ఎరుపురంగుతో అలరించే "పుచ్చకాయ" వేసవిలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేసవిలో అధిక వేడినుంచి, వడదెబ్బనుంచి కాపాడే పుచ్చకాయలోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడిన వారు దీనిని తినట్లయితే శరీరం నిస్తేజం అవకుండా కాపాడుతుంది. పుచ్చలో లభించే బి విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
పుచ్చకాయలో 92 శాతం మేరకు నీరే ఉంటుంది. అది శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, మూత్రనాళాలలో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ ఒక ఔషధం లాంటిదనే చెప్పవచ్చు. ఇంకా రక్తపోటుతో బాధపడేవారు పుచ్చకాయను తీసుకోవటం మంచిది. ఈ కాయలోని పొటాషియం, మెగ్నీషియంలో రక్తపోటును అదుపులో ఉంచేందుకు తోడ్పడుతాయి.
ఈ కాయలో శక్తి, కెలోరీలు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేటులు, కొవ్వు, పీచు పదార్థాలు, సోడియం, పొటాషియం.. లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు అధికంగా ఉండే పుచ్చ.. హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఇందులో ఎక్కువగా లభించే బీ విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడుతుంది. ఇన్‌ఫెక్షను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
అయితే వేసవిలో ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లో దొరికే పుచ్చకాయలను ఏవి పడితే అవి కొనేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మంచి ఆకుపచ్చని రంగులో ఉండే వాటినే ఎంచుకోవాలి. కాయపై వేలితో కొడితే బోలు శబ్దం వచ్చినప్పుడే కొనాలి. అలా బోలు శబ్దం వచ్చినట్లయితే అది బాగా పండినదని అర్థం చేసుకోవాలి. అలాగే తేలికగా ఉండేదాన్ని కాకుండా బాగా బరువుగా ఉన్న కాయను ఎంపిక చేసుకోవాలి.
ముఖ్యంగా ఈ కాయలను కాయలుగా ఉన్నప్పుడే కొనాలి. కోసి ముక్కలు చేసి అమ్మేవాటికి దూరంగా ఉండాలి. ఎండలో వడదెబ్బనుంచి కాపాడటమేకాకుండా.. ఆస్తమా, చక్కెర వ్యాధి, కీళ్ల నొప్పుల్లాంటి వ్యాధులకు కారకమయ్యే పరిస్థితులను సైతం పుచ్చకాయ నివారిస్తుంది. కాబట్టి.. పచ్చ పచ్చాని పుచ్చకాయల్ని ఓ పట్టు పట్టేద్దామా..?!
No comments:
Post a Comment