితంగా నడక సాగించింది. ఆమె ఇద్దరు చెల్లెళ్ల వివాహం అయింది. తను మాత్రం మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
- ఈనాడు సౌజన్యంతో

No comments:

Post a Comment