సాగునీటి రంగంపై కమిటీ విశ్లేషణ
ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదు
అక్కడక్కడా సమస్యలున్నా.. పరిష్కరించవచ్చు
తెలంగాణకూ పోల‘వరమే’
విద్యుత్ వినియోగం తెలంగాణలోనే అధికం
ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ.. రాష్ట్రంలో నదులు.. ఉప నదులు.. వాటిపరీవాహక ప్రాంతాలు.. ప్రాజెక్టులు.. ప్రాంతాల మధ్య జలాల పంపిణీ.. ఎన్నెన్నో వాదనలు.. మరెన్నో అభ్యంతరాలు.. వీటన్నింటినీ శ్రీకృష్ణ కమిటీ సమగ్రంగా విశ్లేషించింది. అనేక మార్గాల నుంచి సమాచారం క్రోడీకరించి రాష్ట్రంలో సాగునీటి వనరులు, విద్యుత్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేసింది. వాటన్నింటినీ తన నివేదికలోని నాలుగో అధ్యాయంలో పొందుపరిచింది. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాదనలను ప్రస్తావించడమేకాదు.. వారి వాదనలోని హేతుబద్ధతనూ తరచిచూసింది. వారి డిమాండ్లు సరైనవో.. కావో నిర్ధారించింది. రాష్ట్రంలో జలాల పంపిణీకి సంబంధించి మూడు ప్రాంతాల మధ్య ఏమైనా వివక్ష చోటుచేసుకుందా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏడీ మొహిలీని ప్రత్యేకంగా నియమించుకుంది. మొత్తమ్మీద ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే వీలుందని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకూ లబ్ధి చేకూరుతుందని, ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేస్తే మంచిదని సూచించింది. సాగునీటికి సంబంధించి నివేదికలోని ముఖ్యాంశాలివీ...
తెలంగాణలో పరిస్థితి ఇదీ..
కృష్ణా, గోదావరి నదుల కింద తెలంగాణలోనే అత్యధికంగా ఆయకట్టు ప్రాంతం ఉన్నా ఆ మేరకు నీటి కేటాయింపులు లేవన్నది ఈ ప్రాంతవాసుల ప్రధాన ఆందోళన. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను బచావత్ ట్రిబ్యునల్, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తేల్చాయి. సాంకేతిక కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టులు, ప్రాంతాల వారీగా ఈ జలాలను పంచారు. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా ఎతె్తైన ప్రదేశంలో ఉండడంతో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకిగా మారింది.
నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదన సరిగా లేదని ప్రత్యేక తెలంగాణ కోరుతున్న వారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా తెలంగాణకు నష్టం వాటిల్లేందుకు ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే ఈ వాదన సరైంది కాదు. ట్రిబ్యునల్ ముందు వాదనలు సరిగా లేకపోవడంవల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పలేం.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందన్నది తెలంగాణవాసుల ఆందోళన. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. సాంకేతికపరంగా (ఇంజనీరింగ్ పరంగా) ఇది కొంచెం కష్టసాధ్యమైంది కావడంతో మరింత సమయం పడుతుంది.
తెలంగాణలో సంప్రదాయంగా చెరువులు, చిన్ననీటి కుంటల ఆధారంగానే సేద్యం సాగుతోంది. అయితే ప్రభుత్వాలు చిన్ననీటి వనరులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశాయని, ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నది తెలంగాణలోని కొన్ని గ్రూపుల ఆందోళన. దీంతో రైతులు చితికిపోయి, భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే చిన్నచిన్న చెరువులు, నీటి కుంటల ఆధారంగా సాగు చేయడం తగ్గుతూ.. భూగర్భ జలాల ఆధారంగా వ్యవసాయం పెరగడమన్నది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి.
జనాభా ఒత్తిడి పెరగడం, భూముల ధరలు పెరగడం, ఎక్కువ మొత్తంలో విద్యుత్తు అందుబాటులో ఉండడంవల్ల చెరువులు, చిన్న నీటివనరుల నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి తెలంగాణలో భూగర్భజలాలపై ఆధారపడి చేస్తున్న సాగు గణనీయంగా పెరిగింది. రైతులు చితికిపోయి ఉంటే సాగు పెరిగే అవకాశం లేదు. దీన్నిబట్టి ఆ గ్రూపుల వాదన తప్పని తెలుస్తోంది. ఇప్పుడు చేయాల్సిందల్లా.. ఇప్పటికే ఇస్తున్న పెట్టుబడి రుణాలు, విద్యుత్‌పై సబ్సిడీ వంటి చర్యలను మరింత మెరుగ్గా చేపట్టాలి. అలాగే అవసరమైనచోట చెరువులు, నీటి కుంటలు, చెక్ డ్యాంలను పునరుద్ధరించాలి లేదా కొత్తగా ఏర్పాటు చేయాలి.
