....

Footer Right Content

Tuesday, October 5, 2010

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మెరిసిన తెలుగు తేజం

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆటలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు వెలుగు విరజిమ్మింది. మన రాష్ట్రానికి చెందిన వి. శ్రీనివాసరావు పురుషుల వెయిట్‌ లిప్టింగ్‌ (56 కిలోలు) విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఆయన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని కొండవెలగాడ గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉంటూ ఆర్మీ ఉద్యోగిగా సేవలందిస్తున్నారు.  

సోమవారం జరిగిన 56 కేజీల విభాగంలో అతను 248 కేజీల బరువులెత్తి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 240 కేజీలే. ''నాలుగేళ్ళ నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నో కష్టాలను అధిగమించి సాధన చేశా. అమ్మానాన్న, చెల్లి అందరికి దూరంగా ఉన్నా. చివరకు ఫలితం దక్కింది. స్వర్ణం లేదా రజతం సాధించాల్సింది. కాంస్యమైనా తక్కువేమీ కాదు'' అని పతకం గెలిచిన అనంతరం శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'తో చెప్పాడు. ''15 ఏళ్ళ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన చేస్తున్నా. 2002లో సర్వీసెస్‌లో హవాల్దార్‌ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి నాయక్‌ సుబేదార్‌గా ప్రమోషన్‌ లభిస్తుంది'' అని శ్రీనివాసరావు సంతోషంగా వివరించాడు. విజయనగరం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన శ్రీనివాసరావుకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలు అభినందనలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అభినందించారు.

శ్రీనివాసరావు పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువు కున్నాడు. ఆయన తల్లిదండ్రులు సింహాచలం, పెదనారాయణ వ్యవసాయం చేస్తూ కుమారుడిని చదివించారు. పదోతరగతి వరకే చదివిన శ్రీనివాసరావు 1997-98లో విజయ నగరం పట్టణంలోని రాజీవ్‌స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో కోచ్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ఎన్‌ శర్మ వద్ద వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు. 2002లో విశాఖలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 56 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అదేఏడాది ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. 2004లో హైదరాబాద్‌లో జరిగిన ఆఫ్రో ఆసియన్‌ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకం పొందాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడి నుంచే ఆయన కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి జిల్లాకు, రాష్ట్రానికి వన్నె తెచ్చాడు. శ్రీనివాసరావుకు పతకం రావడంపట్ల ఆయన స్వగ్రామంలోనూ, జిల్లాలోనూ ఆనందాలు వెల్లువిరిశాయి. 

No comments:

Post a Comment