రాఖీ చరిత్ర
అది క్రీ.పూ. 326వ శతాబ్దం. అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలన్న ఆకాంక్షతో కదన రంగానికి కదులుతాడు. ధీశాలి, ధైర్యశాలి అయిన పురుషోత్తముడు పాలించే మగధ రాజ్యంపైన దండెత్తుతాడు. కానీ పురుషోత్తముని శక్తి సామర్థ్యాల ముందు అలెగ్జాండర్ నిలబడలేడన్న వార్త దావానంలా వ్యాప్తిస్తుంది. ఇది విని కలత చెందిన అలెగ్జాండర్ సతీమణి రుక్సానా పరుషోత్తముడిని అన్నా అని సంబోధిస్తూ 'రాఖీ' కడుతుంది. యుద్ధం నిలిపి వేయాలని, తన భర్త ప్రాణాలు రక్షించాలని కోరుతుంది. దీనికి పురుషోత్తముడి మనస్సు కరుగుతుంది. సోదర భావంతో ఆమె కోరికను మన్నిస్తాడు. నాడు వీళ్లిద్దరి మధ్యా సోదరభావం వల్లే యుద్ధం ఆగిపోయింది. అలెగ్జాండర్ ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన పౌర్ణమిరోజు చోటు చేసుకుంది కాబట్టి ఆ రోజును రాఖీ పౌర్ణమిగానూ, అది శ్రావణ మాసమైనందున శ్రావణ పౌర్ణమీగానూ, రుక్సానా, పురుషోత్తముడి మధ్య సోదరభావం పెనవేసుకుంది కాబట్టి అన్నా చెల్లెళ్ల పండగగానూ నిలిచింది. నేటికీ అది విరాజిల్లుతూనే ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధంతో పాటు విశ్వమానవ శాంతి సౌభ్రాతృ త్వానికీ, మానవత్వానికీ ప్రతీకైందీ పున్నమి. అంతేకాదు యుద్ధానికీ, దురాక్రమణ సామ్రాజ్య వాదానికీ స్వస్తి చెప్పాలన్న సందేశం ఇందులో ఇమిడి వుంది. అలనాటి ఆ స్ఫూర్తితో, నేటికీ కొనసాగుతున్న ఈ అనురాగాల పర్వాన్ని అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఇదీ రక్షాబంధన్ విశిష్టత. దీంతోపాటు అనేక కథలూ, పౌరాణిక గాథలూ ప్రచారంలో ఉన్నాయి. ఏవి ఎన్నున్నా అవన్నీ ఇచ్చే సందేశమొక్కటే అదే విశ్వమానవ శ్రేయస్సు. అందరినీ అలరించే అనురాగాల హరివిల్లయి, ఆనందాల పొదరిల్లయి తలపుల తలుపులు తట్టిన అనురాగ తరంగాల శ్రావణ పౌర్ణమినీ, మమతాను రాగాల మధుర వాహినినీ మనమూ ఆహ్వానిద్దాం. ప్రేమాను బంధాలు పెనవేసుకున్న ఆనంద లోకంలో విహరిద్దాం.
....
Footer Right Content
Tuesday, August 24, 2010
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికీ, మానవ సంబంధాల మమతానురాగాలకూ ప్రతీక. రాఖీ పౌర్ణమి... రక్షాబంధన్... పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే. మానస వీణా తంత్రులను స్పృశించే తీరు ఒక్కటే. సందెపొద్దు వెలుగులా సడిచేసే శ్రావణీ నీకిదే స్వాగతం... ప్రేమానుబంధాల పల్లకిలో అరుదెంచు సౌధామినీ నీకిదే సుస్వాగతం అంటూ అందరూ ఆహ్వానించే ఆరోజు ఈరోజే. 'నీకు నేను, నాకు నువ్వు' అన్న మధుర భావనతో రాఖీ కట్టుకుని మురిసిపోయే అన్నా చెల్లెళ్లకూ, అక్కా తమ్ముళ్లకూ మరింత ప్రత్యేకమైన రోజిది. 'అన్నా' అన్న పిలుపులో ఎంత ఆనందమో... 'అక్కా' అన్న పలకరింపులో ఎంత అనురాగమో... 'చెల్లీ' అన్న మాటలో ఎంత అనుంబంధమో... 'నేస్తం' అన్న శబ్దంలో ఎంత తీయదనమో... అనుభవించే కొద్దీ అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఎన్నడూ తరగనివి, ఎప్పటికీ మాయనివి, ఏనాటికీ తనివి తీరనివి, ఆత్మీయతానురాగాల మానవ సంబంధాలివి. ఎప్పుడూ ఉండేవే అయినా అప్పుడప్పుడూ వాటి ప్రత్యేకతని లోకానికి చాటిచెప్పేందుకు, మరోసారి గుర్తు చేసుకునేందుకు కొన్ని పర్వదినాలు వెలిశాయి. అలాంటి వాటిలో మేటియైనది నేటి రక్షాబంధన్. ప్రతి గడపలో ఎదురు చూపు... ప్రతి మనసులో మైమరుపు... 'చెల్లి వస్తుందన్న' ఆశతో అన్న మనసు పులకరిస్తుంది. తమ్ముడొస్తాడన్న ఆనందంతో అక్క మనసు పరవశిస్తుంది. నేస్తానికో రాఖీ అన్న భావంతో మనసు ఉప్పొంగుతుంది. హృదయ వీణా తంత్రులెవరో మీటినట్లు తోస్తుంది. పరువాల పన్నీటి జల్లులెవరో చినికినట్లు అన్పిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment