....

Footer Right Content

Friday, January 22, 2010

మన తెలుగు తేజం కమ్యూనిస్టు గాంధీ


ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన మన తెలుగుతేజం పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985). ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.

పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేసాడు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో చదివాడు.ఈయన్ని "కమ్యూనిస్టు గాంధీ" అంటారు. పార్లమెంటు భవనంలో 'చప్రాసీ'ల సైకిళ్లతోపాటు ఈయన 'సైకిల్' కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.

గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై సుందరయ్య 1930లో తన 17వ యేట హైస్కూలు రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహంలోను, సహాయ నిరాకరణోద్యమంలోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్ బోర్స్టల్ స్కూల్‌లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు.

అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ముఖ్య కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యలుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి క్రమంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సెక్రటరీ అయ్యాడు.

అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తరువాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను సెంట్రల్ కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబూద్రిపాద్, కృష్ణపిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీనుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రాంభించాడు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రాంభించిన వారిలో సుందరయ్య ఒకడు. ఆ సభకు జాయింట్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు, 1939 నుండి 1942 వరకు, నాలుగేళ్ళు అజ్ఞాతంలో గడిపాడు.

1943లో నిషేధం ఎత్తివేశారు. బొంబాయిలో మొదటి పార్టీ కాంగ్రెస్ జరిగింది. తరవాత రెండవ పార్టీ కాంగ్రెస్ కలకత్తాలో జరిగింది. రెండుసార్లు సెంట్రల్ కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యాడు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటంను సమర్ధిస్తూ తీర్మానం చేసింది. దీనిని "కలకత్తా థీసిస్" అంటారు. అప్పటి జనరల్ సెక్రటరీ బి.టి.రణదివే ఈ తీర్మానాన్ని బలంగా సమర్ధించాడు. తత్ఫలితంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించారు. త్రిపుర, తెలంగాణా, తిరువాన్కురు ప్రాంతాలలో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది తెలంగాణా సాయుధ పోరాటం.

ఈ పోరాటాలలో నిజాం పాలనా కాలంలో సాగిన తెలంగాణా సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పోరాటానికి ముఖ్యమైన నాయకులలో సుదరయ్య ఒకడు. ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడు. 1952లో ప్రత్యేక పార్టీ సమావేశంలో మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నుకొనబడ్డాడు. పార్టీ అత్యున్నత స్థాయి సంఘమైన "పాలిట్ బ్యూరో" సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. విజయవాడలో జరిగిన 3వ పార్టీ కాంగ్రెసులోను, పాలక్కాడ్‌లో జరిగిన 4వ పార్టీ కాంగ్రెసులోను కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

తరువాత అమృత్‌సర్‌లో జరిగిన 5వ పార్టీ కాంగ్రెస్‌లో సెంట్రల్ ఎక్సిక్యూటివ్ కమిటీకి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ సమయంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి వచ్చాయి. 1962 చైనా భారతదేశం యుద్ధం‌సందర్భంగా పార్టీ నాయకత్వంలో ఎస్.ఎ. డాంగే వర్గం భారత దేశ ప్రభుత్వాన్ని సమర్ధించింది. అంతే కాకుండా చైనా రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పంథాను సమర్ధించింది. అయితే పి.సి.జోషి, రణదివె వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్టు మార్గంగా భావించింది. డాంగే వర్గాన్ని లెఫ్టిస్టులనీ, రణదివె వర్గాన్ని రైటిస్టులనీ అన్నారు.

లెఫ్టిస్టు వర్గంలో ఉన్న ప్రముఖ నాయకుడైన సుందరయ్య అమృత్‌సర్ సమావేశం సమయంలో పార్టీ నాయకత్వంలో అధికుల (డాంగే వర్గం) దృక్పథాన్ని వ్యతిరేకిస్తూ తన బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశాడు. చైనా యుద్ధం సమయంలో నవంబరు 1962 లో సుందరయ్యను అరెస్టు చేశారు.

డిసెంబరు 1972లో సుందరయ్య తయారు చేసిన ఒక రిపోర్టును భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) విడుదల చేసింది. "తెలంగాణా ప్రజల పోరాటం - దాని పాఠాలు" అన్న ఈ నివేదికలో సుందరయ్య అప్పటి పరిస్థితులనూ, పార్ఠీ విధానాలనూ, పోరాట క్రమాన్నీ విశదంగా విశ్లేషించాడు.

పైన చెప్పిన విభేదాల ఫలితంగా అక్టోబరు-నవంబరు 1964లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్‌లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులనబడేవారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో క్రొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి సుందరయ్య జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఈ సమావేశం జరిగిన కొద్ది కాలంలోనే భారత జాతీయ కాంగ్రెసు పాలనలో ఉన్న భారత దేశ ప్రభుత్వం అనేక "సి.పి.ఐ-ఎమ్" నాయకులను అరెస్టు చేసింది. సుందరయ్య కూడా అలా అరెస్టయిన వారిలో ఒకరు. మే 1966 వరకు నిర్బంధంలో ఉన్నారు. 1975-1977 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించినపుడు సుందరయ్య అజ్ఞాతంలోకి వెళ్ళారు.

1976 వరకు సుందరయ్య సి.పి.ఐ-ఎమ్ పార్టీ జనరల్ సెక్రటరీగా అవిచ్ఛిన్నంగా కొనసాగారు. 1976లో, ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో, పార్టీలో పొడసూపుతున్న "రివిజనిస్టు" భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య జనరల్ సెక్రటరీ పదవికి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు.

1952లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యారు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై 1967 వరకు శాసన సభ సభ్యునిగా కొనసాగారు. మళ్ళీ కొంత కాలం విరామం తరువాత 1978లో శాసన సభకు ఎన్నికయ్యారు. 1983 వరకు శాసనసభ సభ్యునిగా ఉన్నారు.

తన మరణ సమయానికి సుందరయ్య ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు. అతని భార్య లీల సుందరయ్య కూడా సి.పి.ఐ.-ఎమ్ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు.

* గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు.
* ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.
* తాను ఎక్కడికి వెళ్ళినా తన సామాను తానే మోసుకొనేవారు. తన బట్టలు తానే ఉతుక్కునేవారు.
* సంతానం కలిగితే ప్రజాసేవకు అడ్డు కాగలదనే కారణంతో కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకున్న వ్యక్తి. ఇటువంటి త్యాగం మహాభారతంలో భీష్ముడు చేశారు.
* కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరైన పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. పార్టీ శ్రేణులు ఈయనను "కామ్రేడ్ పి.ఎస్." అని ఎంతో అభిమానంగా పిలుస్తారు.

No comments:

Post a Comment