....

Footer Right Content

Wednesday, September 15, 2010

79 ఏళ్ల తెలుగు సినిమా

మనిషిని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో సినిమా ఒకటి.  భాషా, ప్రాంతం... అనే ఎల్లలు లేనిది సినిమా. అసలు ఈ సినిమా  పదం 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 'పురోగమనంలో ముందుకు పోవడం' అనేది దీని అర్థం. నాడు కదిలిన బొమ్మ, నేడు ఆధునికపు హంగులతో వేగంగా పరుగెడుతోంది. ఎన్నో వింతలు, విశేషాలు, విప్లవాలు మానవ సమాజంలో చోటుచేసుకోవడానికి కారణమైన ఈ కదిలేబొమ్మ తెలుగువారికి పరిచయమై నేటికి 79 సంవత్సరాలు.

ఈ సందర్భంగా సినిమా గురించి...1913లో తొలిభారతీయ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను దాదాసాహెబ్‌ ఫాల్కే తీశారు. ఇది మూకీ చిత్రం. అంటే తెరపై బొమ్మలు మాత్రమే కదులుతాయి. నటుల హావభావాలతోనే సినిమా కథను అర్థం చేసుకోవాలి. తొలిటాకీ చిత్రం 'అలం అరా'. ఇది 1931, మార్చి 14న హిందీలో విడుదలైంది. ఈ చిత్రానికి అర్దేశ్రీ ఇరానీ దర్శకత్వం వహించాడు. ఇదే అలం అరా చిత్రానికి, అర్దేశ్రీ ఇరానీ వద్ద సహాయక దర్శకుడిగా పనిచేసిన తెలుగువాడు హనుమప్ప మునియప్ప రెడ్డి. ఇతడే హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఇరానీ ప్రోత్సాహంతో తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద' తీశాడు.

భారత్‌ మూవీ టోన్‌ (శ్రీకృష్ణ ఫిలిం కంపెనీ) బ్యానర్‌లో మాణిక్యాలాల్‌శేఠ్‌ నిర్మాతగా హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'భక్తప్రహ్లాద'. నాటకాలు, తోలుబొమ్మలాట, వీధినాటకాలు, చెక్కభజనలు, గొల్లకుర్మలు...మొదలైనవి సినిమాలు రాకముందు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, సమాచారాన్ని, చరిత్రను అందించేవి. నాటి రోజుల్లో సురభీ నాటక పరిషత్‌ అంటే చాలా క్రేజ్‌. సిఎస్‌ఆర్‌.ఆంజనేయులు సారథ్యంలో ఈ నాటక పరిషత్‌ నడిచేది. సురభి నాటక సమితి స్క్రిప్ట్‌ రాయగా, హెచ్‌.ఆర్‌.పద్మనాభశాస్త్రి సంగీతం సమకూర్చారు. తెలుగునాట పౌరాణిక నాటకాల ప్రభావం ముమ్మరంగా ఉండటంతో సురభి బృందం ప్రదర్శిస్తున్న 'భక్తప్రహ్లాద' నాటకాన్ని సినిమా కోసం ఎంపిక చేశారు. ధర్మవరం కృష్ణమాచార్యులు రాసిన నాటకం ఇది. సురభి బృందాన్నే బొంబాయికి తీసుకు వెళ్ళి, అలంఅరా చిత్రానికి వేసిన సెట్‌లోనే 'భక్తప్రహ్లాద' తీయడానికి ప్లాన్‌ చేసారు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. సిఎస్‌ఆర్‌.ఆంజనేయులు ఎంతో సాయం చేశారు.

అప్పట్లో వెంకటగిరి రాజా వారిచేత నటశేఖర బిరుదు పొందిన వల్లూరు వెంకట సుబ్బారావు ఈ చిత్రంలో హిరణ్యకశిపుడిగా నటించారు. సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకున్న వి.వి.సుబ్బారావు 1929లో తండ్రి మరణించడంతో స్వగ్రామం మునిపల్లె వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తరుణంలో హెచ్‌.ఎం.రెడ్డి ఆయన్ను బొంబాయి తీసుకెళ్ళాడు. లీలావతి పాత్రను సురభి కమలాభాయి పోషించారు. తొలి తెలుగు కథానాయిక.

'ఆ రోజుల్లో ఇప్పటిలాగా గ్లిజరిన్‌ పెట్టుకుని ఏడ్చేవాళ్ళం కాదు. మూడ్‌ తెచ్చుకుని ఏడ్చేవాళ్లం. ఎక్కిళ్లతో ఏడ్వటం పరిపాటి. ఆరోజుల్లో నటీనటులంతా 20 గంటలు పనిచేస్తుండే వాళ్లం. రోజులో మూడు, నాలుగు గంటలే విశ్రాంతి దొరికేది. నాకు ముందు మాట్లాడుకున్న పారితోషికం 500 రూపాయలు. అది నా పాల ఖర్చులకే అయిపోయింది. నా అవస్థ చూసి చిత్ర నిర్మాత మాణిక్యాలాల్‌ శేఠ్‌ ప్రత్యేకంగా వెయ్యినూట పదహార్లు ఇచ్చారు' అని కమాలాబాయి నాటి సంగతులను ఓ సారి తెలిపారు. ప్రహ్లాదుడిగా మాస్టర్‌ కృష్ణారావు పోషించారు. ఈ చిత్ర నిర్మాణం 20 రోజుల్లో పూర్తయింది. 20 వేల రూపాయలు ఖర్చయ్యాయి. బొంబాయిలోని ఇంపీరియల్‌ స్టూడియోలో నిర్మాణం జరిగింది. 1931 సెప్టెంబర్‌ 15న విడుదలైంది. తొలి టాకీ విడుదలయిన తర్వాత 1931లోనే మరో 23 హిందీ చిత్రాలు, 4 బెంగాలీ చిత్రాలు, ఒక తమిళ చిత్రం కూడా విడుదలయ్యాయి. ఆ తర్వాత 'భక్తప్రహ్లాద' చిత్రం 1942లో శోభనాచల పిక్చర్స్‌, 1967లో ఏవీఎం ప్రొడక్షన్స్‌ నిర్మించాయి. ఎంతమంది తీసినా ప్రజాదరణ చూరగొన్న చిత్రమిది.

No comments:

Post a Comment