....

Footer Right Content

Sunday, August 22, 2010

చెల్లెలి కోసం

అన్నాచెల్లెళ్ల మధ్య, అక్కాతమ్ముళ మధ్య అనుబంధం
విడదీయలేని రక్తసంబంధం.
ఆ బంధం ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం
ఓ అన్నయ్య తన చెల్లెలి కోసం పడిన తపన..
అమ్మపై చూపిన ప్రేమ..
గుండెలను స్పృశించే కథ ‘చెల్లెలి కోసం’
.

‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమైన ఈ కథ
నన్నెంతగానో ఆకట్టుకుంది.
మనసును ద్రవింపజేసింది.
మీరూ చదవండి......


***          ***           ***

చెల్లెలి కోసం
''అమ్మయ్య... సరకుల పని పూర్తయింది''.... అనుకుంటూ బిల్లింగ్‌ వైపు అడుగులేశాను.

క్యాష్‌ కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి ఓ పిల్లవాడితో చెప్తున్న మాటలు కొంచెం ఆసక్తికరంగా ఉండడంతో ఆగిపోయాను. ఆ బాబుకి ఐదారేళ్లుంటాయేమో. వాడి చేతిలో ఒక బొమ్మ ఉంది. దానిని ఎంతో అపురూపంగా పట్టుకున్నాడు.

అతను పిల్లవాడి వైపే చూస్తూ...''ఈ బొమ్మ కొనడానికి సరిపడా డబ్బులు నీ దగ్గర లేవు. వాటితో ఈ బొమ్మ రాదు'' అంటున్నాడు.

ఆ మాటలు రుచించలేదని పిల్లవాడి మొహం చూస్తే తెలుస్తోంది. వాడు చప్పున నావైపు తిరిగి ''ఆంటీ! మీరైనా చెప్పండి. నా దగ్గరున్న డబ్బుతో ఈ బొమ్మ రాదా?'' అనడిగాడు ఆశగా...భయంగా.

అప్పుడు కూడా ఆ బొమ్మ వాడి చేతులోనే ఉంది. తన దగ్గరున్న డబ్బు సరిపోదని తెలిశాక దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు.

నేను కూడా ఆ డబ్బు లెక్కగట్టి ''అవునమ్మా! అతను చెప్పింది నిజమే. ఈ డబ్బుతో ఆ బొమ్మ రాదు'' అన్నాను.

కానీ బేలచూపులతో నిలబడి ఉన్న వాడిని చూస్తే నాకు ఎందుకో జాలేసింది. వాడి దగ్గరకెళ్లి మోకాళ్ల మీద కూర్చుని ''నువ్వు ఈ బొమ్మను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు?'' అనడిగా.

''ఈ బొమ్మంటే మా చెల్లెలికి చాలా ఇష్టం. ఎప్పుడూ కావాలని అడిగేది. తన పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని కొని మా అమ్మకిస్తాను. అమ్మ వెళ్లినప్పుడు దాన్ని చెల్లెలికిస్తుంది'' అని చెప్పాడు. అప్పుడు పిల్లవాడి కళ్లలో ఎంతో బాధ కనిపించింది. అది ఎందుకో నాకర్థంకాలేదు.

నా ప్రశ్నకు సమాధానంగానా అన్నట్టు... వాడే మళ్లీ ''మా చెల్లెలు దేవుడి దగ్గరకెళ్లిపోయింది. మా అమ్మ కూడా తొందరలో అక్కడికే వెళుతుందంట. నాన్న చెప్పాడు. అమ్మ తనతోపాటు ఈ బొమ్మను తీసుకెళితే చెల్లెలికివ్వొచ్చు కదా.! అందుకే దీన్ని కొనడానికొచ్చాను'' అన్నాడు.

వాడి మాటలకు నా గుండె దాదాపుగా ఆగినంత పనైంది. బాబు తల పైకెత్తి నావైపు చూచి ''నేను ఈ బొమ్మ తీసుకొని వచ్చేదాకా అమ్మను వెళ్లనివ్వొద్దని నాన్నతో చెప్పి వచ్చాను. ఈ షాపు నుంచి ఇంటికెళ్లేదాకా అమ్మ వెళ్లకూడదు కదా ఆంటీ'' అన్నాడు అమాయకంగా.

