....

Footer Right Content

Sunday, January 16, 2011

వికీపీడియా పదేళ్ల ప్రస్థానం

కంప్యూటర్‌ ప్రపంచంలో విహరించే వారికి వికీపీడియా అంటే ఏమిటో తెలియంది కాదు. ఆవిర్భవించిన పదేళ్ల కాలంలోనే అసంఖ్యాక నెటిజన్ల ఆదరణ చూరగొంది. 2001, జనవరి 15న జిమ్మీ వేల్స్‌ వికీపీడియాను నెలకొల్పారు. అంతకు ముందు ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా నూపెడియా విఫలమైన నేపథ్యంలో వికీపీడియా స్థాపనకు సాహసించారనే చెప్పాలి. పదేళ్ల అనుభవంతో మరింత మెరుగైన ప్రపంచ ప్రదర్శనకు వికీపీడియా సన్నద్ధమవుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న జనాదరణకు ప్రతిస్పందనగా విజ్ఞాన విస్తృతికి తన వికీపీడియాను వేదికగా చూపాలను కుంటోంది. వికీపీడియా ద్వారా ఉచిత సేవలు అందు తాయి. లాభాపేక్ష లేకుండా నడిచే వికీపీడియా మారుతున్న కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా సమాచార లభ్యత, దాన్ని ప్రజలకు చేరువ చేయడం, తదితర అంశాల్లో ఎన్నో మార్పులను స్వీకరించింది. ఓ మోస్తరు ఆశలతో ప్రారంభించిన వికీపీడియా ప్రస్తుతం ఎవరూ ఉహించ జాలనంత స్థాయిలో ఆదరణను చూరగొనడం చాలా సంతోషకరంగా ఉన్నట్లు వికీపీడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సూ గార్డెనర్‌ వ్యాఖ్యానించారు. పదేళ్ల ప్రస్థానం తరువాత సుమారు 250 భాషల్లో వికీపీడియా లభ్యమవుతోంది.

సుమారుగా 2 కోట్ల 60 లక్షల వివరాలు నమోదయ్యాయి. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాను సందర్శిస్తుంటారు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువకావాలన్నదే తమ ఆశయమని గార్డెనర్‌ తెలిపారు. వర్ధమాన దేశాల నుంచి ఆన్‌లైన్‌ సంప్రదింపులు నెరిపేందుకు మొబైల్‌ఫోన్ల ద్వారా ప్రయత్నించే వారిని సంతృప్తిపరిచే దిశలో ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. అమెరికాకు వెలుపల తొలిగా భారత్‌లోనే వికీపీడియా కార్యాలయాన్ని ప్రారంభించింది. సమాచారం కోసం ఎదురు చూసే మధ్యతరగతి భారతీయులను దృష్టిలో పెట్టుకొని వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు గార్డెనర్‌ చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న వికీపీడియాకు ఎడిటర్‌ 20ల ప్రాయంలో ఉన్న ఒక సైన్స్‌ పట్టభద్రుడున్నాడంటే నమ్మగలరా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వికీపీడియా సమాచారాన్ని విశ్వసించలేమంటూ అనేక విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ఒక వంక విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

No comments:

Post a Comment