....

Footer Right Content

Thursday, September 16, 2010

దీనికి బాధ్యులెవరు...?

రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా ముఖ్యంగా ఆ ప్రభావం బస్సులపై  పడుతోంది. కనిపించిన బస్సులపై వారు ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రజలపైనే భారాలు మోపుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు...  రాష్ట్రంలో ఏ ఆందోళన, బంద్ జరిగినా అందరి ప్రతాపం బస్సులపైనే.  గతంలో ఆర్టీసీ అధికారులు 'నేనేం పాపం చేశాను' అంటూ బస్సు ప్రశ్నిస్తున్నట్లుగా మంటల్లో దగ్ధమైన బస్సులను ప్రదర్శనకు పెట్టినప్పటికీ
దాడులు మాత్రం ఆగడంలేదు. గత ఎనిమిది మాసాలుగా ప్రత్యేక తెలంగాణా, ఆంధ్ర ఆందోళనలు, బంద్‌లు పెద్ద ఎత్తున జరిగాయి. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన రాజకీయ అనిశ్చితి వల్ల ఈ ఆందోళనలు పెచ్చరిల్లాయి. వీటివల్ల గతంలో ఎన్నడూ లేనంతగా గత ఎనిమిది మాసాల్లో ఆర్టీసీకి భారీ నష్టం చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 800 బస్సులు ధ్వంసం అయ్యాయని, దీనివల్ల రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.  వాటిల్లుతోందంటున్నారు.

ఇటీవల గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలంటూ తెలంగాణా జిల్లాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో ఒకే రోజు రూ.5.4 కోట్ల రోజు వారి నష్టం వాటిల్లిందట. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు సుమారు 54 బస్సులను ధ్వంసం చేశారని ఆర్టీసి వారు లెక్కలు చెబుతున్నారు. బంద్‌ల సమయంలో కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం ఎవరు భరించాలి...? దీనికి బాధ్యులెవరు..?

 బందులు, ధర్నాలు చేయడాన్ని ఎవరూ ఆక్షేపించరు.  ఎటొచ్చీ ఆ సమస్యకు పరిష్కారం  బస్సులను ధ్వంసం చేయడమే కాకూడదు. ఇలాంటి అనాలోచిత సంఘటనల వల్ల  నష్టపోయేది ఎవరు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించాలి. ముఖ్యంగా ఇటువంటి సంఘటనలకు విద్యావంతులే కారణం కావడం దురదృష్టకరం.  ఎంతోమందికి జీవనోపాధి చూపుతూ, రాష్ట్రప్రజలకు సేవ చేస్తున్న ఈ సంస్థను నష్టపరచడం అంటే మన ఇంటిని మనం నష్టపర్చుకోవడం కాదా? ఇదేదో సూక్తులు చెపుతున్నారన్నట్లుగా కాకుండా దీనిలోని వాస్తవాలు, పరిణామాలవైపు ప్రతి ఒక్కరూ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనావుంది.

No comments:

Post a Comment