....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 13

ఆరోగ్యం.. నిదానం
శ్రీకృష్ణ కమిటీ రాష్ర్టంలోని మూడు ప్రాంతాలలో పర్యటించినపుడు గానీ, హైదరాబాద్‌లో వివిధ గ్రూపులతో చర్చించినపుడు గానీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ఎవరూ ప్రస్తావించలేదు. మనిషి జీవనవిధానంలో ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన సూచిక కనుక రాష్ర్టంలోని 3 ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య ఫలితాల గురించి శ్రీకృష్ణ కమిటీ చర్చించింది.
ఆరోగ్య మౌలిక సదుపాయాలు: ఆసుపత్రుల సంఖ్య, ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌సీలు), పడకలు, డాక్టర్లు వంటి విషయాల్లో 1961 నుంచి 2009 వరకూ రాష్ర్టంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలగురించి ఈ భాగంలో చర్చించారు. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య సదుపాయాల గురించి సమాచారమే అందుబాటులో ఉంది. ప్రైవేటు రంగం గురించి తగిన సమాచారం లేదు. రాష్ర్టంలో 1960-61లో అల్లోపతి డిస్పెన్సరీలు 564 ఉండగా 1990-91కి 1,680కి పెరిగాయి. అయితే క్రమంగా తగ్గుతూ 2009 నాటికి వీటిసంఖ్య 289కి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ డిస్పెన్సరీలను ప్రైమరీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడమే. హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలో ఈ డిస్పెన్సరీల సంఖ్య రాయలసీమ, కోస్తాంధ్ర కన్నా తక్కువగా ఉన్నాయి. రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల సంఖ్య చూస్తే మూడు ప్రాంతాలలో అంతరం చాలా తక్కువ. ఇది క్రమేణా తగ్గుతున్నది. 1998-99లో లక్ష గ్రామీణ జనాభాకు తెలంగాణలో 2.94 పీహెచ్‌సీలుండగా రాయలసీమలో 3.30, కోస్తాంధ్రలో 2.75 ఉన్నాయి.

31.3.2009 నాటికి తెలంగాణలో 2.53, రాయలసీమలో 2.69, కోస్తాంధ్రలో 2.51 పీహెచ్‌సీలున్నాయి. అల్లోపతి ఆసుపత్రులలో పడకలసంఖ్య విషయానికొస్తే... ప్రభుత్వాసుపత్రులలో 1961లో 19వేలుగా ఉన్న పడకలు 2009కి 39 వేలకు చేరుకున్నాయి. జనాభా సంఖ్య పెరగడంతో పడకల లభ్యత తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌తో కలసి తెలంగాణ ప్రాంతాన్నిచూస్తే మిగిలిన ప్రాంతాలకన్నా మెరుగ్గా కనిపిస్తున్నా... హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణ ప్రాంతం మిగిలిన వాటి కన్నా వెనుకబడి ఉంది. రాష్ర్ట సగటుతో తెలంగాణ(హైదరాబాద్ మినహాయించి)ప్రాంతాన్ని పోల్చిచూస్తే 2001-2009 మధ్య అంతరం బాగా పెరిగింది. కోస్తాంధ్ర కన్నా రాయలసీమ మెరుగ్గా ఉంది. డాక్టర్ల సంఖ్య 1961లో 1,826గా ఉండగా 2009 నాటికి అది 10,117కి(9,321 రెగ్యులర్, 796 కాంటాక్టు) చేరుకుంది. ఈ విషయంలో కూడా హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 27,713 మంది ఏఎంఎన్ లేదా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లున్నారు. 2,305 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు వీరి శాతాన్ని పరిశీలిస్తే మూడు చోట్లకు పెద్ద తేడా లేదు. తెలంగాణ(44.72 శాతం), రాయలసీమ(44.41), కోస్తాంధ్ర(44.82)లో చొప్పున ఉన్నారు.

