సామాన్యుల చెంతకు టెక్నాలజీ తీసుకెళ్లడానికి మహోద్యమం చేయాలని జాతీయ అకడమిక్, రీసెర్చ్ సదస్సు(ఎన్‌సిఎఆర్) పిలుపునిచ్చింది. బోధనా, పరిశోధనల్లో ఫ్రీసాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, సమాజ ఉపయోగ పరిశోధనల కోసం విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత పెరగాలని సదస్సు సూచించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన జాతీయ సదస్సు ఈ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 550 మంది విద్యావేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. విద్య, పరిశోధన రంగాల్లోని పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు ఉపాధ్యాయులు ఫ్రీ సాఫ్ట్‌వేర్ వినియోగంపై మక్కువ చూపుతున్నారు. విద్య, పరిశోధనల్లో ఫ్రీ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందని ఎఐసిటిఇ, యుజిసి వంటి సంస్థలకు ఈ సదస్సు పిలుపునిచ్చింది. శనివారం నాటి ముగింపు సెషన్‌కు విద్యావేత్త, ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌స్పేస్, సాఫ్ట్‌వేర్, విజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరణ చేయడానికి భారీ ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. టెక్నాలజీ కేవలం కొందరి వద్దే కేంద్రీకృతమవ్వకుండా స్వాతంత్రోద్యమం తరహాలో సైబర్‌రంగంలో మహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ఈ చర్య కావాలన్నారు. డిజిటల్ రంగంలోని అసమానతలు సామాజిక, ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందని చెప్పారు.
ఎఫ్‌ఎస్‌ఎంఐ అధ్యక్షుడు థామస్ జోసెఫ్ మాట్లాడుతూ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఉపయోగం, సాధికారత సాధించడం, ఈ క్రమంలో సమాజహితం గురించి విద్యావేత్తలు, పరిశోధకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎఫ్‌ఎస్‌ఎంఐ ప్రధాన కార్యదర్శి వై.కిరణ్ చంద్ర, స్వేచ్ఛా వర్కింగ్ ఛైర్మన్ ఎల్.ప్రతాప్‌రెడ్డి, సదస్సు నిర్వహణ కమిటీ వర్కింగ్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కెఎస్ రంజన్, హైదరాబాద్ ఐఐటికి చెందిన మేజర్ జనరల్ బగ్గా తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు ఈ సెషన్‌లో 'ఇ-గవర్నెన్స్, ఓపెన్‌సోర్స్ పాలసీ' అంశంపై వక్తలు మాట్లాడారు. సామాన్యుని చెంతకు పరిపాలనను తీసుకెళ్లడానికి ఇ-గవర్నెన్స్ తగిన సాధనమని అభిప్రాయపడ్డారు. ఈ సెషన్‌కు అంజనా సిన్హా అధ్యక్ష వహించారు. ఇందులో రెడ్‌హాట్ డైరెక్టర్ వెంకటేశ్ హరిహరన్, ఎన్‌ఐసి నుంచి డాక్టర్ బాలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ సంస్థ నుంచి డాక్టర్ మాధవ్ కుమార్ మాట్లాడారు.
'ఫాస్ (ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్) న్యాయ కోణాలు' అనే అంశంపై నిర్వహించిన సెషన్‌లో నల్సార్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడారు. మేథో సంపత్తి వ్యాపారమయం కావడంతో జీవించే హక్కు కూడా ప్రమాదంలో పడిందన్నారు. గోప్యత, పేటెంట్, కాపీరైట్ అనేవి సమాచార హక్కుకు విరుద్ధమని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్‌కు చెందిన ప్రశాంత్ సుజాతన్ మాట్లాడుతూ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ పేటెంట్ల మధ్య వ్యాజ్యాలు వృథా ప్రయాసగా అభివర్ణించారు. ఇది కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతుందని అన్నారు. సంస్థలు పేటెంట్ పొందడాన్ని ఆయన విమర్శించారు.
No comments:
Post a Comment