....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 8

అభివృద్ధి ఇంజన్ హైదరాబాద్

అధ్యాయం-6
* హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా చూడాలి
* నగరం అందరికీ అందుబాటులో ఉండాలి
* దీని ఆర్థిక పురోగతి కొనసాగితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి
* అభివృద్ధి జరగాలంటే.. అనిశ్చిత వాతావరణం కొనసాగకూడదు
* విధాన నిర్ణేతల సామర్థ్యంపైనే భాగ్యనగరం భవిష్యత్తు ఆధారపడి ఉంది
* ఏడాదికి 10.6 శాతం జనాభా నగరానికి వలస వస్తున్నారు
* వలసదారులు.. ప్రత్యేకించి కోస్తావారు నగర ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములు
* నగరంతో మూడు ప్రాంతాల ప్రజలకూ బలమైన మానసిక అనుబంధం

అందిన వినతిపత్రాలను పరిశీలించి, పార్టీలు, ఇతర గ్రూపులతో చర్చించాక ‘హైదరాబాద్ మహానగరం’ అంశానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని, సంబంధిత అన్ని అంశాల్లోనూ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తించాం. హైదరాబాద్‌పై అధ్యయనం చేసే బాధ్యతను ఢిల్లీలోని ‘విధాన పరిశోధన కేంద్రం’కు అప్పగించాం.

చారిత్రక ప్రాముఖ్యత
1765, 1800 సంవత్సరాల్లో ఉత్తర సర్కారు(కోస్తా) జిల్లాలు, సీడెడ్(రాయలసీమ) జిల్లాలు బ్రిటిష్ పాలనలోకి వెళ్లాయి. దీంతో సాగునీరులాంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా నిజాంల పాలనలో ఉన్న తెలంగాణ జిల్లాల కంటే ఆ ప్రాంతాల్లో అనూహ్యమైన అభివృద్ధి మొదలైంది. నిజాంలు తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టకపోయినప్పటికీ.. హైదరాబాద్‌ను ఓ శక్తివంతమైన నగరంగా తీర్చిదిద్దారు. 1941 జనాభాలెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 85 శాతం మంది హిందువులు. 12 శాతం మంది ముస్లింలు.(ప్రస్తుత తెలంగాణలోనూ ఇదే కొనసాగుతోంది.) నాడు ఈ రాష్ట్రంలో 48.2 శాతం తెలుగు, 26.4 శాతం మరాఠీ, 12.3 శాతం కన్నడ, 10.3 శాతం ఉర్దూ మాట్లాడే వారున్నారు.

అతిపెద్ద నగరం
రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరం విశాఖపట్నం కంటే జనాభా పరంగా హైదరాబాద్ నాలుగు రెట్లు పెద్దది. అలాగే తర్వాతి 9 అతిపెద్ద నగరాల మొత్తానికంటే ఇక్కడి జనాభాయే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 11 శాతం మంది ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్‌లో చాలా కీలక సంస్థలున్నాయి. ఇందులో 28 రక్షణ లేదా జాతీయ భద్రత దృష్ట్యా వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉన్నవి. దీనికితోడు జాతీయ పరిశోధన, అభివృద్ధి, విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో 40 సంస్థలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 9 విద్యాసంస్థలు(ఎక్కువశాతం యూనివర్సిటీలు) నడుస్తున్నాయి. ఈ సంస్థలన్నీ దేశం నలుమూలల నుంచీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కోస్తాంధ్ర, తెలంగాణల నుంచి వచ్చే ఆదాయం ఒకేలా ఉన్నప్పటికీ.. తెలంగాణ జీడీపీలోని ఆరు శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది.

హైదరాబాద్ చుట్టూ పరిస్థితులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆర్థిక వ్యవస్థలో ఆధు నిక సేవల వాటా బాగా పెరుగుతోంది. 1999-00 నుంచి 2005-06 మధ్య ఆధునిక సేవల జీడీపీలో హైదరాబాద్, రంగారెడ్డిల వాటా 18% నుంచి 25 శాతానికి పెరిగింది. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఇది తగ్గుముఖంపట్టింది. నోటిఫై చేసిన 72 సెజ్‌లలో(అనుమతి పొందినవి 103) 40 సెజ్‌లు(అనుమతి పొందినవి 57) హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. విస్తీర్ణం పరంగా చూస్తే 60 శాతం సెజ్‌ల విస్తీర్ణం కోస్తాలోనే ఉంది. మిగతా 40% తెలంగాణ, సీమల్లో ఉంది.

