....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 3

ఒప్పందాల అమలే కీలకం!

అధ్యాయం-1

శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక మొదటి అధ్యాయంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి చోటుచేసుకున్న పరిణామాలను నాలుగు దశలుగా విభజించి చెప్పింది. 1956-73 (విశాలాంధ్ర ఏర్పాటు నుంచి జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల ముగింపు దాకా), 1973-2000, 2001-2009 (టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి 2009 దాకా), నవంబరు 29, 2009- డిసెంబరు 31, 2010 (కేసీఆర్ దీక్ష నుంచి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ దాకా)... ఇలా నాలుగు భాగాలుగా విడగొట్టింది. పరిచయంలో ఆంధ్ర ఏర్పాటు, నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడం, ఆపై విశాలాంధ్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరించింది. పార్లమెంటు, శాసనసభ ప్రసంగాలు, ప్రభుత్వ అధికారిక గెజిట్‌లనే కాకుండా... ఒడంబడికలను, ఒప్పందాలను, వివిధ సందర్భాల్లో చరిత్రకారులు, ప్రముఖ నాయకులు రాసిన పుస్తకాల్లో పేర్కొన్న విషయాలను ప్రామాణికంగా తీసుకొని ఉదహరించింది.

‘‘చారిత్రకమైన పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్నింటిని అమలు చేయకపోవడంతో రాష్ట్ర విభజన డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే... మరో ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవినివ్వాలనేది ఒప్పందంలోని ఓ ముఖ్యాంశం. ఒప్పందంపై సంతకం చేసిన వారిలో ఒకరైన నీలం సంజీవరెడ్డియే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా దీనికి ససేమిరా అన్నారు. డిప్యూటీ సీఎం పదవిని ఆరోవేలుగా ఆయన అభివర్ణించినట్లు వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ వాదుల్లో అసంతృప్తి రగలడానికి ఇదో ముఖ్య కారణమైంది. జల వనరుల పంపకం, భూమి యాజమాన్యం అంశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. 1960లో దామోదరం సంజీవయ్య .. కె.వి.రంగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా అసమతౌల్యతను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఏర్పాటు రెండేళ్లకే పరిమితమైంది.

సంజీవ రెడ్డి మళ్లీ సీఎం కాగానే డిప్యూటీ అక్కర్లేదన్నారు. మళ్లీ 1969లో జై తెలంగాణ ఉద్యమం తర్వాతే సీఎం ఒక ప్రాంతం వారుంటే... మరో ప్రాంతానికి డిప్యూటీ సీఎం పదవినివ్వాలనే ఫార్ములాను పునరుద్ధరించారు. ముల్కీ నిబంధనల మూలంగా కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందడం గగనమైపోయింది. వారిలో అసంతృప్తి రాజుకుంది. సొంత రాష్ట్రంలో, అదీ రాజధానిలో తమకు అవకాశాల్లేకపోవడమేమిటని భావించారు. ముల్కీ నిబంధనలను హైకోర్టులో సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవని 1972 ఫిబ్రవరి 14న 4-1 మెజారిటీతో హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా ముల్కీ నిబంధనల అమలుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. స్వరాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండడం కంటే తెలంగాణతో సంబంధాలు తెంచుకోవడమే మంచిదనే ఆలోచనతో ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలైంది. జనవరి 1973లో రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించారు. ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో ఆరు సూత్రాల పథకం రూపొందింది. తెలంగాణ రీజినల్ కమిటీ రద్దయింది. రాష్టస్థ్రాయి ప్రణాళిక బోర్డు, మూడు ప్రాంతాలకు మూడు అభివృద్ధి మండళ్లు వచ్చాయి.

ఆరు సూత్రాల అమలుతో శాంతి నెలకొన్నా, స్థిరమైన అభివృద్ధి నమోదైనా... ప్రభుత్వోద్యోగాల్లో తమ వాటాపై తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనుమానాలు మాత్రం తొలగలేదు. వారి విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ ఎన్‌జీవోలతో విస్తృతంగా చర్చించి 610 జీవోను విడుదల చేసింది. ‘‘18.10.1975 తర్వాత ఆరు సూత్రాల ఫార్ములాలోని జోనల్ నిబంధనలకు విరుద్ధంగా జోన్- 5, జోన్-6 (తెలంగాణ జోన్‌లు) కేటాయించిన ఉద్యోగులందరినీ అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి 31-03-1986లోగా వెనక్కి పంపాలన్నది జీవో సారాంశం. అయినా లోపాలను సరిదిద్దాలని విజ్ఞాపనలు వస్తుండటంతో ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ 30-09-2004న నివేదికను ఇచ్చింది. 35 దిద్దుబాటు చర్యలను సిఫారసు చేసింది. మంత్రుల బృందాన్ని నియమించిన ప్రభుత్వం 10.08.2006న గిర్‌గ్లానీ నివేదికను ఆమోదించినా జీవో అమలులో తీవ్ర జాప్యం జరిగిందని తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తెలంగాణ ఉద్యమానికి అవసరమైన సైద్ధాంతిక, నిర్మాణ మద్దతును టీఆర్‌ఎస్ అందివ్వగలిగింది. ఉద్యమాన్ని నిలబెట్టింది. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఎన్నికల ద్వారా తమ ప్రాముఖ్యతను చాటడానికి ప్రయత్నించింది. 2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, 2009లో టీడీపీలు టిఆర్‌ఎస్‌తో జట్టు కట్టడం గమనార్హం. 2009 మే నుంచి నవంబరు దాకా ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలేవి (తెలంగాణకు సంబంధించి) జరగలేదు. తెలంగాణ తెచ్చుకునే క్రమంలో భారీ కార్యాచరణను రూపొందించుకుంటున్నామని, తాను నవంబరు చివరి వారంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్నానని కేసీఆర్ ప్రకటించారు’’ అని తెలిపింది.

No comments:

Post a Comment