....

Footer Right Content

Friday, December 31, 2010

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

గడిచిపోతున్న ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతాలు చెబుతూ డిసెంబరు 31న వేడుకలు చేసుకోవడం పరిపాటి. నేటి సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమౌతున్నారు. వారం ముందునుంచే వేడుకలకు ప్రణాళిక వేసుకునేవారూ ఉన్నారు. ఏడాది చివరి రోజు స్మృతిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఆ అనుభూతిని మిగుల్చుకోవాలని ఎవరి కార్యక్రమాలు వారు ఏర్పాట్లు చేసుకుంటారు. అదేవిధంగా హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు తదితరాలు ఇప్పటికే యువతను ఆకర్షించే పనిలో మునిగితేలుతున్నాయి. హంగులు, ఆర్భాటాలతో వేడుకలకు సిద్ధమౌతున్నాయి. విందులు వినోదాలకే  యువత మొగ్గుచూపుతున్నారు. ఏదేమైనా నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మంచి నిర్ణయాలకు అనువైంది : డిసెంబరు 31న విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరూ ఓ సారి సంవత్సరాన్ని నెమరు వేసుకోవడం మంచిది. గడిచిన ఏడాదిలో వైఫల్యాలను రాసుకోవాలి. వచ్చే ఏడాదిలో వాటిని అధిగమించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. వ్యక్తిగత జీవితంలో, వృత్తిలో, విద్యలో పురోగతిని అంచనా వేయాలి. దురలవాట్లకు స్వస్తి పలకాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వచ్చే ఏడాదిలో విజయానికి సోపానాలు వేయాలి. అప్పుడు రాబోయే రోజులు మనవే.

నూతన సంవత్సర వేడుకల పేరుతో  స్వదేశీ, విదేశీ మద్యం సేవించడం, పార్టీలకు పబ్బులకు వేలాది రూపాయలు తగలేయడం, భారీ కేకులు కట్‌ చేయడం కంటే భిన్నంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే ఆనందంగా వుంటుంది. అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు సందర్శించడం, వారితో వేడుకల్లో పాల్గొనడం, ఏదైనా సామాజిక కార్యక్రమాలు, పదిమందికి పనికొచ్చే కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేస్తే నలుగురికి ఆదర్శంగా ఉండటమే కాకుండా ఆత్మ సంతృప్తి కూడా ఉంటుంది.

అతి సర్వత్ర వర్జేత్‌ అన్నారు పెద్దలు. శృతి మించి ఏదీ చేయారాదని దీని అర్థం. న్యూఇయర్‌ సంబరాలని, పార్టీలని వేడుకలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ పరిమితులు దాటకుండా చేసుకోవడం అవసరం. ఈ ఏడాది నూతన సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారనుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చింది. టార్గెట్లు విడుదల చేశారు. అయితే మందుబాబులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. గతంలో కొందరు హైదరాబాద్ నగర శివారులో కోళ్ల ఫారంలోని అతిథిగృహంలో మందుపార్టీ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. చలితోపాటు దోమలను పారదోలడానికి పొగబెట్టి మత్తులో తొంగున్నారు. గదిలో పొగచుట్టుకుని ఊపిరాడక తెల్లవారేసరికి మత్తులోనే తనువు చాలించారు. ఇది వారి కుటుంబాల్లో తీరని వ్యధను మిగిలించింది.  అదేవిధంగా అనేకచోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదుపు లేకుండా వాహనాలు నడపడమే దీనికి కారణం. సైలెన్సర్‌లు పీకి మరీ ద్విచక్రవాహనాలు నడపడం, ముగ్గురు ఒకే వాహనంపై ప్రయాణించడం, చేతులు వదిలి నడపడం లాంటి చిలిపి పనులు రోడ్లపై చేయకూడదు. ఇది చేసేవారికంటే ఇతరులకు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. సంబరాలంటే నలుగురికీ సంతోషాన్ని పంచిపెట్టేవే.  డిసెంబరు 31ని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

4 comments:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

    ReplyDelete
  3. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

    ReplyDelete