ఐటీ, పెట్టుబడులు
దేశంలోని మొత్తం ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా క్రమంగా పెరుగుతోంది. 2005-06లో 12 శాతంగా ఉన్న ఈ వాటా 2008-09కి 15కు పెరిగింది. రూపాయల్లో చూస్తే ఇది 32,500 కోట్లు. రాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల్లో దాదాపుగా అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ పరిశ్రమలతోనే ముడిపడి ఉంది. రాజకీయ పరిస్థితులు ఎలాఉన్నప్పటికీ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు కొనసాగాయి. ప్రధాన మౌలికవసతుల ప్రాజెక్టుల మూలంగా నగరానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌రింగ్ రోడ్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, ఎంఎంటీఎస్, మెట్రో రైల్ ప్రాజెక్టు. 2001 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌కు ఏడాదికి 10.6 శాతం జనాభా వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి వలస వెళుతున్నవారు 3.2 శాతం మాత్రమే.

ఇతర నగర కేంద్రాలు
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత బాగా పేరున్న నగరం విశాఖపట్నం. ఈ నగరం అనేక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, తూర్పు నౌకాదళ కమాండ్‌కు నెలవుగా ఉంది. తద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షిస్తుండడంతో దీనికి కాస్మోపాలిటన్ ఇమేజ్ ఏర్పడింది. విశాఖ-కాకినాడ కోస్తా కారిడార్ వెంబడి పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ పెట్టుబడుల ప్రాంతాన్ని (పీసీపీఐఆర్) ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిగాక.. కేజీ బేసిన్‌లో రిలయన్స్, ఎస్సార్-గుజరాత్‌ల ఆధ్వర్యంలోని గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టులు, మరోవైపు జీఎంఆర్ వంటి సంస్థలు కాకినాడ చుట్టుపక్కల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతున్నాయి. సంపన్నవంతమైన డెల్టా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరిల్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వృద్ధి చెందాయి. విధాన స్థాయిని మినహాయించితే.. మిగతా కార్యకలాపాలన్నింటిలోనూ.. వాటికి హైదరాబాద్‌తో ఉన్న సంబంధం పరిమితమే.

రాయలసీమ
రాయలసీమలో పట్టణీకరణ తక్కువ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వలసలు అధికంగా ఉండడం ఇందుకు సాక్ష్యం. ఈ ప్రాంతంలోని పెద్ద పట్టణం కర్నూలు మాత్రమే. తర్వాత తిరుపతి ఉంది. తిరుపతి ఆలయ పట్టణంగా ప్రసిద్ధి. అయితే ఇది యాత్రాస్థలం పరిధిని మించి పోవడం లేదు.

ఎవరి ఆర్థిక పునాది వారికుంది
పైన పేర్కొన్న కీలక నగరాలు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ముఖ్య పట్టణాల మధ్య పరస్పర ఆధారిత ఆర్థిక అవసరాలు పరిమితమే. హైదరాబాద్, కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని ప్రతి పట్టణ కేంద్రం కూడా తమకంటూ సొంతంగా పోషకత్వంతో కూడిన ఆర్థిక పునాదిని, వృద్ధి కారకాలను కలిగి ఉన్నాయి. ఈ విధమైన ఆర్థిక వైవిధ్యం ఉన్నప్పటికీ అది ప్రాంతాల మధ్య ప్రజల రాకపోకలకు, బలమైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకునేందుకు అడ్డంకిగా నిలవడం లేదు.

హైదరాబాద్‌పై ఆధారపడలేదు
ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ప్రధాన పట్టణ కేంద్రమనే విషయం స్పష్టమవుతుంది. ఇది రాష్ట్రంలోని ఇతర నగరాల కంటే భారీ నగరమైనప్పటికీ.. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఇతర నగరాలు మార్కెట్ అనుసంధానం, ఇతర సేవల కోసం దీనిపైనే పూర్తిగా ఆధారపడి మాత్రం లేవు.

సారాంశం
హైదరాబాద్ ఆర్థిక వ్యవహారాలు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉన్నాయి. కీలక స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతీయ వృద్ధిని బాగా ప్రభావితం చేస్తోంది. నిజాం హయాం నుంచి అందుకున్న అత్యున్నత నాణ్యతాపరమైన మౌలిక వసతులను అంతకంతకు పెంచుకుని ఐటీలు, ఐటీ ఆధారిత సేవల ద్వారా ప్రపంచ ఆర్థిక యవనికపై తనదైన ముద్రవేసింది. రాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవలన్నీ దాదాపు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. బెంగళూరు, ముంబై, జాతీయ రాజధాని ప్రాంతం, చెన్నై తర్వాత ఐదో అతిపెద్ద కేంద్రంగా హైదరాబాద్ ఎదిగింది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలలో ఆధునిక సేవల రంగం వాటా 39% కాగా.. రవాణా
రంగం వాటా 19%. వీటిపై ఆధారపడి లబ్ధి పొందుతున్న రియల్ ఎస్టేట్ రంగం.. కూడా ఇక్కడ విభిన్నంగా ఉంది. ఈ రంగంలో ప్రాంతీయ సంస్థలతోపాటు జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో మాన్యుఫ్యాక్చరింగ్ బాగా విస్తరించింది. హైదరాబాద్ దేశంతోపాటు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నిజానికి తెలంగాణ జీడీపీలో ఆరు శాతం హైదరాబాద్ నుంచి వచ్చేదే.

