....

Footer Right Content

Tuesday, September 21, 2010

యుగపురుషుడు మన గురజాడ

నేడు గురజాడ అప్పారావు 148వ జయంతి

అంధయుగం మీద ఉషస్సులా జ్వలించే శక్తిని అక్షరంలో నిక్షిప్తం చేసిన యుగపురుషుడాయన.
సామాజిక వికృతిని ప్రతిబింబించే అద్దంలా మారే విద్యను అక్షరానికి నేర్పినవాడాయన.
ఆయనే గురజాడ వేంకట అప్పారావు గారు. మధురవాణి అనే వేశ్యారత్నం ఈ క ళింగ దేశంలో పుట్టకపోతే ఎంత లోపం జరిగేదో కదా! అంటాడు ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్ర్తి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గురజాడ అనే మహా రచయిత తెలుగునాట పుట్టకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప శూన్యం ఆవహించేది.

గురజాడ (21.9.186230.11.1915) విశాఖ జిల్లాలోని ఎలమంచిలి వద్ద ఉన్న సర్వసిద్ధి రాయవరంలో పుట్టారు. తండ్రి వెంకటరామదాసు విజయనగరం సంస్థానంలో ఉద్యోగి. తల్లి కౌసల్యమ్మ. వెంకటరామదాసు ఉద్యోగరీత్యా చీపురుపల్లిలో ఉన్నందున అప్పారావుగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. వ్యవహారిక భాషా నినాదానికి పదును పెట్టి తరువాత కాలాలలో భాషామతల్లిని కాపాడిన గిడుగు రామమూర్తి పంతులు అక్కడే అప్పారావుగారి సహాధ్యాయి.

తరువాత విజయనగరంలోని ఎంఆర్ కాలేజీలో చదువుతున్నపుడు నాటి ప్రిన్సిపాల్ సి.చంద్రశేఖరశాస్ర్తి ప్రోత్సాహం లభించింది. సోదరుడు శ్యామలరావుతో కలిసి తొలిరోజులలో అప్పారావుగారు రచనలు చేసేవారు. ముఖ్యంగా కవిత్వం సోదరులు ఇద్దరూ కలిసి రాసేవారు. తరువాత విజయనగరం విద్యా సంస్థలలో ఇంగ్లిష్ బోధకునిగా, పురాతన శాసనాల పరిష్కర్తగా పని చేశారు. ఆ క్రమంలోనే విజయనగర సంస్థానం పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం ఫలితమే ‘కన్యాశుల్కం’ నాటకం.

1892లో (సవరణలతో 1909లో మళ్లీ వెలువరించారు) అప్పారావుగారు ‘కన్యాశుల్కం’ నాటకం రాశారు. దాదాపు నూట ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పటికీ ఆ నాటకం సరసన నిలబడగలిగిన నాటకం తెలుగులో రాలేదంటే అతిశయోక్తి కాదు. 19వ శతాబ్దానికి విజయనగరం సంస్థానంలో అగ్రవర్ణం సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కళ్లకు కడుతుంది ‘కన్యాశుల్కం’. డబ్బు ఇచ్చి బాలికలను పెళ్లి చేసుకోవడం ఇందులో ప్రధాన వస్తువు. వేశ్యా సంపర్కం, విధవా పునర్ వివాహం సమస్యలు ఇందులో సమాంతరంగా చర్చకు వస్తాయి. నాటకంలోని చాలా అంశాలు ఇప్పుడు సమాజంలో కనిపించక పోవచ్చు. కానీ గురజాడ ఆవిష్కరించిన సాహితీ విలువలు నేటికీ మార్గదర్శకంగానే ఉన్నాయి. పలు సంభాషణా శకలాలు నిత్యసత్యాల వలె వెలుగొందుతున్నాయి. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడూ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటీషన్ కానేరడోయ్’, ‘మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్లు చేస్తే మోసం’, ‘ఆత్మానుభవం అయితే తప్ప తత్వం బోధపడదు’, ‘దబాయించడమే కదన్నా పోలీసు డ్యూటీ’ వంటి ఉల్లేఖనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కల మీద నర్తిస్తూనే ఉన్నాయి. ‘పెళ్లిళ్లలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు’ అంటుంది ఒక పాత్ర. ఈ నాటకం వందేళ్ల క్రితం రాసినది. కానీ ఆ మాట నేటికీ వర్తిస్తుందంటే అంగీకరించేవారే ఎక్కువ. మధురవాణి గురజాడ మహాకవి సృష్టించిన అద్భుతపాత్ర. ఈ పాత్ర తరువాత ఎన్నో స్ర్తీ పాత్రలకు జన్మనిచ్చింది.

మూఢ నమ్మకాల మీద గురజాడ సంధించిన వ్యంగ్య బాణాలు అపూర్వం, అద్భుతం. ఇంగ్లిష్ చదువు మీద ఆనాటి సమాజంలో ఉన్న వ్యామోహం ఎలాంటిదో గిరీశం, ఆయన ప్రియశిష్యుడు వెంకటేశం మధ్య జరిగే సంభాషణ ద్వారా గురజాడవారు రమణీయంగా చిత్రించారు. మధ్య మధ్య ఇంగ్లిష్ ముక్కలను మెరిపిస్తూ గిరీశం ది గ్రేట్ పలికే సంభాషణలు మరచిపోవడం సాధ్యం కాదు. దెయ్యాల భయం మీద, వాటిని పట్టి సీసాలలో బంధించడం మీద గురజాడ ఈ నాటకంలో పొందుపరిచిన దృశ్యాలు నభూతో నభవిష్యతి. లేని దెయ్యాన్ని పూజారి గవరయ్య సీసాలో బంధించడం అనే సన్నివేశంతో ఆయన సమాజంలో ఉండే డొల్లతనం నిజరూపాన్ని ఆవిష్కరించారు.

గిరీశం, మధురవాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, కరటకుడు, బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మ, పూజారి గవరయ్య, సౌజన్యారావు చిరంజీవులుగా నిలిచిపోయే పాత్రలు. ।స్ర్తీజాతి చరిత్రను తిరగరాస్తుంది* అన్న తన అచంచల విశ్వాసానికి తగ్గట్టుగా గురజాడ తన స్ర్తీ పాత్రలను చిత్రించారు. మధురవాణి, బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మ ఏ పాత్రను చూసినా వాటి పట్ల గొప్ప సానుభూతి కనపరుస్తారాయన.

కథకునిగా కూడా గురజాడ సమున్నత శిఖరాలను అధిరోహించారు. ‘మీపేరేమిటి?’, ‘దిద్దుబాటు’, ‘మెటిల్డా’, ‘పెద్ద మసీదు’,‘సంస్కర్త హృదయం’ వంటి కొన్ని కథలే రాసినా అవి ఆధునిక కథకు నమూనాలుగా భాసిల్లాయి. ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ అంటూ మొదలయ్యే ‘మీపేరేమిటి?’ కథ మతంలోని వికారాలను వర్ణిస్తుంది. ముసలిభర్తతో వేగుతున్న భార్య కథ మెటిల్డా. సంస్కర్త హృదయం కథను పూర్తి చేశాక, ఆ కథలోని సరళ పాత్ర ప్రభావం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ‘దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!’ అని నినదించినవాడు గుర జాడ. దేశభక్తికి ఆయన చెప్పిన ఈ నిర్వచనం నాటికీ నేటికీ వేదమంత్రం వలె మోగుతున్నది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ఆయన అనుసరించిన వైఖరి అంతుబట్టకుండా ఉంటుంది. ఆయన కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. దగ్గరగా ఆ సంస్థ కార్యకలాపాలు చూశారు. అయినా కొన్ని చురకలు వేశారు. బాల్య వివాహాలలోని విషాదాన్ని కళ్లకు కడుతూ ఆయన కలం నుంచి వెలువడిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం ప్రతి హృదయాన్ని గాయపరుస్తుంది. కన్యక, లవణరాజు కల ఆయన ఇతర కవితా ఖండికలు. ఈ కవితా ఖండికల కోసం ఆయన సృష్టించుకున్న ఛందస్సు ముత్యాలసరం.

తిక్కన, వేమన, గురజాడ ఆధునిక సాహిత్యంలో కవిత్రయం అంటారు శ్రీశ్రీ. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ ఆధిక్యానికి కారణాలను శ్రీశ్రీ గొప్పగా ఆవిష్కరించారు. మొత్తంగా తెలుగు సాహిత్యం మీద గురజాడ జాడ సుదీర్ఘమైనది. ఆయన సౌందర్య దృష్టి విశిష్టమైనది. హాస్యర చనలో, వ్యంగ్య ధోరణిలో ఆయన పెట్టిన ఒరవడి తెలుగు సాహిత్యంలో కొనసాగకపోవడం తరువాతి తరాల దురదృష్టం మాత్రమే.

1 comment:

  1. మంచి వ్యాసం రాసారు. ఎప్పటికీ మరువలేని నాటకం కన్యాశుల్కం.

    ReplyDelete