ఇక పోలవరం విషయానికి వస్తే.. దీని ప్రతిపాదన చాలా ఏళ్ల కిందట్నుంచే ఉంది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లో కూడా ఇది భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తారు. మళ్లించిన ఈ నీళ్లను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పంచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నీటిలో తెలంగాణకూ వాటా దక్కుతుంది. పోలవరం వల్ల తెలంగాణ కొంత భూభాగం కోల్పోతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందనుంది. ఈ దశలో ప్రాజెక్టును నిలిపివేయాలని వస్తున్న డిమాండ్లు సరైనవి కావు.
తెలంగాణలో చేపట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నది మరో అభ్యంతరం. అయితే ఎతె్తైన ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో పెద్దమొత్తంలో అటవీ భూమి ముంపునకు గురవడంతోపాటు గిరిజనులు పెద్దసంఖ్యలో నిర్వాసితులు అవుతారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు రావడం కష్టమే.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు చెందిన నిపుణులు లేవనెత్తిన అభ్యంతరాలు సమంజసంగానే ఉన్నాయి.
ఇంజనీరింగ్‌పరంగా అంత కష్టసాధ్యం కానప్పటికీ జూరాల, నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ(ఎన్‌ఎల్‌బీసీ) వంటి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. వీటిపై తెలంగాణవాదుల ఆందోళన సరైనదే.
గోదావరిపై ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. వాటి వల్ల తెలంగాణలోని కింది ప్రాంతాల వరకు నీరు రావడం లేదన్నది తెలంగాణలోని కొందరు నిపుణుల మాట. ఇది నిజమే. ఎస్సారెస్పీపై కొన్ని ఎత్తిపోతల పథకాలకు అనుమతులు వచ్చాయి. ఈ ఎత్తిపోతలతో పరిస్థితి ఇంకా అధ్వానంగా మారుతుందన్న అభ్యంతరాలూ వాస్తవమే. అయితే ఇప్పటికిప్పుడు దీనికి సులువైన పరిష్కారాలు మాత్రం లేవు. తక్కువ నీటిని వినియోగించుకునే పంటలను సాగుచేయడం తాత్కాలిక ఉపశమనం. అలాగే కాకతీయ కాలువ సామర్థ్యాన్ని వీలైనంత త్వరగా పెంచాల్సిన అవసరం ఉంది.
సింగూరు-ఘన్‌పూర్-నిజాంసాగర్ వ్యవస్థపై తెలంగాణవాదుల్లో ఉన్న ఆందోళన అర్థవంతమైనదే. హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించే ఏర్పాట్లు వేగవంతంగా సాగాలి.
తెలంగాణలో నీరందని ప్రాంతాల విషయంలో కొందరు నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రాణహిత కింద మరిన్ని ఆనకట్టలు నిర్మిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు దీనిపై తీవ్రంగా అధ్యయనం చేయాలి.
రాయలసీమలో ఇలా..
కృష్ణా, పెన్నాలకు సంబంధించి 1951 ప్రణాళిక ప్రకారం రాయలసీమ 500 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ మాత్రం ఈ 500 టీఎంసీల ప్రతిపాదనను తిరస్కరించిన సంగతిని వారు గుర్తించాలి.
రాయలసీమలో కాలువల నిర్వహణ సరిగా లేదన్నది ఈ ప్రాంతవాసుల ప్రధాన అభ్యంతరం. ఇది సరైనదే. అయితే రాయలసీమలో పెద్దసంఖ్యలో బోరుబావులున్నాయి. కాలువలకు లైనింగ్ వేయడం, వాటి నిర్వహణను మెరుగుపర్చడం తరచుగా చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే భూగర్భ జలాలు మరింత అడుగంటుతాయి. వీటికి బదులుగా కాలువల్లో పూడిక తీయడం లాంటి చర్యలు చేపట్టాలి.
ఆంధ్రాలో ఇదీ పరిస్థితి..
డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 181 టీఎంసీల నీటిలో.. 20 టీఎంసీలను తెలంగాణలోని భీమా ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారన్నది కోస్తాంధ్ర వాసుల అభ్యంతరం. అలాగే నెల్లూరుకు నీటి కేటాయింపును అడ్డుకుని తెలంగాణలోని జూరాలకు తరలించారన్నది వీరి మరో ఆందోళన. అయితే ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో జూరాలకు ఎగువ కృష్ణా ప్రాజెక్టు నుంచి నీరు అందేది. అందువల్ల ప్రస్తుతం జూరాలకు నీటిని ఇవ్వడం సబబే. అలాగే ఎస్సార్బీసీకి 1981లోనే శ్రీకారం చుట్టినా, నేటికీ పనులు పూర్తి కాలేదని కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే వివిధ మార్గాల్లో ఎస్సార్బీసీ కింద గణనీయంగానే పంటలు సాగవుతున్నాయి. అందువల్ల ఈ అభ్యంతరం సరైంది కాదు.
ఎస్సారెస్పీ ద్వారా ఎగువ నీటిని అంతా తెలంగాణ వాసులే వాడుకుంటున్నారన్నది కోస్తాంధ్రవాసుల మరో అభ్యంతరం. అయితే ప్రాణహిత, శబరి, ఇంద్రావతి ఉపనదుల ద్వారా కోస్తా అవసరాలు తీరే అవకాశం ఉంది. అందువల్ల వారి అభ్యంతరం సమంజసం కాదు.
గోదావరిపై భారీఎత్తున ఎత్తిపోతలు నిర్మిస్తే ద్వారా ఆ నదిలో నీరు ఎండిపోయే ప్రమాదం ఉందని కోస్తావాసుల ఆందోళన. ఇది సబబే. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.
గోదావరి డెల్టాను పరిరక్షించేందుకు భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకునే సౌకర్యం ఉండాలన్నది ఆంధ్రా ప్రాంత వాసుల అభిప్రాయం. కృష్ణా, గోదావరి డెల్టాలు భారతదేశ ధాన్యాగారాలుగా పేరుగాంచాయి కాబట్టి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి సౌకర్యం ఉండటం మంచిదే. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ లోటు భర్తీ చేసుకునే వీలుంది. బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు తగిన పరిహారమిచ్చి ఆ ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.
విద్యుత్‌రంగంపై కమిటీ అభిప్రాయాలివీ...
కోస్తాంధ్ర, రాయలసీమల మాదిరిగానే తెలంగాణలోనూ విద్యుత్ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు గానీ తెలంగాణ , రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలపై ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదు.
తెలంగాణలో అపారమైన బొగ్గు గనులు ఉండగా, కోస్తాంధ్రలో భారీస్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రక ంగా చూస్తే రాయలసీమే వెనుకబడి ఉంది.
విద్యుత్ ప్రాజెక్టులకు స్థల ఎంపికలో రాష్ట్ర విద్యుత్ బోర్డు, ఏపీ జెన్‌కో ఎలాంటి వివక్ష పాటించలేదు.
మిగతా ప్రాంతాలతో పోలిస్తే విద్యుత్ వినియోగం తెలంగాణలోనే అధికంగా ఉంది. ఇది ఆ ప్రాంత పురోగతిని సూచిస్తోంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రజలే ఎక్కువ సబ్సిడీ పొందుతున్నారు.
జల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాలి
కృష్ణా, గోదావరి బేసిన్లతోపాటు రాష్ట్రంలోని ఇతర బేసిన్లలో జల పంపిణీని పర్యవేక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి, రాజ్యాంగ సాధికారత కల్గిన సాంకేతిక జల నిర్వహణ బోర్డును ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య నీటి పంపిణీని పర్యవేక్షించడం ఈ బోర్డు ప్రధాన విధిగా ఉండాలి. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో సమతుల్యత పాటించేలా చూడాలి. సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన సమస్త అంశాలనూ ఈ బోర్డే పరిష్కరించాలి. రాష్ట్రానికి చెందని నిపుణుడిని కేంద్రమే దీనికి చైర్మన్‌గా నియమించాలి.
నీటి వనరుల అభివృద్ధి సంస్థ కూడా..
భూగర్భ జలాలు, ఇళ్లకు నీటి సరఫరా, వాననీటి సంరక్షణ, వాటర్‌షెడ్ల నిర్వహణ, ఇంకుడు గుంతలు, ట్యాంకుల నవీకరణ తదితరాంశాలు ఈ సాగు/నీటి వనరుల అభివృద్ధి సంస్థ పర్యవేక్షించాలి. పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి నీటి వనరుల అభివృద్ధికి ఇది కృషిచేయాలి. ఈ సంస్థకు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఓ వ్యక్తిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా, ప్రాజెక్టుల కోసం రెండు లేదా మూడు ప్రాంతాల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు డెరైక్టర్లను నియమించాలి.
No comments:
Post a Comment