అలా అంటూనే జేబులోంచి తన ఫొటో ఒకటి తీసి చూపించాడు. వాడు నవ్వుతూ ఉన్నాడందులో.

''అమ్మ వెళ్లేటప్పుడు ఈ ఫొటో తీసుకెళ్లి చెల్లెలికిస్తుంది. అప్పుడు చెల్లి నన్ను మర్చిపోలేదుకదా ఆంటీ. నాకు అమ్మంటే చాలా ఇష్టం. అమ్మ నన్ను వదిలి వెళ్లిపోకూడదు. కానీ నాన్నేమో అమ్మ చెల్లి దగ్గరకు వెళ్లిపోతుందని చెప్పాడు....''అలా చెప్పుకుపోతూనే ఉన్నాడు ఆ పసివాడు.

ఇక నా మనస్సు నన్ను నిలవనీయలేదు. వెంటనే పర్సు తీసుకుని వాడి దగ్గరకెళ్లి....''మళ్లీ డబ్బులు లెక్కబెట్టి చూద్దాం. ఇప్పుడు లెక్క సరిపోతుందేమో'' అంటూ నా డబ్బులు కొన్ని వాటిలో కలిపేసి, లెక్క మొదలుపెట్టాను. తర్వాత...

''సరిపోతాయి నాన్నా! ఇప్పుడు నువ్వా బొమ్మ కొనుక్కోవచ్చు. ఇదిగో ఇంకా కొద్దిగా చిల్లర కూడా మిగిలింది'' అన్నాను.

''అవునా ఆంటీ! అయితే చెల్లెలి కోసం ఈ బొమ్మ. అమ్మకోసం ఓ తెల్ల గులాబీ పువ్వు కొనుక్కెళతాను. ఎందుకంటే అమ్మకు తెల్లగులాబీలంటే చాలా ఇష్టం'' అన్నాడు సంతోషంగా.

నేను నా షాపింగ్‌ పని పూర్తిచేసుకున్నాను. మొదట షాపుకొచ్చినప్పుడు ఉన్న మూడ్‌ ఇప్పుడు లేదు. మనసంతా బరువుగా అయిపోయింది. ఇంటికెళ్లాక కూడా ఆ పిల్లవాడు, వాడు చెప్పిన విషయాలు ...ఏవీ మర్చిపోలేకపోయాను. నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా రెండురోజుల క్రితం పేపర్లో చదివిన ఒక వార్త నాకు గుర్తొచ్చింది. ఓ ట్రక్కు డ్రైవర్‌ తప్ప తాగి తల్లీ బిడ్డను గుద్దేసి వెళ్లిపోయాడు. పాప అక్కడికక్కడే చనిపోగా, తల్లిని ఆసుపత్రిలో చేర్చారన్నది వార్త సారాంశం. అంటే... ఇప్పుడు షాపులో కలిసిన పిల్లవాడు ఆ తల్లికొడుకు కాదు కదా? అనుకున్నాను.

రెండురోజుల తర్వాత అదే పేపర్లో ఆ తల్లి కూడా చనిపోయిందన్న వార్త చదివి బిగుసుకుపోయాను. ఎలాగో వారి అడ్రస్‌ తెలుసుకుని తెల్లగులాబీలు కొనుక్కుని వెళ్లాను. పాతికేళ్లు కూడా నిండని ఆ తల్లి శవం చూచి నా కళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. తడి కళ్లకు... ఆ తల్లి చేతిలో తెల్లగులాబీ పువ్వు, పిల్లవాడి ఫొటో బూదరబూదరగా కనిపించాయి. బొమ్మ కోసం వెతికాను. అది కూడా తల్లి గుండెల మీదే ఉంది.

కన్నీళ్లతో, బాధాతప్త హృదయంతో అక్కడి నుంచి వచ్చేశాను. పిల్లవాడికి ఆ చెల్లిమీద, తల్లిమీద ఉన్న ప్రేమను ఊహించడం చాలా కష్టమనిపించింది. అదే సమయంలో ఆ ప్రేమను పిల్లవాడికి దూరం చేసిన డ్రైవర్‌ అంటే ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంత విషాదానికి కారణమైన తాగుడంటే అంతులేని అసహ్యం కలిగింది.

- అల (నెట్‌లో విస్తృతంగా సర్క్యులేట్‌ అయిన కథకు స్వేచ్ఛానువాదం)

1 comment: