....

Footer Right Content

Saturday, September 4, 2010

విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో ఉధృతంగా, తెలంగాణాలో చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే
అవకాశముంది. గత 24 గంటల్లో మచిలీపట్నంలో 17, కొయ్యలగూడెంలో 15, అమలాపురం - భీమవరంలో 14, విజయవాడ - వెంకటాపురంలో 13, కొయిడా- కూనవరంలో 12, కోడేరులో 11, బాపట్ల - గుడివాడ - సిర్పూర్‌లలో 10, అవనిగడ్డలో తొమ్మిది, నూజివీడు - తెనాలిలో ఎనిమిది, గుంటూరు - ఆర్మూరు - దుమ్ముగూడెం - ఏటూరునాగారం - కైకలూరు - ప్రకాశం బ్యారేజి - రేపల్లె - తాడేపల్లిగూడెంలో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయి.

వరంగల్‌లో నీట మునిగిన లోతట్టు
నాగార్జునసాగర్‌కు వరద చేరుతుండటంతో 14 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌లో 584 అడుగుల నీరు నిల్వ ఉంది. 3.30 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.4 లక్షల క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు. వరంగల్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుడిసెలు పూర్తిగా నీటమునిగాయి. రెండు లక్షల మంది ఇబ్బంది పాలయ్యారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కరీంనగర్‌ జిల్లాలో పలు వాగులు పొంగిపొర్లాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి మంథని డివిజను పరిధిలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోయర్‌ మానేరు డ్యాముకు మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.
గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శనివారంనాడు కోనసీమలో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. అమలాపురం, రాజోలు, మలికిపురం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది. వర్షాలకు పైర్లు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయానికి 59.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెం, భీమవరం, ఆచంట, పెంటపాడు, పెనుగొండ ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో పైర్లు ముంపుబారిన పడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment