....

Footer Right Content

Monday, May 3, 2010

జలుబును, షుగర్ తగ్గించే "జామ"

మనలో చాలామంది జామపళ్లను తింటే త్వరగా జీర్ణం కావని, జలుబు చేస్తుందని చెబుతుంటారు. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. జామపండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉండే పీచు పదార్థం అరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.

జామపండు పై తొక్కలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. అదే విధంగా ఇందులో ఏ, బీ విటమిన్‌లు అధిక మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జామపండులోకంటే దోర కాయల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని పలువురు వైద్యుల అభిప్రాయం. అదే విధంగా జామ ఆకులను చిగుళ్లవాపుకు మందులా కొంతమంది వాడుతుంటారు.

కాగా.. మైర్టసీన్ జాతికి చెందిన జామఫలం భూమధ్యరేఖా ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. మెక్సికో, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల నుంచి మనవైపు విస్తరించిన జామ ప్రస్తుతం ఆసియా ఖండం అంతగా విరివిగా పండుతోంది. వందకు పైగా జామ జాతుల రకాలు ఉన్నాయి.

నేడు పండిన జామకాయల నుంచి జామ్స్, జెల్లీస్ లాంటివి కూడా తయారు చేస్తున్నారు. జామ ఎసెన్స్‌తో ఇప్పుడు కూల్‌డ్రింకులు కూడా వస్తున్నాయి. పోషక ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం అధికమొత్తంలో లభ్యం కావటమేకాకుండా 28.55 శాతం పీచు పదార్థం లభ్యమవటంవల్ల జామకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

జామలో 1.05 శాతం మాత్రమే కొవ్వు ఉండటంవల్ల ఊబకాయులు సైతం కావాల్సినన్ని తినవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జామ ఆకుల నుంచి తీసిన ఆయిల్‌ను యాంటీ క్యాన్సర్ మందుగా వాడుతున్నట్లు కూడా ఇటీవలి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఆ దిశగా ఇంకా పరిశోధనలు ముమ్మరం అయ్యాయి.

అదే విధంగా జామ ఆకులు రోగనిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. సో.. ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న జామను చవక పండే కదా అని అశ్రద్ధ చేయకుండా.. చిలక్కొట్టిన జామ రుచిని ఆస్వాదిస్తారు కదూ...!!

No comments:

Post a Comment