హైదరాబాద్‌కు వచ్చే వలసలు, పెట్టుబడులు.. దాని భిన్న సంస్కృతుల గుర్తింపును, సామాజిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు, పౌర, సైనిక పరిశోధన, అభివృద్ధి ఆర్గనైజేషన్లు, రక్షణ దళ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

+ 2001లో హైదరాబాద్ మహానగర ప్రాంత జనాభా 75,86,813 కాగా.. 2011లో ఇది 1 కోటీ 3 లక్షలకు చేరుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో 8 లక్షల మంది హైదరాబాద్‌ను విడిచి కోస్తా, సీమల్లోని తమ ఊళ్లకు వెళతారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు ప్రత్యేకించి కోస్తా నుంచి వచ్చినవారు.. ఈ నగర ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అలాగే ఇక్కడవారు ప్రముఖ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వలసదారులు భారీగా వస్తున్నారు.

+ హైదరాబాద్‌లోని విద్యాసంస్థలు మూడు ప్రాంతాల యువతకూ చాలా కీలకం. చిన్న వ్యాపారస్తులు, మాదిరి నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా ఇక్కడ తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు.

+ మూడు ప్రాంతాల ప్రజలూ హైదరాబాద్‌తో బలమైన మానసిక అనుబంధాన్ని పెంపొందించుకున్నారు. రాష్ట్ర పరిస్థితి మారితే రాజధానితో సంబంధాలు కోల్పోతామేమోన్న భయం వారిని వెంటాడుతోంది.

+ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, రాజధాని భవిష్యత్తుకు, వ్యాపారాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అందరికీ అందుబాటులో ఉండాలి. కేంద్ర ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి అభివృద్ధి ఇంజన్‌లా ఉన్న హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ ఇలాగే భారీగా పెరుగుతూ ఉంటే.. ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఇది అన్ని ప్రాంతాల ప్రజలకూ ప్రయోజనం. అంతర్జాతీయంగా పేరు సంపాదించిన నేపథ్యంలో.. ‘నూతన ఆర్థిక వ్యవస్థ’ కేంద్రంగా మారిన హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో ఉన్న అంతర్గత ఆర్థిక బంధాలను ప్రోత్సహించి వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి జరగాలంటే.. అనిశ్చితి వాతావరణం కొనసాగకూడదు. దీనికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునేవారి సామర్థ్యంపైనే హైదరాబాద్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

సెటిలర్లు
సాధారణంగా ఇక్కడ కోస్తా నుంచి వలస వచ్చిన వారిని సెటిలర్లుగా పిలుస్తున్నారు. వీరు నాలుగు దశల్లో వచ్చారు.

తొలి దశ: నిజాంసాగర్ డ్యాం దిగువ ప్రాంతంలో భూముల సాగు కోసం నిజాం ప్రభుత్వం కోస్తాంధ్ర రైతులను ఆహ్వానించింది. అదే సమయంలో కోస్తాంధ్ర జిల్లాల్లో పెట్టుబడిదారీ రైతు వర్గం మరింత విస్తరించింది. తెలంగాణలో ‘గుంటూరు పల్లెలు’ ఏర్పాటు చేసింది ఈ సెటిలర్లే.

రెండో దశ: 1950లలో కమ్యూనిస్టులు తమ పట్టు కోల్పోతున్నప్పుడు ఇది జరిగింది. ఎగువన కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందేందుకు తెలంగాణకు తరలి రావాలంటూ కమ్యూనిస్టులు తమ శ్రేణులను ప్రోత్సహించారు.

మూడో దశ: 1980లలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ హయాంతో ఇది మొదలైంది.
నాలుగో దశ: 2000 నుంచి ఐటీ బూమ్ రావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ విద్యావంతులు హైదరాబాద్‌కు తరలివచ్చారు.

తొలి దశ నుంచే స్థానికులు, సెటిలర్ల మధ్య తేడా తగ్గడం మొదలైంది. తొలి రెండు దశల్లో వచ్చిన వారిలో చాలా మంది తమ మూలాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు వార్తా కథనాలను బట్టి తెలుస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పుట్టి హైదరాబాద్, రంగారెడ్డిలలో ఉంటున్న వారు ఇక్కడి జనాభా మొత్తంలో 7.2%. వీరు ఈ రెండు జిల్లాలకు వెలుపల పుట్టిన వారిలో సగానికంటే తక్కువ.

No comments:

Post a Comment