....

Footer Right Content

Thursday, August 11, 2011

వెల్లివిరియనున్న తెలుగు సౌరభం

రేపటి నుంచి విజయవాడలో  ప్రపంచ తెలుగు మహాసభలు
 
‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ.. మా కన్నతల్లికీ మంగళారతులు’ అంటూ తెలుగువారి చరిత్ర, సంస్కృతి, మనుగడ, స్థితిగతులపై దృష్టి సారిస్తూ కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నారు. దేశ, విదేశాల్లోని సాహిత్య, భాష, పరిశోధన, సాంకేతిక నిపుణులకు ఈ సభలు సగర్వంగా స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు వెలుగులను కనులకు కడుతూ మూణ్నాళ్లు జరిగే ఈ తెలుగు పండుగకు వేటూరి సుందరామమూర్తి ప్రాంగణం (తుమ్మలపల్లివారి కళాక్షేత్రం) వేదికైంది.

‘దేశ భాషలందు తెలుగు లెస్స!’ రానున్న 13, 14, 15 తేదీల్లో విజయవాడలో ఏనోట విన్నా ఈ మాటే వినబడుతుందనడంలో అతిశయోక్తిలేదు!! ఆ మూడు రోజులూ తెలుగు భాషాభిమానులకు పర్వదినాలే! దేశ విదేశాల్లోని సాహితీవేత్తలు, భాషావేత్తలు, చరిత్ర పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, భాషాభిమానులు, భాషోద్యమకా రులు ‘వేటూరి’ వేదికపై తెలుగు మకరందాన్ని గ్రోలేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
సినారే చేతులమీదుగా..
నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న తెలుగు మహాసభలను జ్ఞానపీఠ్‌అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. రయితల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సభలకు ప్రముఖ కవి, రచయిత , సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, ప్రముఖ ఉర్దూ కవి షీన్ కాఫ్ నిజామ్, మళయాళ మహిళా ఉద్యమ నాయకురాలు ఆచార్య సారా జోసఫ్, పంజాబీ కవి డాక్టర్ సుజిత్ పాటర్, ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు, గజల్ శ్రీనివాస్ పాల్గొంటారు.
ఈ వేదికపై ముక్కామల నాగభూషణం రచనల సీడీని ప్రముఖ తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ ఆవిష్కరించనున్నారు. ‘తెలుగు వెన్నెల’ పుస్తకాన్ని డాక్టర్ సోమసుందర్ ఆవిష్కరిస్తారు. సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభల లక్ష్య ప్రస్తావనను వివరిస్తారు.

‘వేటూరి’ వేదికపై..
‘వేటూరి’ వేదికపై మూడు రోజులూ సాయంత్రం 6 గంటల నుంచి అష్టావధానం, భువన విజయం, ఆశుకవితా విన్యాసంతోపాటు తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేదికపై ‘తెలుగు పున్నమి’ పరిశోధన గ్రంథం, ‘తెలుగు వెన్నెల’ మహాసభల ప్రత్యేక సంచిక, కృష్ణా జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముక్కామల నాగభూషణం శత జయంతి సందర్భంగా ఆయన రచనల సీడీలు, ప్రతినిధులైన రచయితల గ్రంథాల ఆవిష్కరణలు ఉంటాయి. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతినీ సుసంపన్నం చేసిన 700మంది తెలుగు ప్రముఖుల చిత్ర పటాలను విజయవాడ వీధుల్లో ఏర్పాటు చేయడం ద్వారా నిర్వాహకులు తెలుగు ఖ్యాతిని జగజ్జేయం చేయనున్నారు. సభాస్ధలిలో తెలుగు ప్రాచీనతను చాటిచెప్పే పురావస్తు ప్రదర్శన, విజయవాడ మారుతీనగర్‌లోని విశ్వనాథ సత్యనారాయణ నివాసంలో ఆయన జీవిత చరిత్రను తెలిపే ఫొటోల ప్రదర్శన ఉంటుంది.

‘ఎస్‌వీఎస్’ మరో వేదిక!
ప్రారంభ సభను వేటూరి వేదికపై నిర్వహించనున్నారు. మొత్తం మూడు రోజులు జరిగే ఈ వేడుకలకు బెంజి సర్కిల్ సమీపంలోని ఎస్‌వీఎస్ కళ్యాణ మండపం కూడా మరో వేదికైంది. ఈ కళ్యాణ మండపాన్ని రెండు వేదికలుగా విభజించారు. ఒక వేదికకు మహాకవి శ్రీశ్రీ సభా ప్రాంగణమని, రెండో దానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రాంగణమని నిర్వాహకులు పేరు పెట్టారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెలుగు చరిత్ర, సంస్కృతి, సాంకేతికత, రేపటి అవసరాలు అనే అంశాలపై ఏకకాలంలో సదస్సులు నిర్వహించనున్నారు. దాదాపు 200 మంది సాహితీవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ సదస్సులకు హాజరవుతున్నారు. సాయం సమయాల్లో ప్రతినిధుల కవి సమ్మేళనాలూ ఉంటాయి.

