తెలుగు ప్రజలను 38ఏళ్ల పాటు అలరించిన మానసవీణ మూగబోయింది. 'మానసవీణ మధుగీతం...' అంటూ ఉర్రూతలూగించిన ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి హైదరాబాద్‌లో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వేటూరికి భార్య సీతామహాలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల కిందట గ్యాస్ట్రిక్ సమస్య అంటూ ఏషియన్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ఇతర సమస్యలున్నాయని చెప్పడంతో శుక్రవారం రాత్రి కేర్ ఆసుపత్రిలో చేరారు. వూపిరితిత్తుల్లో తీవ్రంగా రక్తస్రావం జరగడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు.
వేటూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి సోదరుడి కుమారుడు సుందరరామమూర్తి. 1950లో ఆయన మద్రాసు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో
ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. సుందరరామమూర్తి తొలినాళ్లలో నటుడు కావాలని ఆశపడ్డారు. తరవాత రచనవైపు దృష్టిపెట్టారు. బెజవాడలో బియ్యే పూర్తిచేశాక మరోసారి మద్రాసు వెళ్లారు. ఆయన, నటుడు కైకాల సత్యనారాయణ పక్కపక్క గదుల్లో ఉండేవారు. ముక్త్యాల రాజా సిఫార్సుపై వేటూరి 'ఆంధ్రప్రభ'లో ఉపసంపాదకుడిగా చేరారు. 1956 నుంచి పదహారేళ్లపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయన పాత్రికేయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం... శ్రీశైలం ప్రాజెక్టుకి పునాదిరాయి వేసినప్పుడు రిపోర్టింగ్ చేయడం. ఆయన రోజు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఉపన్యాసాన్ని వార్తగా అందించిన విధానం ప్రతి ఒక్కరి మెప్పూ పొందింది. ఏళ్లు గడిచినా వేటూరికి నెహ్రూ ఉపన్యాసమంతా గుర్తుండేది. తరవాతి రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికకు సినిమా ఎడిటర్‌గా పని చేశారు.
తెలుగు సినిమా పాట నిస్తేజంగా ఉన్న సమయంలో చిత్రసీమలో అడుగుపెట్టారు వేటూరి. ఆయన రాసిన 'సిరికాకుళం చిన్నది' అనే సంగీత రూపకం అప్పట్లో ఆలిండియా రేడియోలో ప్రసారమైంది. ఈ రూపకం ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకొంది. అలా వేటూరి రచనపై ఆకర్షితులైన వారిలో నాటి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఒకరు. ఆయన ప్రోత్సాహంతోనే వేటూరిలోని గీత రచయిత 'దీక్ష' చిత్రం కోసం కలం విదిల్చారు. 'నిన్న రాతిరి కలలో...' అనే పాట రాశారు. అది రికార్డు కాలేదు. కె.విశ్వనాథ్ 'ఓ సీత కథ' కోసం రాసిన పాటే తొలి గీతంగా చెప్పుకోవాలి. 'భారతనారీ చరితము... మధుర కథాభరితము...' అనే గీతాన్ని కేవీ మహదేవన్ స్వర సారథ్యంలో రాశారు. పి.లీల గానం చేశారు. వేటూరి గీత రచయితగా తొలి అడుగులు వేసే సమయంలో ఎన్టీఆర్, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు అండగా నిలిచారు. అందుకే పలు సందర్భాల్లో 'వాళ్లు నాకు త్రిమూర్తులు' అనేవారు వేటూరి. గీత రచయితగా ప్రవేశించిన మూడేళ్ల కాల వ్యవధిలోనే యావత్ చిత్రసీమనూ తనవైపు తిప్పుకోగలిగారు. 'సిరిసిరిమువ్వ'లో 'ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం', 'సీతామాలక్ష్మి'లో 'సీతాలు సింగారం...', 'శంకరాభరణం'లోని అన్ని గీతాలూ కావ్య గౌరవంతో అలరారాయి. అలాగే 'అడవి రాముడు'లో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను...'లాంటి అల్లరి పాటే కాదు 'మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ' లాంటి భావస్ఫోరకమైన గీతాన్నీ అందించారు. అటు కావ్యగౌరవం ఉన్న పాటలే కాదు కమర్షియల్‌గా ఈలలు వేయించే గీతాలూ వేటూరి నుంచి వచ్చాయి. పద్నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారాయన. ఉషాకిరణ్ మూవీస్ వారి 'ప్రతిఘటన'లో రాసిన 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో...' గీతానికి వేటూరి తప్పకుండా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకుంటారని ఆశించారు. కానీ దక్కలేదు. 'మాతృదేవోభవ'లో 'రాలిపోయే పువ్వా...' గీతానికి జాతీయ గౌరవం దక్కింది. వేటూరి ఆ తరాన్నే కాదు ఈ తరాన్నీ ఉర్రూతలూగించారు. ఇటీవల వచ్చిన 'వరుడు'లో 'అయిదు రోజుల పెళ్లి' గీతం యువతరం సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా, కాలర్ ట్యూన్‌గా వినిపిస్తోందంటే వేటూరి కలం ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. తెలుగు పాటను లాలించి పాలించి శాసించిన వేటూరి మన మధ్య లేకపోయినా ఆయన పాటను తెలుగు శ్రోతల హృదయాల్లో మోగుతూనే ఉంటాయి.
కైకాల వారి స్పందన ఎక్కడ కనిపించలేదు . కారణం తెలియదు.కాని మండలి వారి స్పందన తెలిపారు. కైకాలవారికి వేటూరి వారికి ఎమైన గొడవలా తెలియదు.
ReplyDeletenijame namDi chala badakara maina vishayam
ReplyDelete