....

Footer Right Content

Thursday, September 2, 2010

శ్మశానాలనూ వదలరా?

ఇక శ్మశానాలకూ ప్రైవేటు చావొచ్చిపడింది. తొలుత ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని శ్మశానాలనూ వ్యక్తులకూ, సంస్థలకూ ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో 10 వేల మంది కాటికాపరుల కుటుంబాలు వీధిన పడను న్నాయి. ఇన్నాళ్లూ శ్మశానాలను నమ్ముకొని బతుకుతున్న వారిని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థల పెత్తనానికి శ్మశానాలను వదిలేందుకు
రంగం సిద్ధమవుతోంది. తొలి దశలో ధార్మిక, స్వచ్ఛంద, బహుళజాతి సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. శ్మశానాల అభివృద్ధికి నగరపాలక సంస్థ ఇకమీదట ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. అంతా ప్రైవేటుమయమే. ప్రైవేటు సంస్థలు శ్మశానాలను సుందరంగా తీర్చిదిద్దాలి. ప్రహరిగోడలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, అస్థికలు భద్రపరుచు కునేందుకు ప్రత్యేకంగా గదులు నిర్మిస్తారు. మృతదేహాలను తరలించేందుకు వాహ నాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులు చేపట్టి నందుకుగాను తొలి విడతలో ఐదేళ్లపాటు శ్మశానాల నిర్వహణను సంబంధిత సంస్థలకే వదిలేస్తారు. అవసరమైతే దీన్ని మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

            ఎలాంటి లాభాపేక్షా లేకుండా ప్రైవేటు సంస్థలు కోట్ల రూపాయల నిధుల్ని ఎందుకు ఖర్చు చేస్తాయనే ప్రశ్నకు సేవా దృక్పథం అంటూ అధికారులు భాష్యం చెప్తున్నారు. నిర్వహణ కాలంలో వాటిపై వచ్చే ఆదాయాన్ని ఆయా సంస్థలకే ఇస్తారు. శ్మశానాల్లో ఆయా కులాల వారి సంప్రదా యాల ప్రకారం దహనం, ఖననాలకు కచ్చితమైన రేట్లు నిర్ణయించనున్నారు. ఇప్పుడున్న రేట్లకన్నా ఇవి రెండింతలు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్రేటర్‌ హైదరా బాద్‌లోని అనేక వేల ఎకరాల శ్మశాన భూములు కబ్జాదారుల పాలయ్యాయి. వాటిని అరికట్టడం చేతకాని అధికారులు ఇప్పుడు అభివృద్ధి పేరుతో అధికారికంగానే వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. దీనికి అధికారులు పెట్టిన ముద్దుపేరు 'ఫండ్‌ యువర్‌ సిటీ'.
ఇవీ శ్మశానాల లెక్కలు
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని శ్మశానవాటి కలన్నీ 2008 వరకూ రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఆ తర్వాత వీటిని జిహెచ్‌ఎంసికి బదలాయించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 391, రంగారెడ్డి జిల్లా పరిధిలో 291 శ్మశానాలను రెవెన్యూ శాఖ మహా నగరపాలక సంస్థకు బదలా యించింది. మిగిలినవి ఎక్కడెక్కడఉన్నాయనే దానిపై రెవెన్యూ విభాగం ఇప్పుడు పరిశీలన జరపుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం వివిధ మతాలకు చెందిన 1200 నుంచి 1400 శ్మశానాలు నగరంలో ఉన్నాయి. 625 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో కోటి మందికి పైగా ఉన్న జనాభాకు ప్రస్తుతమున్న శ్మశాన వాటికలు సరిపోవని తేలింది. శివారు ప్రాంతాల్లో సహా నగరంలోనూ శ్మశానాలు రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
శ్మశానాల్లోనే కూలీలైన కాటికాపరులు
హైదరాబాద్‌లోని పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్‌, పురానాపూల్‌, మారేడుపల్లి ప్రాంతాల్లోని శ్మశానవాటికలు ఇప్పటికే ప్రైవేటు కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఈ శ్మశానాలకు నిత్యం పెద్ద సంఖ్యలో మృతదేహాలు వస్తుంటాయి. గతంలో ఈ శ్మశానాలనే నమ్ముకుని జీవనోపాధి పొందిన కాటికాపరులు ఇప్పుడు అక్కడే కూలీలుగా పనిచేస్తున్నారు. కొందరికి మాత్రమే నెలవారీ వేతనాలు చెల్లిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ఈ శ్మశానాలు ప్రైవేటు పరమయ్యాయి. అప్పట్లో కాలనీ సంక్షేమ సంఘాలు 30 శాతం నిధులు సమకూర్చుకుంటే ప్రభుత్వం 70 శాతం భరించి శ్మశానాలను అభివృద్ధి చేసింది. ఆ మేరకు కొందరు వ్యక్తులు సంఘాలుగా ఏర్పడి వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో అప్పటి వరకూ శ్మశానాన్నే కేంద్రంగా చేసుకుని బతికిన కాటికాపరులు కూలీలుగా మారిపోయారు. ఇప్పుడు కార్పొరేషన్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్ని శ్మశానాల్లోనూ ఇదే దుస్థితి ఏర్పడనుంది.

No comments:

Post a Comment