....

Footer Right Content

Sunday, November 14, 2010

సినీ భీష్ముడు... డీవీఎస్‌ రాజు

 తెలుగు చిత్రసీమకు భీష్మాచార్యుడుగా ప్రశంసలందుకొన్న రాజు భౌతికంగా  దూరమైనా... ఆయన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. డీవీఎస్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన 'మంగమ్మ శపథం', 'తిక్క శంకరయ్య', 'జీవన జ్యోతి' లాంటి చిత్రాల్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. కథను నమ్మిన నిర్మాత ఆయన. ఇటీవలి కాలంలో మారిపోయిన సినీ వ్యాపారాన్ని గమనిస్తూ... నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు. కేవలం తన
చిత్రాల నిర్మాణానికే డీవీఎస్‌ రాజు పరిమితం కాలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారాయన. తండ్రి దాట్ల
బలరామరాజు పార్లమెంట్‌ సభ్యునిగా పని చేశారు. నిజానికి డీవీఎస్‌ రాజు వైద్య విద్యను అభ్యసించాలనుకొన్నారు. ఆ ఉద్దేశంతోనే మద్రాసు వెళ్లారు. కానీ ఆయన దృష్టి వ్యాపార రంగమ్మీదికి మళ్లింది. 1948లో సినీ లిథో వర్క్‌ను ప్రారంభించారు. ఆ రోజుల్లో రూ.10 లక్షల పెట్టుబడితో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమాల వాల్‌పోస్టర్లు, ప్రచార పత్రాల్ని ముద్రించేవారు.  ఆయన సంస్థ నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేది కాదన్న గుర్తింపు దక్కించుకొంది. ఆ క్రమంలో రాజుకి సినీ రంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌కి సంబంధించిన ఎన్‌.ఎ.టి. సంస్థ నిర్మించిన 'పిచ్చిపుల్లయ్య'కి ప్రచార, ప్రకటన పత్రాలు ముద్రించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా బలపడింది. ఎంతగానంటే ఎన్‌.ఎ.టి.లో భాగస్వామిగా చేరేంతగా! వారి భాగస్వామ్యంలో 'తోడు దొంగలు', 'గులేబకావళి కథ' లాంటి చిత్రాలొచ్చాయి. 1959లో ప్రగతి ఆర్ట్స్‌ అనే సంస్థ ద్వారా 'మాబాబు' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఇందులో ఏఎన్నార్‌, సావిత్రి జంటగా నటించారు. ఆ తరవాతే డీవీఎస్‌ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి ఎన్టీఆర్‌తో  'మంగమ్మ శపథం' నిర్మించారు. ఇది ఘన విజయం సాధించడంతో వరుసగా ఎన్టీఆర్‌తోనే చిత్రాలు నిర్మించారాయన. జానపదమైనా, సాంఘికమైనా, పౌరాణికమైనా కథ బలంగా ఉండాల్సిందే అని  నమ్మిన నిర్మాత ఆయన. స్క్రిప్టు విషయంలో ఏ మాత్రం రాజీ పడేవారు కాదు. చిత్ర నిర్మాణంలోనూ ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. కాబట్టే అయిదున్నర దశాబ్దాలపాటు ఈ రంగంలో ఉన్నా పాతిక చిత్రాల్ని మాత్రమే నిర్మించారాయన. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'జీవన జ్యోతి'కి ఉత్తమ చిత్రం పురస్కారం దక్కింది. 


నిర్మాతగా ఉంటూనే తన అనుభవాన్నీ, ఆలోచనల్నీ రంగరించి చిత్రసీమకు ఎంతో సేవ  చేశారాయన. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలికి అధ్యక్షుడిగా డీవీఎస్‌రాజు పని చేశారు. ఆ కాలంలోనే  కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించారు. దీని ద్వారానే రజనీకాంత్‌,  చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ లాంటి మేటి తారలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. చిరంజీవిని ఆ శిక్షణాలయంలో చేర్పించడంలో రాజు మాట సాయం చేశారు. రెండు దఫాలు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి  అధ్యక్షులుగా పని చేశారు. రిచర్డ్‌ ఆటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' చిత్రానికి సంబంధించి మన దేశంలో  ఎదురైన ఇబ్బందుల్ని తొలగించడంలో రాజు చొరవ చూపించారు. ఫలితంగానే ఆ చిత్రం ద్వారా వచ్చిన  లాభాల్లో అయిదు శాతం 'సినీ ఆర్టిస్ట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా'కి దక్కాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు 1984-'89లో ఎఫ్‌డీసీ అధ్యక్షులుగా పని చేశారు. అప్పుడే హైదరాబాద్‌లో లలిత కళాతోరణం నిర్మించారు. అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. తిరిగి 2002-04 మధ్య కాలంలో ఆ సంస్థకి అధ్యక్షులుగా వ్యవహరించారాయన. రాజు అందించిన సేవలకుగాను 1989లో మన రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1995లో చెన్నైలో దక్షిణభారత చలనచిత్ర  వాణిజ్యమండలి రాజుని 'సినీ భీష్మ' అనే బిరుదుతో ఘనంగా సత్కరించింది. పుణెలో ఉన్న ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ స్థాయిలోనే హైదరాబాద్‌లోనూ ఓ చలనచిత్ర భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని ఎంతో తపించారు.

No comments:

Post a Comment