రానున్న అధికార ప్రముఖులు..
పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, పీ సురేంద్ర, కేవీ రమణాచారి, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ఎం కాంతారావు, డాక్టర్ పీ ప్రభాకర్, హర్షవర్థన్, శైలజా సుమన్, డీ ప్రసాదరావు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, పీ చెన్నారెడ్డి, డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఏ విద్యాసాగర్, డాక్టర్ కే శ్రీనివాసరావు, వంటి పలువురు అధికార ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు.

విదేశీ ప్రముఖులు..
‘మారిషస్-ఆంధ్ర’ తెలుగు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తేజ్ నారాయణ్, కోడి రమణ, చిన్నయ్య కూనయ్య, ‘సిలికాన్-ఆంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్, జోర్డాన్ తెలుగు సంఘం అధ్యక్షులు డీఎంఆర్ శేఖర్, లండన్ తెలుగు సంఘం అధ్యక్షులు కోట మల్లేష్, కొత్తపల్లి నారాయణ స్వామి, డాక్టర్ కుమార్ అన్నవరపు, డాక్టర్ తెన్నేటి చంద్రకళాధరరావు(అమెరికా), సత్యమూర్తి (సింగపూర్), జయకుమార్(సీనియర్ జర్నలిస్టు, లండన్), దివ్య సునీతారాజ్(రష్యా) పాల్గొంటారు.

పత్రికా రంగ ప్రముఖులు..
సాక్షి ఎడిటర్ వీ మురళి, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబీకే ప్రసాద్, ఐ వెంకట్రావు, కే శ్రీరామచంద్రమూర్తి, రవిప్రకాష్, నరేంద్ర చౌదరి, ఎంవీఆర్ శాస్త్రి, కే శ్రీనివాస్, విజయ్ బాబు, టంకసాల అశోక్, వేమూరి బలరామ్, తెలకపల్లి రవి, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, పీ రామ్మూర్తి, విరాట్ వెంకటేశ్వర్లు, ఏఏవీ ప్రసాద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాఖ వారిచే తెలుగు ప్రజల సంస్కృతి, చరిత్రల పురావస్తు చిత్ర ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సభల లక్ష్యాలు, చర్చనీయ అంశాలు ఇవి!
పురావస్తు పరిశోధనలు, తెలుగు నాణేలు, శాసనాలు, భాష ప్రాచీనతలను నిరూపించే పరిశోధనాంశాలు, పురావస్తు ఆధారాల పరిశీలన.

తెలుగు సాహిత్యంలో ప్రధాన ఘట్టాలు, సంప్రదాయాలు, సాహిత్య పరిశోధనలు, బాల సాహిత్యం, నాటక, నవల , కథ, కవితా రచనల రేపటి పరిస్థితులు. తెలుగు విమర్శ. సాహిత్యంలో నిబద్ధత. ఆధునికత. అవాంఛనీయ ధోరణులు. పత్రికా రంగంలో భాషా వ్యాప్తిపై పరిశీలన.

తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని తెలుగువారి జీవనం. భాషా సంస్కృతులపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై చర్చ.

రేపటి అవసరాలకు తగినట్లుగా తెలుగు భాషా బోధన. తెలుగు మాధ్యమంలోని పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు. మాతృభాషలో ప్రాథమిక విద్యపై శాస్త్రీయ అవగాహన. తెలుగు పండితులకు సముచిత గౌరవాన్ని ప్రభుత్వం, విద్యాసంస్థలు అందించడంపై చర్చ.

తెలుగుకు విశిష్ట ప్రాచీన సుసంపన్న హోదా ప్రకటించిన తర్వాత చేపట్టనున్న నిర్దిష్ట కార్యక్రమాలపై హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, మైసూరు భారతీయ భాషా కేంద్రం, కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, సంబంధిత సంస్థల ప్రతిపాదనలు.

ఆధునిక అవసరాలకు తగినట్లుగా తెలుగు భాష ఆధునికీకరణ. తెలుగు లిపి-కంప్యూటర్ అవసరాలు, కంప్యూటర్‌లో తెలుగు పదజాలం. తెలుగు సాంకేతిక ఉపకరణాలు. తెలుగు యూనికోడ్. వెబ్ సైట్లు, బ్లాగులు, సోషల్ నెట్‌వర్క్ సైట్లు తదితర అంశాలపై విశేష చర్చలు తెలుగు వేదికలపై సాగనున్నాయి.


సభల సారధ్యం వీరిదే...
కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, కార్య నిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ ఈ కార్యక్రమాలను నిర్వహించి, పర్యవేక్షించనున్నారు.

No comments:

Post a Comment