హైదరాబాద్‌లో వైద్యసదుపాయాలు: జంటనగరాల్లో ప్రైవేట్, ప్రభుత్వ వైద్య సదుపాయాలు కేంద్రీకృతమయ్యాయి. 2009 గణాంకాల ప్రకారం.. తెలంగాణలోని 17 వేల పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 6,700 ఏర్పాటయ్యాయి. తెలంగాణలోని 4 వేలమంది ప్రభుత్వ వైద్యులకు.. హైదరాబాద్‌లో 1,400 మందికిపైగా పనిచేస్తున్నారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్యులు, పడకల సంఖ్య మూడు రెట్లు అధికం. అన్ని సదుపాయాలు ఇక్కడ కేంద్రీకృతం కావటం మిగతా తెలంగాణ జిల్లాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. అయితే వైద్యసేవల కోసం హైదరాబాద్ వచ్చేందుకు 3 ప్రాంతాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

వైద్యరంగం ప్రైవేటీకరణ: 1980 తరువాత ప్రత్యేకించి వైద్యసేవల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జనాభాకు తగినట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెరగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యరంగానికి కేటాయింపులు క్రమేపీ తగ్గిపోయాయి. 1974లో ఇది 5.4% ఉండగా.. 2006 నాటికి 4.5 శాతానికి క్షీణిం చింది. రూపాయాల్లో చూస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చు సరాసరిన రూ. 141 నుంచి రూ. 124కి పడిపోయింది. ఆస్పత్రుల్లో కార్పొరేట్ ధోరణి పెరిగింది. వీటి ఏర్పాటు ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి నేరుగాప్రోత్సహించాయి.

ఆరోగ్యశ్రీ: సామాజిక వైద్యబీమా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేజర్ శస్తచ్రికిత్సలతోపాటు కొన్ని వ్యాధులకు చికిత్స అందుతోంది. అర్హులైనవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి బీమా ఏజన్సీ ద్వారా డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. దీనిద్వారా పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతున్నా..ప్రైవేట్ వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశముందన్న విమర్శలున్నాయి.

ఆరోగ్యంపై శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది?
రాష్ర్టంలో ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు నిదానంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఆరోగ్య సదుపాయాల తలసరి లభ్యతా అరకొరే. ప్రభుత్వం కల్పించే ఆరోగ్య సదుపాయాలు (ఆసుపత్రి పడకలు, డాక్టర్లు) రాయలసీమలో ఎక్కువగా ఉండగా తర్వాత స్థానంలో కోస్తాంధ్ర ఉంది. ఈ విషయంలో హైదరాబాద్‌ను మినహాయించి చూస్తే తెలంగాణ వెనుకబడి ఉంది. అయితే ఆరోగ్య సూచికలపరంగా చూస్తే మన కు వేరే చిత్రం కనిపిస్తుంది. రాయలసీమ, కోస్తాంధ్ర ముఖ్యంగా ఉత్తర కోస్తాలతో పోల్చితే తెలంగాణలోని ఎక్కువ జిల్లాలు సంతానోత్పత్తి, శిశు ఆరోగ్యం సూచికలలో మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం.. వాటిని బాగా ఉపయోగించుకోవడం, అలాగే ప్రైవేటు వైద్యం కోసం కుటుంబాలు బాగా ఖర్చు పెట్టడం దీనికి కారణం.

కోస్తాలోని విజయనగరం, రాయలసీమలోని కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలు సంతానోత్పత్తి, శిశు ఆరోగ్య సూచికలలో వెనకబడి ఉన్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలకు ప్రైవేటు వైద్యాన్ని భరించే స్థోమత లేకపోవడమే దీనికి కారణం. విశాఖ, గుంటూరు, నెల్లూరులలో శిశువులకు వ్యాధినిరోధక టీకాలు వేయించకపోవడం, విశాఖ, ప్రకాశంలో సంతానోత్పత్తి సూచికలు బలహీనంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య మౌలిక సదుపాయాలు విస్తరించడంతోపాటు వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య వసతులపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
 - శ్రీకృష్ణ సందేశం ‘సాక్షి’ సౌజన్యంతో...

No comments:

Post a Comment