....

Footer Right Content

Saturday, September 4, 2010

రోగాంధ్రప్రదేశ్‌ !

ఆంధ్రప్రదేశ్‌ రోగాల ముసురుతో జబ్బుపడింది. ప్రాణాలతో పరిహాసమాడే పాలకుల నిర్లక్ష్యం వల్ల అటు ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం దాకా, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ మహమ్మారి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగ్యూ సెరిబ్రియల్‌ మలేరియా తదితర వ్యాధులతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఆగస్టు నెలలో వందమందికిపైగా, ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 20 రోజుల్లో 50 మంది మృత్యువాత పడ్డారంటే జబ్బుల తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండునెలల్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు
సోకి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 70 మంది మరణించిన సంగతి తెలిసిందే. అనధికార లెక్కల ప్రకారమయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతక రోగాలకు నట్టిల్లుగా రాష్ట్రం వర్థిల్లుతోంది. మన్నెంలో మరణమృదంగ ఘోషను పలు వార్తా కథనాలే ప్రతిధ్వనిస్తున్నాయి. స్వయానా సిఎం సిక్‌ అవడంతో పాటు ఆయన స్వంత జిల్లాల్లోనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారంటే మిగిలిన రాష్ట్రం ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.
వానాకాలం అంటేనే అంటువ్యాధులకు ఆలవాలం. అతిసారం మలేరియా తదితర రోగాల ధాటికి ప్రజారోగ్యం విలవిల్లాడే సమయం. జబ్బులు తరుముకొచ్చే సీజన్‌లోకి అడుగుపెడుతున్నా ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం చికిత్సకు ఎంత ప్రాధాన్యముందో, వ్యాధి నివారణ చర్యలకు అంతకన్నా ప్రాధాన్యతనివ్వాలని భూరి కమిటి చేసిన సూచనలు ప్రపంచబ్యాంకు మైకంలో పడిన మన పాలకు ల చెవికెక్కడం లేదు. కేరళలో అక్కడి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో దీటైన ముందస్తు చర్యలు తీసుకోవటంతో అక్కడిపుడు వ్యాధుల ఊసే లేదు. వ్యాధుల విజృంభణకు పారిశుద్ద్య లేమి ఒక ముఖ్య కారణం. మన రాష్ట్ర నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని ప్రయివేటీకరించడంతో అది ప్రజలకు ఎండమావే అయింది. అనేక పనులతో పాటు పారిశుద్ధ్యాన్ని కాపాడే పంచాయితీ కార్మికులు ఇరవై రోజుల నుంచి సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ పేర పారిశుద్ధ్యానికి కేంద్రం కేటాయించిన నిధులను కూడా ఖర్చుపెట్టడం లేదంటే రాష్ట్ర సర్కార్‌ నిర్లక్ష్యం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. రక్షిత మంచినీటిని ప్రజలకు అందించడం ద్వారా 8ంశాతం వ్యాధులను అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిని కూడా అందించలేని దుస్థితిలో పాలకులున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఒకపక్క ప్రజల నిజవేతనాలు పడిపోవడం, ఇంకొక పక్క ఆహార ద్రవ్యోల్బణం ఎగబాకటంతో పేదవాడి బతుకు మరింత దుర్భరమయింది. వచ్చే ఆదాయం తిండిగింజలకు కూడా సరిపోక పౌష్టికాహార లోపం ఏర్పడుతోంది. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడంతో చిన్న జబ్బు వచ్చినా తట్టుకోవడం కష్టమవుతోంది.
వైద్యరంగంలోనూ ముమ్మరంగా 'బ్యాంకు' విధానాలను రాష్ట్ర సర్కార్‌ అమలుచేస్తోంది. అందులో భాగంగానే వైద్య ఆరోగ్యశాఖను క్రమేణా నిర్వీర్యం చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరిట వైద్యఆరోగ్యశాఖలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ విధానాలతో ఇప్పటికే 80శాతం వైద్యం ప్రయివేటు చేతుల్లోకి వెళ్లిపోయింది. మిగిలిన 20 శాతాన్ని కార్పొరేట్‌ పరం చేసేందుకు ప్రభుత్వం తహతహలాడుతోంది. ప్రజారోగ్యవ్యవస్థకు పునాదైన ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను ప్రయివేటీకరించేందుకు, స్వచ్చంద సంస్థలకు అప్పచెప్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న అనేక పోస్టులను సర్కార్‌ భర్తీ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1572 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో సరిపడా వైద్యులు లేక, మందులు అందక అనేకమంది చిన్నచిన్న వ్యాధులకే మృత్యువాతపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారాసిట్మాల్‌ కూడా అందుబాటులో లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆరోగ్యరంగానికి స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం నిధులివ్వాల్సి ఉండగా ఇప్పటికీ మన ప్రభుత్వాలు ఒక్క శాతానికి మించి కేటాయించడం లేదంటే ప్రజారోగ్యంపట్ల పాలకుల శ్రద్ధ ఏపాటిదో మనకు అర్ధమవుతోంది. అపర సంజీవని అంటూ ఊదరగొట్టిన ఆరోగ్యశ్రీ పేరిట కోట్ల రూపాయల నిధుల్ని కార్పొరేట్‌కు కట్టబెట్టి సాధారణ, ప్రభుత్వ ఆస్పత్రులను విస్మరించారు. ప్రజలను ఎక్కువగా బాధించే సీజనల్‌ వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు. ఇటు వైద్యం చేయించుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను మందులు, సిబ్బంది, సదుపాయాల కొరత వెంటాడుతోంది. అటు ప్రయివేటు ఆసుపత్రుల ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుని పరిస్థితి దినదినగండంగా తయారయింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల గుత్తాధిపత్యం పెరగడానికి, సామాన్యుడికి వైద్యం అందుబాటులో లేకపోవడానికి పాలకుల విధానాలే కారణం. ప్రభుత్వ విధానాల్లోనే మౌలిక మార్పు రావాలి. అవసరమైన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని ఆసుపత్రులకు యుద్ధ ప్రాతిపాదికపై సరఫరా చేయాలి. డాక్టర్లు, పారామెడికల్‌ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలి. రోగాల బారిన పడ్డ రాష్ట్రానికి తొందరగా స్వస్థత చేకూర్చాలి.

No comments:

Post a Comment